ఏళ్ల తరబడి ఎదురుచూసిన రోజు రానే వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు గంటల సమయమే మిగిలింది. జిల్లావ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రెండు రోజులు రాష్ట్రావతరణ వేడుకలతో పాటు వారోత్సవాలు ఘనంగా నిర్వహించుకునేందుకు ఊరూవాడా ముస్తాబైంది. చారిత్రక కట్టడాలు... పుణ్యక్షేత్రాలన్నీ విద్యుత్ దీపాల అలంకరణతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. చిరకాల వాంఛ నెరవేరుతున్న వేళ ప్రజలు కోటి ఆశలతో... కొంగొత్త ఆలోచనలతో కొత్త రాష్ట్రంలో అడుగిడేందుకు సిద్ధమయ్యారు.
సాక్షి, కరీంనగర్ : తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలకు జిల్లా ముస్తాబైంది. పోరాడి సాధించుకున్న రాష్ట్రాన్ని ఘనంగా స్వాగతించేందుకు ప్రభుత్వంతోపాటు రాజకీయపార్టీలు, ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కవులు, కళాకారులు, క్రీడాకారులు, స్వచ్ఛంద సంస్థలు, కార్మిక, కర్షకులు సిద్ధమయ్యారు. ఈ నెల 1, 2 తేదీల్లో రాష్ట్రావతరణ వేడుకలు ఘనంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. 2న గ్రామస్థాయిలో ప్రభుత్వ ఉద్యోగులు, స్థానిక సంస్థల ప్రతినిధులను ఉదయం 9 గంటలకు గ్రామ పంచాయతీ కార్యాలయానికి ఆహ్వానించి.. సర్పంచ్ ఆధ్వర్యంలో జాతీయ జెండావిష్కరణ.. గీతాలాపన చేయించాలని కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య ఆదేశాలు జారీ చేశారు.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి ప్రతీఒక్కరు పునరంకితమయ్యేలా ప్రతిజ్ఞ చేయిం చి.. తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించడంతోపాటు శాంతి కపోతాలు, బెలూన్లు ఎగురవేయాలన్నారు. డప్పులు.. బోనాలు, కోలాటాలు, తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే విధంగా కళారూప కార్యక్రమాలు నిర్వహించాలని సూచిం చారు. ప్రభుత్వ కార్యాలయాలను విద్యుత్ దీపాలు, పూలతో అలంకరించాలని ఆదేశించారు. అన్ని శాఖల జిల్లా, మండల కార్యాలయాల్లోనూ వేడుకలు జరిపేందుకు ఆయా శాఖల అధికారులు, ఉద్యోగులు ఏర్పాట్లు చేసుకున్నారు.
జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో.. రెండో తేదీన ఉదయం 9 గంటలకు ‘ప్రభాత్‌భేరి’(ర్యాలీ) నిర్వహించి.. జాతీయ పతాకాన్ని ఎగురవేయనున్నారు. పాఠశాలలకు విద్యార్థులు వారి తల్లిదండ్రులతోపాటు కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, వార్డుసభ్యులను ఆహ్వానించి తెలంగాణ చరిత్ర.. ఉద్యమం.. ప్రధాన ఘట్టాలు.. ఏర్పాటు ఆవశ్యకత గురించి ప్రసంగించాలని ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలందాయి. తెలంగాణ ఉద్యమంలో కీలకపాత్ర పోషించిన ఉపాధ్యాయులందరూ ఇప్పటికే తమ తమ పాఠశాలలకు వెళ్లి ఏర్పాట్లు కూడా పూర్తి చేసుకున్నారు.
టీఎన్జీవోలు.. ఈ రోజు రాత్రి 7 గంటలకు సంఘ భవనం నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీగా వెళ్లి.. నివాళులర్పిస్తారు. 2న.. టీఎన్జీవోస్ యూనియన్ కార్యాలయంలో జాతీయ పతావిష్కరణ చేసి తర్వాత జిల్లా కేంద్రంలో జరిగే అధికారిక కార్యక్రమంలో పాల్గొంటారు.
కాంగ్రెస్ ఎస్సీ సెల్ ఆధ్వర్యంలో.. నేటి సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు కరీంనగర్‌లోని గీతాభవన్ చౌరస్తా నుంచి రాజీవ్‌చౌక్ వరకు కాగడాల ప్రదర్శన ఉంటుంది. నగర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో.. కరీంనగర్‌లోని ప్రధాన చౌరస్తాల్లో కాంగ్రెస్ జెండాలు.. తోరణాలతో అలంకరించి ఆదివారం అర్ధరాత్రి 1 గంటకు బాణాసంచా కాల్చనున్నారు. సోమవారం జిల్లా వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీ పతాకావిష్కరణ కార్యక్రమం ఉండనుంది.
బీజేపీ ఆధ్వర్యంలో.. నేటి సాయంత్రం అమరవీరుల స్తూపం వద్ద కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పించనున్నారు. 2న పార్టీ జిల్లా కార్యాలయంతోపాటు అన్ని మండలాల్లో జాతీయ జెండావిష్కరణ చేయనున్నారు.
సీపీఎం, సీఐటీయూ ఆధ్వర్యంలో అన్ని పట్టణ, మండలకేంద్రాల్లో శ్రామికవర్గ విముక్తికి పునరంకితం పేరుతో సభలు, సమావేశాలు నిర్వహించనున్నారు.
టీజేఏసీ ఆధ్వర్యంలో.. నేడు అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించి నివాళులర్పించనున్నారు. 2న శ్రీపాదచౌక్ వద్ద జాతీయ జెండావిష్కరణ చేస్తారు.
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ప్రతి గ్రామంలో జాతీయ జెండావిష్కరణతోపాటు టీ-జాగృతి జెండాలు ఎగురవేస్తారు.
టీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో.. ఆదివారం రాత్రి నగరం, పట్టణాల్లో బాణాసంచా కాల్చనున్నారు. అర్ధరాత్రి అమరవీరులకు నివాళులర్పించనున్నారు. 2న.. కేక్ కట్టింగ్, ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించిన వారికి సన్మానం.
కుల సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో.. ఈ రోజు రాత్రి 12 గంటలకు తెలంగాణ రాష్ట్ర జెండా ఎగురవేయనున్నారు.
కరీంనగర్ ఫిల్మ్ సొసైటీ ఆధ్వర్యంలో.. ఈ రోజు సాయంత్రం 6 గంటలకు జైబోలో తెలంగాణ చిత్రాన్ని ప్రదర్శించనున్నారు.
జిల్లా కేంద్రంలో చేపట్టే అధికారిక కార్యక్రమాలు
2న.. ఉదయం 7.45 నుంచి 8.25 గంటల వరకు స్థానిక తెలంగాణ తల్లి విగ్రహానికి, ప్రొఫెసర్ జయశంకర్ విగ్రహానికి పూలమాలంకరణ.. అమరవీరుల స్తూపం వద్ద అమరవీరులకు నివాళి.
ఉదయం 8.45 నుంచి 10 గంటల వరకు.. పోలీస్ పరేడ్ మైదానంలో కలెక్టర్ ఎం.వీరబ్రహ్మయ్య చేతులమీదుగా జాతీయ పతావిష్కరణ.. తెలంగాణ తల్లి తల్లి చిత్రపటానికి పూలమాలంకరణ .. తెలంగాణ గీతాలాపన.. తెలంగాణ అమరవీరులకు కుటుంబాలకు సన్మానం.. సాంస్కృతిక కార్యక్రమాలు.
3న ఉదయం 8 నుంచి 10గంటల వరకు జిల్లాకేంద్రంలోని ఎక్సైజ్‌శాఖ భవన్‌లో రక్తదానశిబిరం.
ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అన్ని మండల కేంద్రాల్లో ఆరోగ్య శిబిరాలు.
4న మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 8 వరకు కలెక్టరేట్ ఆడిటోరియం హాలు లో తెలంగాణ ఉద్యమ సమయంలో వెలువడిన తెలంగాణ సాహిత్యంపై కవి సమ్మేళనం. కవులు, స్వాతంత్య్ర సమరయోధులకు సన్మానం.
5న ఉదయం 9 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు కలెక్టరేట్ ఆడిటోరియం హాలులో తెలంగాణ ఉద్యమంపై విద్యార్థులకు చిత్రలేఖనం, వ్యాసర చన పోటీలు
6న సాయంత్రం 4 నుంచి 8 వరకు రెవెన్యూ గార్డెన్స్‌లో తెలంగాణ ఫుడ్ ఫెస్టివల్.
7న సాయంత్రం 6 నుంచి 10 వరకు సర్కస్‌గ్రౌండ్‌లో ముషాయిరా, ఖవ్వాలి, గజల్ కార్యక్రమాలు.
8న సాయంత్రం 6 నుంచి 9 వరకు.. సర్కస్‌గ్రౌండ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆవిర్భావ వారోత్సవాల ముగింపు కార్యక్రమాలు.
(ఈ నెల 2 నుంచి 8వ తేదీ వరకు ప్రతి రోజు సాయంత్రం 6.30 నుంచి 9 గంటల వరకు సర్కస్‌గ్రౌండ్‌లో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు.)
జయహో
Published Sun, Jun 1 2014 2:42 AM | Last Updated on Mon, Sep 17 2018 5:36 PM
Advertisement