సాక్షి, హైదరాబాద్: లాక్‌డౌన్‌ను మరింత పకడ్బందీగా అమలుచేసే లక్ష్యంతో పోలీసుశాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా కరోనా కేసుల్ని సమర్థంగా ఎదుర్కొన్న కరీంనగర్ ఫార్ములా అమలుకు రంగం సిద్ధం చేసింది. కరోనా కేసులు అధికంగా వెలుగుచూస్తున్న సమస్యాత్మక ప్రాంతాల్లో వ్యాపార, ఇతర కార్యకలాపాలను మధ్యాహ్నానికే పరిమితం చేయాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. దీని ప్రకారం కిరాణా, పెట్రోలు బంకులు, ఇతర వ్యాపారాలను ఉదయం 7 నుంచి 12 గంటల వరకే నడపాలని పోలీసులు ఇప్పటికే దాదాపు అన్ని పీఎస్ పరిధిలోని ఆయా నిర్వాహకులకు సూచించినట్టు సమాచారం.
బుధవారం రాష్ట్రంలోని పలు పట్టణాల్లో మధ్యాహ్నం తరువాత వ్యాపార కార్యకలాపాలు దాదాపు స్తంభించాయి. వైరస్‌ను ఒకచోట నుంచి మరోచోటకు మోసుకెళ్లేది మనుషులే కాబట్టి.. జనసంచారంపై కఠినంగా వ్యవహరించాలని పోలీసులు నిర్ణయించారు. అకారణంగా జనం బయటికి వచ్చేందుకు వాహనాలు కూడా ఒక కారణం. వీటి కట్టడికి పెట్రోలుబంకుల పనివేళలను కుదించాలని నిర్ణయించారు. అన్ని సూపర్‌మార్కెట్లు, కిరాణాషాపుల వద్ద భౌతికదూరం అమలు కాకపోతే.. వారిపై చర్యలు తప్పవన్న డీజీపీ మహేందర్‌రెడ్డి హెచ్చరికల ప్రభావం బుధవారం కనిపించింది. వ్యాపారులంతా తమ వద్దకు వచ్చేవారిని సర్కిళ్లలోనే నిలవాలని కోరుతున్నారు. ఇక, రాష్ట్ర సరిహద్దుల వద్ద భద్రతను పెంచారు. పోలీసులు అనుమతించిన పాసులుంటే తప్ప.. ఎవరినీ రాష్ట్రం లోపలికి, బయటికి వదలట్లేదు. చదవండి: విధుల్లో విఫలమైతే వేటు
ఇళ్లల్లోనూ భౌతిక దూరం..
రాష్ట్రంలో ప్రభుత్వం గుర్తించిన దాదాపు 320కిపైగా కంటైన్మెంట్ జోన్లలో పోలీసులు సరికొత్త ప్రచారం ప్రారంభించారు. ఆయా జోన్లలో ప్రజలు పక్కింటికి కూడా వెళ్లేందుకు అనుమతి నిషేధించారు. పటిష్ట బందోబస్తు చర్యలతో ఈ జోన్లలో కర్ఫ్యూ పగలూ, రాత్రి పక్కాగా అమలవుతోంది. అలాగే, ఇళ్లలోనూ భౌతికదూరం పాటించాలని సూచిస్తున్నారు. వైరస్ వ్యాప్తిని అరికట్టేందుకు ఇదే మార్గమంటూ ఉదయం, సాయంత్రం వేళల్లో పబ్లిక్ అడ్రసింగ్ సిస్టం ద్వారా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
రెండువారాల్లో ‘కరీంనగర్ కరోనా ఫ్రీ’!
కారణం లేకుండా బయటికి వచ్చేవారిని నియంత్రించేందుకు రాష్ట్రమంతటా కరీంనగర్ తరహా విధానాన్ని అవలంబిస్తున్నారు. కరీంనగర్‌లో మర్కజ్ కేసులు దాదాపు 17 నమోదుకాగా.. ఇప్పుడవి రెండుకు తగ్గాయి. మరో రెండు వారాల్లో కేసులు జీరోకు చేరుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. పోలీస్, బల్దియా, రెవెన్యూ, మున్సిపల్, మార్కెటింగ్, పౌరసరఫరాల శాఖలు సమన్వయంగా పనిచేసేలా జిల్లాకు చెందిన మంత్రి గంగుల కమలాకర్, కలెక్టర్ శశాంక, పోలీస్ కమిషనర్ కమలాసన్‌రెడ్డి చర్యలు తీసుకున్నారు. పోలీసులు జనం బయటికి రాకుండా కఠినంగా వ్యవహరించారు. వాహన సంచారం తగ్గించేందుకు బంకులు, వ్యాపార సముదాయాల పనివేళలు కుదించాలని నిర్వాహకులే స్వయంగా నిర్ణయం తీసుకోవడం పోలీసులకు కలిసివచ్చింది. దీంతో పగలు, రాత్రి కర్ఫ్యూ సమర్థంగా అమలైంది. లాక్‌డౌన్ కారణంగా పోలీసుల తీరుతో ప్రజలు మొదట్లో కాస్త ఇబ్బందిపడినా, కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో అంతా పోలీసుల పనితీరును ప్రశంసిస్తున్నారు.
అందరి సమన్వయంతోనే సాధ్యం
కరీంనగర్‌లో ఇండోనేషియన్లకు పాటిజివ్ వచ్చిన వెంటనే అప్రమత్తమయ్యాం. మత ప్రచారకులు తిరిగిన ప్రాంతాలను పూర్తిగా సీజ్ చేశాం. జిల్లా సరిహద్దులు మూసేశాం. జనసంచారాన్ని పూర్తిగా నియంత్రించాం. ఉదయం, సాయంత్రం వైరస్ తీవ్రతపై ప్రచారంచేసి ప్రజల్లో అవగాహన కల్పించాం. రెవెన్యూ, మున్సిపల్, పౌరసరఫరాలు, మార్కెటింగ్ తదితర ప్రభుత్వ విభాగాలతో సమన్వయంతో పనిచేశాం. ప్రజలు, వ్యాపారులు, పెట్రోలుబంకు నిర్వాహకులు సహకరించారు. ఇక్కడ 17 కేసులు నమోదైనా.. అవన్నీ రెండు మూడువారాల్లో ‘జీరో’కు చేరతాయని ఆశిస్తున్నాం.
– కమలాసన్‌రెడ్డి, సీపీ, కరీంనగర్
Comments
Please login to add a commentAdd a comment