
జగ్గన్న మళ్లీ జంప్?
సంగారెడ్డి మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మళ్లీ పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు.
మాజీ ఎమ్మెల్యే తూర్పు జయప్రకాష్ రెడ్డి అంటే ఎక్కువ మందికి తెలియకపోవచ్చు గానీ.. జగ్గారెడ్డి అంటే మాత్రం వెంటనే తెలుస్తుంది. బారెడు గెడ్డం, బాగా పెరిగిన జుట్టుతో ఎప్పుడూ ఘాటు విమర్శలు చేస్తుండే జగ్గారెడ్డి మరోసారి పార్టీ మారేందుకు సిద్ధపడ్డారు. ఈసారి మళ్లీ కాంగ్రెస్ పార్టీలో తన లక్కును పరీక్షించుకోవాలని ఆయన అనుకుంటున్నారు.
కాంగ్రెస్ పార్టీ తరఫున సంగారెడ్డి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆయన.. ఆ తర్వాత బీజేపీలోకి చేరి గత ఎన్నికల్లో మెదక్ పార్లమెంటరీ స్థానానికి పోటీపడ్డారు. టీఆర్‌ఎస్ నుంచి కొత్త ప్రభాకర్‌రెడ్డి, కాంగ్రెస్ తరఫున సునీతా లక్ష్మారెడ్డి ఈ ఎన్నికల్లో పోటీచేశారు. అయితే జగ్గారెడ్డి టీఆర్ఎస్ చేతిలో ఓడిపోయారు. మొదట్లో బీజేపీ కార్యకర్తగా ఉండి, ఆ తర్వాత టీఆర్ఎస్లోకి వెళ్లిన ఆయన.. అటునుంచి కాంగ్రెస్ పార్టీలోకి జంప్ చేశారు. గత ఉప ఎన్నికలకు కొన్నాళ్ల ముందే ఆయన బీజేపీ తీర్థం పుచ్చుకున్నారు. ఇప్పుడు మరోసారి చెయ్యందుకోవాలని ఉబలాటపడుతున్నట్లు సమాచారం.