పేల్చివేత అనంతరం ఆధునికంగా నిర్మించిన కరకగూడెం పోలీస్ స్టేషన్
సాక్షి, కరకగూడెం(ఖమ్మం): కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై మావోయిస్టులు మెరుపు దాడి చేసి 16 మంది పోలీసులను బలిగొన్న విషాద సంఘటనకు నేటితో 23 ఏళ్లు పూర్తయ్యాయి. ఉమ్మడి ఏపీ, ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని పినపాక మండలం పూర్తి నక్సల్స్ ప్రభావిత ప్రాంతంగా ఉండేది. 1997, జనవరి 9న అర్ధరాత్రి సుమారు 2 గంటల సమయంలో సుమారు 100 మంది మావోయిస్టులు సాయుధులై కరకగూడెం(అప్పుడు పినపాక మండలంలో ఉండేది) ఠాణాపై దాడికి పాల్పడ్డారు. బాంబులతో స్టేషన్‌ను పేల్చివేశారు. విచక్షణారహితంగా కాల్పులు జరిపి 16 మంది పోలీసులను బలిగొన్నారు. మందుగుండు, తుపాకులను అపహరించారు. పోలీస్ సిబ్బంది బీహెచ్‌ఎఫ్ సెట్ ద్వారా సమీపంలోని ఏడూళ్ల బయ్యారం పోలీస్ స్టేషన్‌కు అదనపు సాయం కావాలని సమాచారం అందించి ప్రతిదాడి చేసేలోపే మావోయిస్టులు పోలీస్ స్టేషన్‌ను లూటీ చేసి వెళ్లిపోయారు.
గ్రామస్తులు ఇళ్ల నుంచి బయటకు వచ్చేసరికే ఠాణాలో మృతదేహాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. పాండవ, కిన్నెర, ఏటూరునాగారానికి చెందిన జంపన్న దళాలు ఈ దాడిలో పాల్గొన్నాయి. మృతిచెందిన 16 మందిలో 8 మంది సివిల్ పోలీసులు, ఏపీఎస్పీకి చెందిన 5వ బెటాలియన్ (విజయ నగరం)కు చెందిన 8 మంది పోలీసులు ఉన్నారు. పోలీస్ స్టేషన్ పేల్చివేత ఉమ్మడి రాష్ట్రంలో పెను సంచలనంగా మారింది. ఆ నాటి సీఎం చంద్రబాబు నాయుడు అప్పటి హోం మంత్రి మాధవరెడ్డి, మరో మంత్రి తుమ్మలతో కలిసి కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. ఈ ఘటన తర్వాత పోలీసులు ఏజెన్సీ ప్రజలతో సత్ససంబంధాలు కొనసాగిస్తూ... మావోయిస్టు కార్యకలాపాలకు క్రమంగా చెక్ పెడుతూ వచ్చారు. కరకగూడెం పోలీస్ స్టేషన్‌ను అత్యంత ఆధునికంగా దాడులను ప్రతిఘటించేలా నిర్మించారు.
జంపన్న మార్గదర్శకత్వంలో..
కరకగూడెం పోలీస్ స్టేషన్ పేల్చివేతలో ప్రధాన సూత్రధారి, మావోయిస్టు అగ్రనేత జంపన్న అలియాస్ జి నర్సింహారెడ్డి మూడేళ్ల క్రితం హైదరాబాద్‌లో పోలీసుల సమక్షంలో తన భార్యతో కలిసి లొంగిపోయాడు.
ఇప్పటికీ మర్చిపోలేం..
23 యేళ్ల క్రితం మావోయిస్టులు కరకగూడెం పోలీస్ స్టేషన్‌పై దాడి సంఘటనను ఇప్పటికీ మరువలేకపోతున్నాం. ఆ రోజూ రాత్రి మా గ్రామాన్ని పూర్తిగా మావోయిస్టులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. మేము భయం గుప్పిట్లో బిక్కుబిక్కుమంటూ గడిపాం. –సయ్యద్ ఖాజా హుస్సేన్, కరకగూడెం
మరుభూమిలా..
అర్ధరాత్రి వేళ బాంబులు, తూటాల శబ్దాలతో గ్రామం దద్ధరిల్లింది. ఇంట్లో నుంచి బయకొస్తుండగా.. బయటకు రావద్దని మావోయిస్టులు హెచ్చరిక చేశారు. దీంతో గ్రామస్తులెవరూ బయటకు రాలేదు. తెల్లారి చూస్తే పోలీస్ స్టేషన్ మరుభూమిలా కన్పించింది. – సార భిక్షం, కరకగూడెం గ్రామస్తుడు
అమరుల ఆశయ సాధనే లక్ష్యం
పోలీస్ అమరుల ఆశయ సాధనే మా లక్ష్యం. ప్రజా రక్షణ కోసం ప్రాణాలు వదిలిన వారి ఆశయాలను స్మరించుకుంటూ విధులు నిర్వహిస్తున్నాం. పోలీసు అమరవీరుల త్యాగాలు స్మరించుకోవడం ప్రతి పౌరుడి బాధ్యత. – సునీల్‌దత్, ఎస్పీ, భద్రాద్రి కొత్తగూడెం
Comments
Please login to add a commentAdd a comment