తెలంగాణ ఉద్యమంలో ముందుండి నడిచిన కామారెడ్డి మరో ఉద్యమానికి సై అంటోంది. మూడు జిల్లాల కూడలి, అన్ని అర్హతలున్న కామారెడ్డినే జిల్లాకేంద్రంగా ఏర్పాటు చేయాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. ఇందుకోసం ‘కామారెడ్డి జిల్లా సాధన సమితి’ని ఏర్పాటు చేసుకున్నారు. అన్నివర్గాలను కలుపుకుని ఉద్యమించాలని నిర్ణయించారు. అందులో భాగంగా శనివారం పట్టణంలో సమావేశమై పలు తీర్మానాలు చేశారు. రాస్తారోకో, ధర్నా చేసి ఆర్‌డీఓకు వినతిపత్రం అందజేశారు.
కామారెడ్డి : కామారెడ్డిని జిల్లా చేయాలనే డిమాండ్ ఊపందుకుంటోంది. దీనికోసం ఉద్యమించడానికి స్థానికులు సిద్ధమవుతున్నారు. ‘కామారెడ్డి జిల్లా సాధన సమితి’ శనివారం నిర్వహించిన సమావేశంలో జిల్లా సాధన కోసం ఉద్యమబాట పట్టాలని నిర్ణయించారు. జేఏసీ కన్వీనర్ జి.జగన్నాథం అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఉద్యమాన్ని ఉధృతం చేయాలని తీర్మానం చేశారు. అందులో భాగంగా రాస్తారోకో నిర్వహించి పోరాటానికి శ్రీకారం చుట్టారు. ఈ నెల 16న కామారెడ్డి బంద్‌కు పిలుపునిచ్చారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాలని తీసుకున్న నిర్ణయం అభినందనీయమని, అయితే కామారెడ్డి ప్రాంతాన్ని మెదక్ లోగానీ, సిద్ధిపేటలోగానీ కలుపుతారన్న వార్తలు వస్తుండడం ఆందోళన కలిగిస్తోందని నేతలు అభిప్రాయపడ్డారు.
కామారెడ్డి ప్రాంతంలో అన్ని సౌకర్యాలు కలిగి జిల్లా ఏర్పాటుకు కావలసిన అన్ని అవకాశాలు, అర్హతలు ఉన్నాయని, ఈ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తూ మరో ప్రాంతంలో కలిపే చర్యలను ఈ ప్రాంత ప్రజలు ఒప్పుకోరని జేఏసీ నేతలు పేర్కొన్నారు. జిల్లాను సాధించుకునేందుకు అన్ని పార్టీలు, ప్రజాసంఘాలు, ఉద్యోగ, విద్యార్థి సంఘాలు, మేధావులతో ‘కామారెడ్డి జిల్లా సాధన కమిటి’ని ఏర్పాటు చేసుకున్నామన్నారు. కామారెడ్డి జిల్లా ఒక్కటే లక్ష్యంగా ఉద్యమ కార్యాచరణ ఉంటుందన్నారు. ఈనెల 16న కామారెడ్డి బంద్‌ను విజయవంతం చేయాలని కోరారు. ప్రభుత్వం కామారెడ్డి జిల్లాకు సంబంధించి స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. లేదా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. తమ డిమాండును ప్రభుత్వానికి నివేదించాలని కోరుతూ ఆర్‌డీఓ వేంకటేశ్వర్లకు వినతిపత్రం అందజేశారు.
అనంతరం ర్యాలీగా నిజాంసాగర్ చౌరస్తా వరకు వెళ్లి రాస్తారోకో, ఆందోళన నిర్వహించారు. ట్రాఫిక్ నిలిచిపోవడంతో పోలీసులు ఉద్యమకారులను అరెస్టు చేసి తీసు కెళ్లారు. కార్యక్రమంలో జేఏసీ కన్వీనర్ జి.జగన్నాథం, కో కన్వీనర్ తిర్మల్‌రెడ్డి, చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు గౌరీశంకర్, న్యాయవాదులు క్యాతం సిద్ధిరాములు, రాంచంద్రారెడ్డి, నాగభూషణం, గంగాధర్, గంగరాజం, సలీం, కాంగ్రెస్, టీడీపీ నేతలు మామిండ్ల అంజయ్య, నల్లవెల్లి అశోక్, విజయ్‌కుమార్‌రెడ్డి, పండ్ల రాజు, ఉస్మాన్, సీపీఎం నాయకుడు చంద్రశేఖర్, రాజలింగం, విద్యార్థి సంఘాల నేతలు ఆజాద్, రాజు, రాణాప్రతాప్, నరేశ్, శివకుమార్, నాగరాజు, కుంబాల లక్ష్మణ్, వివిధ సంఘాల నేతలు గఫూర్ శిక్షక్, మనోహర్‌రావు, గబ్బుల లక్ష్మిపతి, నాగరాజు, నర్సారెడ్డి, రాజన్న తదితరులు పాల్గొన్నారు.
కదులుతున్న ‘కామారెడ్డి’
Published Sun, Sep 14 2014 1:51 AM | Last Updated on Sat, Sep 2 2017 1:19 PM
Advertisement
Advertisement