కన్నీటికే కన్నీరొచ్చేలా.. | Joined to the body of Madhya Pradesh | Sakshi
Sakshi News home page

కన్నీటికే కన్నీరొచ్చేలా..

Published Tue, Jun 24 2014 4:01 AM | Last Updated on Wed, Apr 3 2019 5:32 PM

కన్నీటికే కన్నీరొచ్చేలా.. - Sakshi

కన్నీటికే కన్నీరొచ్చేలా..

  •     ఇంటికి చేరిన పరమేశ్వర్ మృతదేహం
  •      శోకసంద్రమైన నర్సంపేట
  •      రెండు వారాల ఎదురుచూపులకు తెర
  •      అంతిమయాత్రలో పాల్గొన్న వేలాది మంది
  •      నివాళులర్పించిన ప్రముఖులు
  • నర్సంపేట : నీళ్లింకిన కళ్లు.. గుండెలవిసేలా రోదనలు.. బరువెక్కిన హృదయాలు.. ఇవీ సోమవారం పరమేశ్వర్ ఇంటి వద్ద కనిపించిన దృశ్యాలు. అంబులెన్సు నుంచి దించుతున్న పరమేశ్వర్ మృతదేహాన్ని చూసి నర్సంపేట శోకసంద్రమైంది. స్నేహితులు ఘొల్లుమన్నారు. విగతజీవిగా మారిన మిత్రుడిని చూసి విలపించారు. సోమవారం పరమేశ్వర్ మృతదేహం ఇంటికి చేరడంతో చూసేందుకు ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నివాళులర్పించి అంతిమయాత్రలో పాల్గొన్నారు.  

    హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌నదిలో కొట్టుకుపోయి 14 రోజుల తర్వాత విగతజీవిగా లభ్యమైన చిందం పరమేశ్వర్‌కు సోమవారం బంధువులు, స్నేహితులు, ఆత్మీయులు కన్నీటి వీడ్కోలు పలికారు. బియాస్ దుర్ఘటనలో కళ్లముందే కొట్టుకుపోతున్న ఇద్దరి స్నేహితులను కాపాడి మరొకరిని రక్షించబోయి ప్రాణాలు వదిలిన పరమేశ్వర్‌కు నర్సంపేట ప్రజలు నివాళులర్పించారు. ఎక్కడున్నా క్షేమంగా ఉంటాడని, ప్రాణాలతో తిరిగి వస్తాడని ఎదురుచూసిన కుటుంబ సభ్యులకు చివరికి కన్నీరే మిగిలింది.

    సోమవారం ఇంటికి చేరిన పరమేశ్వర్ మృతదేహాన్ని చూసి గుండెలవిసేలా రోదించారు.  నర్సంపేటకు
    చెందిన చిందం వీరన్న, కళావతి దంపతులకు పరమేశ్వర్ మూడో సంతానం. పెద్ద కుమారుడు ప్రశాంత్, కూతురు ప్రియాంక ఉన్నారు. హైదరాబాద్ శివారు బాచుపల్లిలోని విజ్ఞానజ్యోతి ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్న పరమేశ్వర్ ఈనెల 8వ తేదీన హిమాచల్‌ప్రదేశ్‌లోని బియాస్‌నది దుర్ఘటనలో గల్లంతైన విషయం తెలిసిందే.

    ప్రమాదం జరిగినప్పటి నుంచి పరమేశ్వర్ ఆచూకీ కనిపించకుండా పోయింది. దీంతో అతను బతికే ఉన్నాడని, ఎప్పటికైనా క్షేమంగా  వస్తాడని కుటుంబ సభ్యులు కళ్లలో వత్తులు వేసుకుని ఎదురుచూశారు. చివరికి 14రోజుల తర్వాత ఆదివారం పరమేశ్వర్ మృతదేహం లభ్యమైంది. సోమవారం రెవెన్యూ అధికారులు హైదరాబాద్ వెళ్లి మృతదేహాన్ని సాయంత్రం నర్సంపేటకు తీసుకొచ్చారు.
     
    జిల్లేడు చెట్టుకు పెళ్లి చేసి..

    క్షేమంగా ఇంటికి వస్తాడనుకున్న కొడుకు ఇలా శవంగా మారి రావడంతో తల్లిదండ్రులు తట్టుకోలేకపోయారు. కన్నీరుమున్నీరుగా విలపించారు. అంత్యక్రియలకు ముందు సంప్రదాయబద్ధంగా జిల్లేడు చెట్టుకు పెళ్లి చేసి అక్షింతలు వేశారు. హిమాలయాల్లో కొలువైన పరమేశా.. నీ చెంతకు వచ్చిన నా కొడుకు ప్రాణాలు తీసుకున్నావా అంటూ వారు చేసిన రోదనలు అక్కడున్న వారిని కంటతడి పెట్టించాయి. అనంతరం అంతిమయాత్రలో వేలాదిమంది పాల్గొన్నారు. కొడుకు మృతదేహానికి తండ్రి వీరన్న తలకొరివి పెట్టారు.
     
    పలువురి సంతాపం
     
    పరమేశ్వర్ మృతదేహానికి ఆర్డీఓ అరుణకుమారి నివాళులు అర్పించి కన్నీరు పెట్టుకున్నారు. ప్రయోజకుడై దేశానికి కీర్తిప్రతిష్టలు తేవాల్సిన యువకుడు అకాల మరణంతో తల్లిదండ్రులకు తీరని క్షోభ మిగిల్చాడంటూ ఆమె విలపించారు. డీఎస్పీ చక్రవర్తి, సీఐ జాన్‌దివాకర్, తహసీల్దార్ సూర్యనారాయణ, రాయిడి రవీందర్‌రెడ్డి, రుద్ర ఓంప్రకాశ్, అక్కపెల్లి రమేష్, దేవునూరి అంజయ్య, పెండెం రామానంద్, ఈసంపెల్లి బాబు , నాయిని నర్సయ్య తదితరులు పరమేశ్వర్‌కు నివాళులు అర్పించారు.
     
    ఎంతో కలివిడిగా ఉండేవాడు : స్నేహితులు
     
    తెలివైన విద్యార్థిగా పేరు సంపాదించుకున్న పరమేశ్వర్ అందరితో కలివిడిగా ఉండేవాడని పరమేశ్వర్ స్నేహితులు ప్రియరాగ, కీర్తన,అలేఖ్య, మానస, రవికిరణ్  తెలిపారు. మహబూబాబాద్‌కు చెందిన ఈ స్నేహితులు తమ ప్రియమిత్రుడిని కడసారి చూసేందుకు వచ్చి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. పరమేశ్వర్ క్షేమంగా తిరిగిరావాలని ప్రతీ రోజు వేడుకున్నామని, చివరికిలా వచ్చాడంటూ విలపించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement