జేఎన్‌టీయూలో డిటెన్షన్‌ రద్దు | JNTU Hyderabad New Guidelines To Conduct Sem Exams | Sakshi
Sakshi News home page

జేఎన్‌టీయూలో డిటెన్షన్‌ రద్దు

Published Fri, Jun 5 2020 2:00 AM | Last Updated on Fri, Jun 5 2020 2:02 AM

JNTU Hyderabad New Guidelines To Conduct Sem Exams - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఇంజనీరింగ్, ఫార్మసీ, ఎంబీఏ, ఎంసీఏ, ఫార్మ్‌–డిలో డిటెన్షన్‌ను జేఎన్‌టీయూ రద్దు చేసింది. వివిధ సెమిస్టర్‌లలో విద్యార్థులు పాస్, ఫెయిల్‌తో సంబంధం లేకుండా (గతంలో డిటెయిన్‌ అయిన వారిని కూడా) తర్వాతి సెమిస్టర్‌కు ప్రమోట్‌ చేయాలని నిర్ణయించింది. యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ), రాష్ట్ర ఉన్నత విద్యామండలి జారీ చేసిన మార్గదర్శకాలకు అనుగుణంగా పరీక్షల నిర్వహణ మార్గదర్శకాలను జేఎన్‌టీయూ గురువారం జారీ చేసింది. అందులోని ప్రధాన అంశాలివే..

  • 2020–21 విద్యా సంవత్సరంలో డిటెన్షన్‌ విధానం ఉండదు. నిర్దేశిత సబ్జెక్టులు పాస్‌ కాకున్నా విద్యార్థులంతా తర్వాతి సెమిస్టర్‌కు అనుమతి.
  • ముందుగా ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షల నిర్వహణ. ప్రతి సబ్జెక్టు పరీక్ష 2 గంటలే. గరిష్ట మార్కుల్లో తేడా ఉండదు.
  • పరీక్షల్లో 8 ప్రశ్నలకు 5 ప్రశ్నలకు జవాబులు రాయాలి. తప్పనిసరి పార్ట్‌ అనేది లేదు. ప్రతి ప్రశ్నకు 20 నిమిషాల సమయం ఉంటుంది. 
  • లాక్‌డౌన్‌ కాలమంతా విద్యార్థులు కాలేజీలకు హాజరైన ట్లుగానే పరిగణనలోకి. అయితే  హాజరు తక్కువగా ఉన్న వారి వివరాలు వెబ్‌సైట్‌లో నమోదు.
  • ఫైనల్‌ సెమిస్టర్‌ పరీక్షలు సంబంధిత కాలేజీలోనే నిర్వహణ. కాలేజీల మార్పు ఉండదు. కాలేజీల మూసివేతకు దరఖాస్తు చేసిన కాలేజీల విద్యార్థులకు సమీప కాలేజీలో పరీక్షలు.
  • బీటెక్‌ నాలుగో సంవత్సరం, రెండో సెమిస్టర్, బీపార్మసీ రెండో సెమిస్టర్‌ పరీక్షలు, ఎంబీఏ, ఎంసీఏ ద్వితీయ సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షలు ఈ నెల 20 నుంచి మొదలు. రవాణా సదుపాయం లేక పరీక్షలకు హాజరుకాలేని విద్యార్థులు 45 రోజుల్లో నిర్వహించే అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకావచ్చు.
  • బీటెక్‌ ఫస్టియర్, సెకండియర్, థర్డ్‌ ఇయర్‌ రెండో సెమిస్టర్‌ పరీక్షలు, ఫార్మ్‌–డి రెండో, మూడో, నాలుగో, 5వ సంవత్సరం, పార్మ్‌–డి (పీబీ) సెకండియర్‌ పరీక్షలు జూలై 16 నుంచి ప్రారంభం.
  • ఆగస్టు 3 నుంచి అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు. ప్రథమ బీటెక్, బీపార్మసీ ఫస్టియర్, సెకండియర్, థర్డ్‌ ఇయర్, నాలుగో సంవత్సరం ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు 3వ తేదీ నుంచే ఉంటాయి. ఎంబీఏ, ఎంసీఏ ఫస్టియర్‌ సెకండ్‌ సెమిస్టర్‌ రెగ్యులర్, ఎంసీఏ సప్లిమెంటరీ ఫస్టియర్, సెకండియర్, థర్డ్‌ ఇయర్‌ ఫస్ట్‌ సెమిస్టర్‌ పరీక్షలు, ఎంటెక్, ఎంఫార్మసీ సెకండ్‌ సెమిస్టర్‌ రెగ్యులర్, ఫస్ట్‌ సెమిస్టర్‌ సప్లిమెంటరీ పరీక్షలు, ఫార్మ్‌–డి ఫస్టియర్‌ రెగ్యులర్, సప్లిమెంటరీ పరీక్షలూ అప్పుడే ఉంటాయి.
  • జూలై 1 నుంచి 15 వరకు కాంటాక్టు తరగతులు, ల్యాబ్‌ ఎక్స్‌పరిమెంట్స్, ల్యాబ్‌ పరీక్షల నిర్వహణ.
  • బీటెక్, బీఫార్మసీ సెకండ్‌ సెమిస్టర్‌ (రెగ్యులర్‌), ఫస్ట్‌ సెమిస్టర్‌ (సప్లిమెంటరీ) పరీక్షలకు ఆలస్య రుసుము లేకుండా ఫీజు చెల్లింపు (రిజిస్ట్రేషన్‌) ఈనెల 6లోగా పూర్తి చేయాలి.
  • రీకౌంటింగ్, రీవెరిఫికేషన్‌ తదితర ఫీజులను విద్యార్థులు కాలేజీకి రాకుండా ఆన్‌లైన్‌లో చెల్లించే ఏర్పాట్లు చేయాలి. ఫీజుల చెల్లింపు, ఫలితాల వివరాలను విద్యార్థులకు తెలియజేసేందకు వాట్సాప్‌ గ్రూపులను ఏర్పాటు చేయాలి. 

కరోనా జాగ్రత్తలు తప్పనిసరి...
విద్యార్థులు, సిబ్బంది క్యాంపస్‌లో ఉన్నప్పుడు మాస్క్‌లు కచ్చితంగా ధరించాలి. మాస్క్‌లు ధరించిన వారినే సెక్యూరిటీ సిబ్బంది అనుమతించాలి.
ప్రతి భవనం వద్ద శానిటైజర్లను అందుబాటులో ఉంచాలి. విద్యార్థులు, సిబ్బంది వాటిని ఉపయోగించేలా చూడాలి.
తరగతి గదులు, పరీక్ష హాళ్లు, ల్యాబ్‌లలో భౌతికదూరం పాటించేలా చర్యలు చేపట్టాలి. 
థర్మల్‌ స్కానింగ్‌ తప్పనిసరిగా అమలు చేయాలి. తరగతి గదులు, ప్రయోగశాలలను, కాలేజీ బస్సులను ప్రతిరోజూ శానిటైజ్‌ చేయాలి. 
ఎవరైనా అనారోగ్యానికి గురైతే ఐసోలేట్‌ చేసి చికిత్స అందించాలి.
పరీక్షల సమయంలో విద్యార్థులు ప్రతి బెంచ్‌కు ఒకరే.. అదీ జిగ్‌జాగ్‌లో కూర్చోబెట్టాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement