
సాక్షి, హైదరాబాద్: ‘దిశ’పై జరిగిన గ్యాంగ్‌రేప్, హత్య కేసును వేగంగా విచారించి దోషులకు కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకోవాలని సీఎం కేసీఆర్ అధికారులను ఆదేశించారు. కేసు సత్వర విచారణ కోసం ఫాస్ట్‌ట్రాక్ కోర్టును ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. దీనికి సంబంధించిన ప్రక్రియ ప్రారంభించాలని అధికారులకు సూచించారు. ఇటీవల వరంగల్‌లో ఓ మైనర్ బాలిక హత్య విషయంలో ఫాస్ట్‌ట్రాక్ కోర్టు ఏర్పాటు చేయడం వల్ల 56 రోజుల్లోనే విచారణ పూర్తై తీర్పు వెలువడటంతో అదే తరహాలో సత్వర తీర్పు రావాల్సిన అవసరం ఉందని సీఎం అభిప్రాయపడ్డారు. ‘దిశ’ కుటుంబానికి అవసరమైన అన్ని రకాల సహాయ, సహకారాలు అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందని ప్రకటించారు.