సాక్షి, కరీంనగర్ : ఇన్‌స్పెక్టర్ల బదిలీలకు సంబంధించి ప్రతిపాదిత జాబితా లీక్ కావడం పోస్టింగ్‌ల కోసం ఎదురు చూస్తున్న వారి ఆశలపై నీళ్లు చల్లింది. బదిలీల సమయంలో ఎవరిని ఎక్కడికి పంపించాలనే విషయంలో తమకు స్థానిక ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధుల నుంచి వచ్చిన సిఫారసులకు అనుగుణంగా ఆయా జిల్లాల కమిషనర్లు, ఎస్‌పీలు ఐజీకి పంపించడం సర్వసాధారణం. అందులో భాగంగానే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ నుంచి ఐజీ కార్యాలయానికి వెళ్లిన ప్రతిపాదిత బదిలీల జాబితా ఈ నెల 15న లీక్ అయింది. అంతకుముందు రోజు అంటే 14న కూడా ఆరుగురు ఇన్‌స్పెక్టర్ల బదిలీలకు సంబంధించి కూడా ఉత్తర్వులు వాట్సాప్ పోలీస్ గ్రూపుల్లో అనధికారికంగా లీకయ్యాయి.
ఈ విషయాన్ని ఫోకస్ చేస్తూ ఈ నెల 16న ‘సాక్షి’ దినపత్రికలో ‘పోలీస్ ఇన్‌స్పెక్టర్ల బది‘లీకులు’’ శీర్షికతో వార్త కథనం ప్రచురితమైంది. కమిషనరేట్ నుంచి ఐజీ స్థాయి అధికారికి వెళ్లే ప్రతిపాదనలు పోలీస్ వాట్సాప్ గ్రూపుల్లో లీక్ కావడంపై కమిషనర్ కమలాసన్‌రెడ్డి, ఐజీ నాగిరెడ్డి తీవ్రంగా పరిగణించారు. సోషల్ మీడియాలో ప్రతిపాదిత బదిలీ జాబితాను పెట్టిన వ్యక్తి వన్‌టౌన్ కానిస్టేబుల్ గౌస్‌గా గుర్తించిన అధికారులు సోమవారం అడవి ముత్తారం పోలీస్‌స్టేషన్‌కు అటాచ్డ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. ఇన్‌స్పెక్టర్ల బదిలీలకు సంబంధించి ఉత్తర్వుల జారీ విషయంలో ఆచితూచి వ్యవహరిస్తున్నారు.
ప్రతిపాదిత జాబితాను మార్చే ఆలోచన?
ఈ నెల 15న లీక్ అయిన ప్రతిపాదిత జాబితాలో 13 మంది సీఐల పేర్లు ఉన్నాయి. వారిలో ఎస్‌బీ ఇన్‌స్పెక్టర్ టి.మహేష్‌ను తిమ్మాపూర్ సర్కిల్‌కు, సీటీసీ ఇన్‌స్పెక్టర్ తిరుమల్‌ను కరీంనగర్ ట్రాఫిక్‌కు బదిలీ చేస్తూ జిల్లా ఉత్తర్వులు(డీవో) జారీ అయ్యాయి. వీరితోపాటు వన్‌టౌన్ ఇన్‌స్పెక్టర్ తులా శ్రీనివాసరావును రూరల్‌కు బదిలీ చేస్తూ ఆదేశాలు వచ్చాయి. శ్రీనివాస్‌రావు పేరు అంతకుముందు రోజు లీక్ అయిన ఉత్తర్వుల జాబితాలో ఉంది. వీరు గాకుండా మరో 11 మందికి సంబంధించి ప్రతిపాదనలు పెండింగ్‌లో పడ్డాయి. వారిలో కరీంనగర్ ట్రాఫిక్–2 కు ప్రతిపాదించిన ఎస్.సదానందంను వేరే చోటికి బదిలీ చేయాలని ఇప్పటికే నిర్ణయించినట్లు సమాచారం. మిగతా 10 మందితోపాటు రామగుండం కమిషనరేట్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల జిల్లాలకు చెందిన పలువురు ఇన్‌స్పెక్టర్లు బదిలీ ఉత్తర్వుల కోసం వేచి చూస్తున్నారు.
రామగుండం కమిషనరేట్, ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలకు చెందిన వారు చాలామంది కరీంనగర్ జిల్లాలో పోస్టింగ్ కోసం వేచి చూస్తున్నారు. వరంగల్ కమిషనరేట్, ఖమ్మం కమిషనరేట్ నుంచి ఎంత మంది ఉమ్మడి జిల్లాకు ఆప్షన్లు ఇచ్చారో తెలియదు. ఈ నేపథ్యంలో నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి ఆచితూచి వ్యవహరిస్తున్నారు. కరీంనగర్‌లో లీకైన ప్రతిపాదిత జాబితా ప్రకారమే పోస్టింగ్‌లు ఇస్తే తప్పుడు సంకేతాలు పోతాయని కూడా భావిస్తున్నట్లు సమాచారం. ప్రజాప్రతినిధులు సిఫారసు చేసిన వారి జోలికి వెళ్లకుండా ప్రతిపాదిత జాబితాలో ఉన్న మిగతా ఇన్‌స్పెక్టర్ల పోస్టింగ్‌లను మార్చాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలిసింది. జిల్లాల వారీగా కాకుండా నార్త్ జోన్‌లో అర్హత గల వారందరినీ ఒకేసారి బదిలీ చేసే అవకాశం కూడా ఉందని ఓ అధికారి తెలిపారు.
ఎమ్మెల్యేల చుట్టూ ఇన్‌స్పెక్టర్లు
బదిలీల ప్రక్రియలో జాప్యంతో పలువురు ఇన్‌స్పెక్టర్లు స్థానిక ఎమ్మెల్యేల ద్వారా చివరి ప్రయత్నాల్లో ఉన్నారు. ఆయా పోలీస్‌స్టేషన్లలో ఇన్‌స్పెక్టర్ పోస్టుకు సంబంధిం చి ఎమ్మెల్యే ప్రతిపాదనలకు తొలి ప్రాధాన్యత ఇస్తుండడంతో పోలీ స్ అధికారులు పైరవీలు ముమ్మరం చేశారు. ఉ మ్మడి జిల్లాలోని 13 ని యోజకవర్గాల్లో మంత్రులు, ఎమ్మెల్యేల వద్దకు ఇన్‌స్పెక్టర్లు సిఫారసు లేఖల కోసం తిరుగుతున్న దృశ్యాలు సర్వసాధారణం అయ్యాయి. నేడో రేపో అధికారికంగా ఇన్‌స్పెక్టర్ల బదిలీల ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment