లక్సెట్టిపేట(మంచిర్యాల): టెక్నాలజీ అందుబాటులోకి రావడంతో ఫ్యాషన్ ప్రపంచం క్షణాల్లో కళ్ల ముందు దర్శనమిస్తోంది. యువతలో ఫ్యాషన్ అనుకరణ రోజురోజుకు పెరుగుతోంది. గ్రామాల్లోనూ ఈ ప్రభావం కనిపిస్తోంది. సమ్‌థింగ్ స్పెషల్‌గా ఉండేందుకు యువకులు ఆరాటపడుతున్నారు. తమదైన గెటప్‌తో ఆకట్టుకుంటున్నారు. ఈ కోవకు చెందిన వ్యక్తే జీవన్. వినూత్న హెయిర్‌స్టైల్, స్పెషల్ అప్పియరెన్స్‌తో అందరి దృష్టిని ఆకర్షిస్తూ ‘ఇట్స్ మై స్టైల్’ అంటున్నాడితను.
మండలంలోని చందారం గ్రామానికి చెందిన జీవన్ (నిక్‌నేమ్ జీవా, లోబో) పదో తరగతి వరకు చదువుకున్నాడు. తల్లిదండ్రులు వ్యవసాయం చేస్తుంటారు. చిత్రకళపై ఉన్న ఆసక్తితో చిన్నతనం లోనే ఆర్టిస్ట్ వద్ద మెళకువలు నేర్చుకున్నాడు. ప్రస్తుతం సొంతంగా షాపు ఏర్పాటు చేసుకున్నాడు. పేయింటింగ్, ఫ్లెక్సీ ప్రింటింగ్, రేడియం స్టిక్కరింగ్ చేస్తూ జీవనోపాధి పొందుతున్నాడు. తనకంటూ ప్రత్యేక గుర్తింపు ఉండాలని డిఫరెంట్ స్టైల్స్‌తో ప్రజల్లో తిరుగుతుంటాడు. ఓ టీవీ చానల్ యాంకర్ లోబోను చూసి ఆకర్షితుడయ్యాడు. తను కూడా అదే స్టైల్‌లో ఉండాలనుకున్నాడు. వెరైటీ డ్రెస్సెస్, హేర్‌కటింగ్ విత్ కలరింగ్, కాళ్లకు వేర్వేరు షూ, ఆకట్టుకునే బైక్‌తో ప్రత్యేక గుర్తింపు సంపాధించుకున్నాడు.
తన కళానైపుణ్యం జోడించి బైక్‌ను పూర్తిగా మోడిఫై చేసుకున్నాడు. మంచిర్యాలలోని మెన్స్ ఓ బ్యూటీపార్లర్‌లో హెయిర్‌స్టైల్‌కు మెరుగులు దిద్దుకుంటాడు. షూ, చెప్పులు ఏవి వేసుకున్నా రెండు కాళ్లకు వేర్వేరుగా ధరించడం ఈయన హాబీ. తన పేరు జీవన్ కాగా కొద్దిరోజులు జీవాగా.. ప్రస్తుతం లోబోగా మార్చుకున్నాడు. పియానో, కీబోర్డులోనూ ప్రవేశం ఉంది ఇతడికి. ఆర్కెస్ట్రా, మ్యారేజ్ ఫంక్షన్ ప్రోగ్రాంలలో పాల్గొంటుంటాడు. మ్యూజిక్ ప్రోగ్రాంలకు వెళ్లాలంటే స్టైల్‌కు గుర్తింపు ఉంటుందని అందుకే ఇలా డిఫరెంట్‌గా ఉంటున్నాన్నంటున్నాడు జీవన్.
Comments
Please login to add a commentAdd a comment