జిల్లాకు రెండు గురుకులాలు
► ఒకటి బాలురకు, మరొకటి బాలికలకు..
► అధికారులతో సమీక్షలో డిప్యూటీ సీఎం కడియం వెల్లడి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రతి జిల్లాకు ఓ బాలుర, ఓ బాలికల గురుకుల పాఠశాలను విద్యా శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఇందుకోసం ప్రతిపాదనలు పంపాలని విద్యా శాఖ అధికారులను ఆదేశించారు. కొత్తగా ఏర్పడిన కొన్ని జిల్లాల్లో సాధారణ గురుకులాల కొరత ఏర్పడినందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు పేర్కొన్నారు. బుధవారం సచివాలయంలో రాష్ట్ర గురుకులాల సొసైటీ, మోడల్ స్కూల్స్, కేజీబీవీ, విద్యా శాఖ అధికారులతో కడియం సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ప్రస్తుతం రాష్ట్రంలో జనరల్ రెసిడెన్షియల్ స్కూళ్లు 35 ఉన్నాయని, వాటిలో 6 స్కూళ్లను కాలేజీలుగా మార్చామని, మరో 29 స్కూళ్లను వచ్చే విద్యా సంవత్సరం అప్‌గ్రేడ్ చేస్తామని పేర్కొన్నారు. కాలేజీలుగా అప్‌గ్రేడ్ అయిన, వచ్చే విద్యా సంవత్సరం నుంచి అప్‌గ్రేడ్ కానున్న పాఠశాలల్లో మౌలిక వసతులు, బోధన, బోధనేతర సిబ్బంది, నిధుల విషయమై ప్రతిపాదనలు పంపాలన్నారు. కేజీబీవీలు, మోడల్ స్కూళ్లు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో ఇబ్బందులు ఉండకూడదని, ఈసారి వాటిల్లో 100 శాతం ఫలితాలు సాధించాలని చెప్పారు.
డిజిటల్ తరగతుల నిర్వహణపై కమిటీ..
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రమాణాల పెంచేందు కు జాతీయ, రాష్ట్ర ఉత్తమ ప్రధానోపాధ్యాయు లతో కమిటీ ఏర్పాటు చేయాలని అధికారుల ను కడియం ఆదేశించారు. పాఠశాలల పనితీరు మెరుగుపరిచేందుకు అవసరమైన సిఫార్సుల నివేదికను 3 నెలల్లో ఈ కమిటీ అందజేయాలన్నారు. డిజిటల్ తరగతుల నిర్వహణ, డిజిటల్ సబ్జెక్టుల అప్‌డేట్‌పై ఎస్‌సీఈఆర్‌టీ, సైట్ డెరెక్టర్ కమిటీగా ఏర్పడి 3 నెలల్లో నివేదికివ్వాలన్నారు.
టీచర్లందరికీ సబ్జెక్టు, స్పోకెన్ ఇంగ్లిష్‌లో పురోగతి ఉండేలా ఇన్ సర్వీస్ శిక్షణ ఇవ్వాలని చెప్పారు. ప్రధానోపాధ్యాయులకు లీడర్ షిప్ శిక్షణ ఇవ్వాలని, ఇందుకు ఇఫ్లూ, విప్రో, బ్రిటీష్ కౌన్సిల్ వంటి సంస్థల సహకారం తీసుకోవాలని సూచించారు. సమావేశంలో విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, పాఠశాల విద్యా డైరెక్టర్ కిషన్, మోడల్ స్కూల్స్ డైరెక్టర్ సత్యనారాయణరెడ్డి, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్ శేషుకుమారి, కేజీబీవీ అదనపు ప్రాజెక్టు డైరెక్టర్ పీవీ శ్రీహరి, సైట్ డైరెక్టర్ రమణకుమార్ పాల్గొన్నారు.