
అనుభవించుదాం ఇగ..
‘కొట్లాడి తెలంగాణ తెచ్చాం.. అనుభవించుదాం ఇగ.. ఎన్నిరోజులు పని చేసినా గింతే..
⇒ జేఏసీ నేత పిట్టల సంభాషణ?
⇒ కలకలం సృష్టిస్తున్న ఆడియో రికార్డ్
⇒ బయటపెట్టిన జేఏసీ నేత బియ్యంకర్
సాక్షి, సిరిసిల్ల: ‘కొట్లాడి తెలంగాణ తెచ్చాం.. అనుభవించుదాం ఇగ.. ఎన్నిరోజులు పని చేసినా గింతే.. గోడకు కొట్టిన పిడకల్లెక్క ఇంతే.. వాడొక్కడే అనుభవించుడా.. మనం అనుభవించొద్దా.. ఇంకా కొట్లాడుడేనా.. మన జీవితాలు మనం చూసుకుందాం.. నీ ఎనుక నేనున్నా.. రేపు మీటింగ్‌కు రా.. రూ.2 లక్షలు ఇస్తా’అంటూ జేఏసీ నేత పిట్టల రవీందర్ మాట్లాడినట్లుగా చెబుతున్న రికార్డులు సంచ లనం సృష్టిస్తున్నాయి.
జేఏసీ చైర్మన్ కోదండ రాంతో విభేదించి తిరుగుబాటు చేసిన జేఏసీ నేత పిట్టల రవీందర్.. రాజన్న సిరిసిల్ల జిల్లా జేఏసీ కో కన్వీనర్ బియ్యంకర్ శ్రీనివాస్‌తో జరిపిన సంభాషణలు శుక్రవారం వెలుగు చూశాయి. జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండ రాంకు వ్యతిరేకంగా హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరు కావాలంటూ బియ్యంకర్‌ను రవీందర్ ఆహ్వానించే క్రమం లో ప్రలోభాలకు గురిచేయడం కలకలం సృష్టిస్తోంది. వ్యాపారం చేసుకోవడానికి, జీవితంలో స్థిరపడడానికి రూ.2 లక్షలు వడ్డీ లేకుండా చేబదులుగా ఇస్తానని, మీటింగ్‌కు రావాలంటూ శ్రీనివాస్‌ను మచ్చిక చేసు కునేందుకు యత్నించారు.
ఆడియో రికార్డు బయటపెట్టిన బియ్యంకర్
పిట్టల రవీందర్ తనతో మాట్లాడిన సంభాష ణల ఆడియో రికార్డును బియ్యంకర్ బయట పెట్టారు. హైదరాబాద్ సమావేశానికి ముందు తనతో మాట్లాడుతూ రూ.2 లక్షలు ఇస్తానం టూ ప్రలోభపెట్టారనే రికార్డును గురువారం రాత్రి జేఏసీ పెద్దలకు శ్రీనివాస్ పంపించారు. శుక్రవారం మీడియాకు రికార్డు లీక్ కావడం సంచలనం సృష్టించింది. జేఏసీపై కుట్ర జరు గుతోందంటున్న కోదండరాం వ్యాఖ్యలకు ఆడియో రికార్డు బలం చేకూర్చినట్లయింది.
పిట్టల తప్పు చేస్తుండు: బియ్యంకర్
జేఏసీలో రవీందర్ కోవర్ట్‌గా మారాడు. ఆయనే తప్పులు చేస్తూ జేఏసీపై నిందలు వేస్తున్నడు. హైదరాబాద్ సమావేశానికి ముం దురోజు ఉదయం నాకు ఫోన్ చేసిండు. వేము లవాడకు చెందిన జేఏసీ నాయకుడు కనుక య్యతో కలసి నన్ను రమ్మన్నడు. రాజకీయ పార్టీలతో కలిసే జేఏసీ ఏర్పడింది. తెలంగాణ వచ్చింది. ఇప్పుడు రాజకీయ పార్టీలతో కలవడమెందుకంటున్నడు. మేం మాత్రం కోదండరాం నాయకత్వంలోనే పనిచేస్తాం.