సాక్షి, జగిత్యాల: బీర్బల్ కథలు వినే ఉంటారు. ‘బీర్’బాబుల లేఖ ఎప్పుడైనా చదివారా? వేసవిలో మందుబాబుల దాహం తీర్చే ‘బీర్’కాయల కోసం జగిత్యాల వాసులు ఏకంగా తమ జిల్లాను త్యాగం చేయడానికి సిద్ధపడ్డారు. కిక్కిచ్చే ‘కింగ్‌ఫిషర్’ కోసం కరీంనగర్ జిల్లాకు మారిపోతామంటున్నారు!
తెలంగాణ స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాల సందర్భంగా ఈ విచిత్ర ఘటన వెలుగులోకి వచ్చింది. జగిత్యాల రాయికల్ మండలం మూటపల్లి గ్రామంలోని బ్యాలెట్ బాక్స్ లోంచి బయటపడ్డ ఉత్తరం సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. తమ జిల్లాను తిరిగి కరీంనగర్ జిల్లాలో విలీనం చేయాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావును కోరుతూ జగిత్యాల వాసుల పేరుతో ‘బీర్’కాయుడెవరో ఈ లేఖ రాశారు. మంగళవారం ఓట్ల లెక్కింపు సందర్భంగా ఇది బయటపడింది. తమకెంతో ఇష్టమైన బీర్ జగిత్యాల జిల్లాలో లభ్యంకానందున తమ జిల్లాను కరీంనగర్‌లో కలిపేయాలని లేఖలో కోరారు. కింగ్‌ఫిషర్(కేఎఫ్) బీర్‌ను అందుబాటులో ఉంచాలని పనిలో పనిగా అభ్యర్థించారు. ఈ లెటర్ చదివి జనాలు తెగ నవ్వుకుంటున్నారు. అయితే ఈ లేఖ బ్యాలెట్ బాక్స్‌లో రాలేదని, ఇదంతా ఫేక్ అని స్థానికులు అంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment