కాళేశ్వరం: జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం ప్రాజెక్టును సందర్శించేందుకు పెద్ద ఎత్తున వస్తున్న పర్యాటకులు ఆ చుట్టుపక్కల ఉన్న పర్యాటక కేంద్రాలను కూడా చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు. మహారాష్ట్ర లోని గడ్చిరోలి జిల్లాలో ఉన్న ఏనుగుల పార్కు సందర్శకులను ఆకట్టుకుంటోంది. దట్టమైన అటవీప్రాంతంలో చుట్టూగుట్టలు.. చెరువుల మధ్య ఆహ్లాదకరమైన వాతావరణంలో మహారాష్ట్ర అటవీశాఖ ఈ పార్కును ఏర్పాటు చేసింది. గడ్చిరోలి జిల్లా కమలాపూర్ గ్రామానికి 3 కిలోమీటర్ల దూరంలో ఈపార్కు ఉంటుంది. ఈ పార్కు జయశంకర్ భూపాలపల్లి జిల్లా కాళేశ్వరం గ్రామానికి 69 కిలోమీటర్ల దూరంలో ఉంది. మహారాష్ట్ర అటవీశాఖ రూ. 2 కోట్లతో ఇక్కడ కాటేజీలు, చిన్న షెడ్ల నిర్మాణం చేపట్టింది. సందర్శకులు విడిదికి ఏర్పాటు చేయనున్నారు. పార్కుకు సోషల్‌మీడియా వల్ల ప్రాచుర్యం వచ్చింది. ఇక్కడి కాళేశ్వరాలయంతోపాటు చుట్టప్రక్కల ఆలయాలు, పార్కులకు సందర్శకుల తాకిడి రోజురోజుకూ పెరుగుతోంది.
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం–మహారాష్ట్రలోని చింతలపల్లి, సిరొంచ–రాపన్ పల్లి(చెన్నూర్)వద్ద గోదావరి, ప్రాణహితలపై వంతెనలు అందుబాటులోకి రావడంతో రాకపోకలు సులువయ్యాయి. 1908లో బ్రిటిష్ పాలకుల కాలంలో ఏనుగులను వివిధ రకాల పనులకు వాడేవారు. ఇక్కడి విలువైన ప్రకృతి సంపదను ఇంగ్లండ్‌కు తరలిం చేక్రమంలో పెద్దపెద్ద యంత్రాలు లేకపోవడంతో ఏనుగులను వాడేవారు. 1965లో ఆళ్లపల్లి అడవిలో 4 ఏనుగులు మిగిలాయి. వాటిని కమలాపూర్‌కు తీసుకువచ్చి ఏనుగుల సంరక్షణ బాధ్యతను మహారాష్ట్ర అటవీశాఖ చూస్తోంది. కాలక్రమేణా జంతువులతో పనులు చేయించరాదని ఆదేశించడంతో ఏనుగులను అటవీశాఖ సంరక్షిస్తూ వస్తోంది.
ప్రస్తుతం పది ఏనుగులు
కమలాపూర్ అడవిలో ప్రస్తుతం పది ఏనుగులు ఉన్నాయి. ఇందులో రెండు చిన్న ఏనుగులు ఉన్నాయి. వీటిలో పెద్ద ఏనుగుకు 90 సంవత్సరాలకుపైగా వయసు ఉంటుందని ఫారెస్టు గార్డులు తెలిపారు. మరొకటి 87 సంవత్సరాల వరకు ఉంటుందన్నారు. బసంతి(90) అనే ఏనుగు అత్యధికంగా 15 అడుగుల ఎత్తుతో ఉండగా మిగతావి 8–12 అడుగుల వరకు ఉన్నాయి.
ఏనుగులకు ప్రత్యేక ఆహారం
పార్కులోని పది ఏనుగులకు 50 కిలోల బియ్యంతో ప్రత్యేకంగా అన్నం వండి పెడతారు. నూనె, ఉప్పు కలిపి రెండు కిలోలకు ఒక ముద్దను అందుబాటులో ఉంచుతారు. గోధుమ పిండినికూడా ముద్దలుగా చేసి పెడతారు. అడవిలో కంక బొంగులు, వాటి ఆకులు, దుంపిడి, టేకు ఆకులు, మద్ది ఆకులను సైతం ఏనుగులు తింటాయి. మధ్యాహ్నం 12 గంటలకు ఆహారం తినేందుకు వచ్చే ఏనుగులు 3 గంటల వరకు ఆహారం తిని చెరువు వద్ద నుంచి తిరిగి అడవిలోకి వెళ్తాయి. మధ్యాహ్నం 12–3 గంటల వరకు వస్తేనే ఏనుగులను చూసే వీలవుతుంది.
పార్కుకు వెళ్లేది ఇలా..
మహదేవపూర్ మండలం కాళేశ్వరం మీదుగా అంతర్‌రాష్ట్ర వంతెన దాటాలి. సిరొంచ, బామిని, రేపన్ పల్లి దాటాక కుడివైపునకు వెళ్లాలి. అక్కడ కమలాపూర్ నుంచి మూడు కిలోమీటర్ల దూరం తారురోడ్డు మీదుగా అడవిలోకి వెళ్లాలి. ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉండవు.
ఏనుగుల పార్క్.. చలో చూసొద్దాం!
Published Tue, Aug 13 2019 3:48 AM | Last Updated on Tue, Aug 13 2019 3:48 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment