
ఉద్రిక్తంగా మారిన జిల్లాల ఉద్యమం
కొత్త జిల్లాల సాధన కోసం చేస్తున్న ఆందోళనలు శనివారం ఉద్రిక్తంగా మారాయి.
నెట్‌వర్క్: కొత్త జిల్లాల సాధన కోసం చేస్తున్న ఆందోళనలు శనివారం ఉద్రిక్తంగా మారాయి. కొత్త జిల్లా ఏర్పాటుకు వడివడిగా అడుగులు పడుతున్న తరుణంలో ఆయా జేఏసీలూ ఆందోళన హోరును పెంచాయి. కరీంనగర్ జిల్లాలోని సిరిసిల్ల జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో శనివారం చేపట్టిన బంద్, నిరసనలు, ఆందోళనతో సిరిసిల్ల అట్టుడికింది. ఆర్టీసీ బస్సుల అద్దాల ధ్వంసం, సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఫ్లెక్సీల తొలగింపు, కటౌట్ కూల్చివేతకు యత్నించడంతో ఉద్రిక్తతకు దారి తీసింది.
రహదారులపై టైర్లకు నిప్పుపెట్టారు. సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. జిల్లా సాధన కోసం అర్బన్‌బ్యాంకు మాజీ చైర్మన్ గాజుల బాలయ్య చేపట్టిన దీక్షను పోలీసులు భగ్నం చేయడంతో ఆయన్ని ఆస్పత్రిలో చేర్పించారు. బస్‌డిపో వద్ద న్యాయవాదుల జేఏసీ, బీజేపీ, జిల్లా సాధన కమిటీ ప్రతి నిధులు బైఠాయించారు. పోలీసులు పలువురిని అరెస్ట్ చేసి కోనరావుపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
సిద్ధిపేటలో కలపొద్దు..
కరీంనగర్ జిల్లాలోని హుస్నాబాద్ మండలాన్ని సిద్దిపేటలో కలుపడాన్ని నిరసిస్తూ శనివారం హుస్నాబాద్ పరిరక్షణ సమితి ఆధ్యర్యంలో బంద్ సంఫూర్ణంగా జరిగింది. ఆందోళనకారులు బస్సులను తిరగనివ్వలేదు. ఉదయం నుంచే బైక్ ర్యాలీలు నిర్వహిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో అఖిల పక్ష నాయకులు ఆందోళన చేపట్టారు.
జనగామ బంద్ సక్సెస్
వరంగల్‌లోని జనగామను జిల్లా చేయాలనే డిమాండ్‌తో జేఏసీ ఆధ్వర్యంలో బంద్ జరిగింది. జనగామ, మద్దూరు, నర్మెట, లింగాలఘనపురం మండలాల పరిధిలో బంద్, ధర్నాలు జరిగాయి. వందల సంఖ్యలో పోలీసు బలగాలు మోహరించారుు. జేఏసీ చైర్మన్ ఆరుట్ల దశమంతరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతో పాటు పలు పార్టీల నాయకులు, మహిళ, విద్యార్థి సంఘాల నాయకులు రహదారిపై బైఠాయించారు. దీంతో వరంగల్, హైదరాబాద్, విజయవాడ, సిద్దిపేట వైపు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. పోలీసులు ఆం దోళన చేస్తున్న నాయకులను బలవతంగా అరెస్టు చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులపై పోలీసులు చేయి చేసుకోవడమే కాకుండా, కెమెరాలను పగులగొట్టారు. మహిళలు బోనాలతో ఆందోళన చేపట్టి జనగామ జిల్లా ఆకాంక్షను తెలియజేశారు.