
జూన్ 1... అర్ధరాత్రి 12 గంటలకు అమరవీరుల కీర్తి స్థూపం ఆవిష్కరణ
అరవై ఏళ్ల స్వప్నం సాకారమైన సుదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ కిషన్ సారథ్యంలో జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు కోరారు
హన్మకొండ చౌరస్తా, న్యూస్‌లైన్ : అరవై ఏళ్ల స్వప్నం సాకారమైన సుదినాన్ని పురస్కరించుకుని కలెక్టర్ కిషన్ సారథ్యంలో జూన్ 1 నుంచి 3వ తేదీ వరకు నిర్వహించనున్న తెలంగాణ ఉత్సవాల్లో అన్ని వర్గాల ప్రజలు కలిసి రావాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్ పరిటాల సుబ్బారావు కోరారు. హన్మకొండలోని టీఎన్జీఓఎస్ భవన్‌లో ఉద్యోగ, టీఎన్జీఓ నేతలతో కలిసి శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తెలంగాణ ముద్దు బిడ్డ కలెక్టర్ కిషన్ ఆధ్వర్యంలో జిల్లాలో ఉత్సవాలను నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు.
ఉత్సవాల్లో భాగంగా నిట్ క్యాంపస్ నుంచి కాళోజీ సెంటర్ వరకు కార్నివాల్ నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆర్ట్స్ కాలేజీ, డీఐజీ బంగ్లా, అదాలత్, కాళోజీ స ర్కిల్, కలెక్టరేట్ ప్రధాన ద్వారం వద్ద ఐదు స్టేజీలు ఉంటాయని, ఇక్కడ ఫుడ్ స్టాల్స్ ఏర్పాటు చేయడంతోపాటు విద్యుత్ దీపాలతో నగరాన్ని ముస్తాబు చేయనున్నట్లు వెల్లడించారు. 32 అడుగుల ఎత్తులో అత్యంత వైభవంగా నిర్మించిన తెలంగాణ అమరవీరుల కీర్తి స్థూపాన్ని జూన్ 1... అర్ధరాత్రి 12 గంటలకు ఆవిష్కరించనున్నట్లు వివరించారు.
రెండో తేదీన తెలంగాణ డెవలప్‌మెంట్ అనే నినాదంతో కలెక్టరేట్ నుంచి వడ్డేపల్లి చెరువు వరకు ర్యాలీ (రన్) నిర్వహిస్తామన్నారు. ఉత్సవాల నిర్వహణకు కలెక్టర్ చైర్మన్‌గా ఏర్పాటైనఓరుగల్లు సేవా సమితికి 18 వేల మంది ఉద్యోగులు వారి ఒక రోజు వేతనంలో సగాన్ని అందజేయనున్నట్లు తెలిపారు. ఉన్నత లక్ష్యంతో ఏర్పాటైన సేవా సమితి ద్వారా చేపట్టే సంక్షేమ కార్యక్రమాల్లో ఉద్యోగులు ఎప్పడూ ముందుంటారన్నారు.
పండుగ వాతావరణాన్ని మైమరిపించేలా అధిక సంఖ్యలో ప్రజలు ఉత్సవాలకు హాజరు కావాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో టీజీఓ జిల్లా సెక్రటరీ జగన్మోహన్, టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు కోల రాజేష్, రత్నవీరాచారి, రత్నాకర్‌రెడ్డి, రామ్‌కిషన్, సోమయ్య, విజయలక్ష్మి, సాదుల ప్రసాద్, రమేష్, వెంకటేశ్, షేక్‌హుస్సేన్, సామ్యూల్, ప్రేమలత తదితరులు పాల్గొన్నారు.