గుత్తాధిపత్యం ఇక చెల్లదు! | KCR Criticism On Government Employees | Sakshi
Sakshi News home page

గుత్తాధిపత్యం ఇక చెల్లదు!

Published Sat, Jul 20 2019 2:51 AM | Last Updated on Sat, Jul 20 2019 2:52 AM

KCR Criticism On Government Employees  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : హెచ్‌ఎండీఏకు పనిమీద వెళ్లిన ఓ ఎంపీకే అక్కడి ఉద్యోగులు చుక్కలు చూపించారని, లంచాల కోసం అడుగడుగునా వేధించారని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు. హెచ్‌ఎండీఏ కమిషనర్‌ ఆదేశించినా, సదరు ఎంపీ పనిచేసేందుకు అక్కడి ఉద్యోగులు ఒప్పుకోలేదన్నారు. కమిషనర్లు వస్తారు. పోతారు. తాము ఇక్కడే శాశ్వతం అని ఎంపీకి సదరు ఉద్యోగాలు తేల్చి చెప్పడంతో లంచాలిచ్చి పని చేయించుకోవాల్సిన వచ్చిందన్నారు. చివరకు ఎంపీ ఫైలును పోస్టులో పంపేందుకు అక్కడి అటెండర్‌ సైతం లంచం తీసుకున్నారని కేసీఆర్‌ వెల్లడించారు.

మున్సిపాలిటీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లు, హెచ్‌ఎండీఏ వంటి పట్టణాభివృద్ధి సంస్థల మధ్య పరస్పర ఉద్యోగుల బదిలీలు జరపడానికి వీలులేని కారణంగా దశాబ్దాలుగా ఎక్కడి ఉద్యోగులు అక్కడే పనిచేస్తూ విచ్చలవిడిగా అవినీతి, అక్రమాలకు పాల్పడుతున్నారన్నారు. ఈ జాఢ్యాన్ని నివారించేందుకే మున్సిపాలిటీల్లో ఏకీకృత సర్వీసు రూల్స్‌ తీసుకొచ్చామన్నారు. ఇకపై ఎవరీ గుత్తాధిపత్యం నడవదని, ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఉద్యోగుల బదిలీలు ఉంటాయని, ఆ అధికారం పురపాలక శాఖ డైరెక్టర్‌కు అప్పగించామన్నారు. కొత్త మున్సిపల్‌ బిల్లుపై శుక్రవారం శాసనసభలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ శాఖలను చీల్చి మరీ ఉద్యోగ సంఘాలను పెట్టించారన్నారు. రెవెన్యూశాఖ పరిధిలోని స్టాంప్స్‌ అండ్‌ రిజిస్ట్రేషన్‌ విభాగానికి యూనియన్‌ను అనుమతించడం సరికాదన్నారు. ‘ప్రభుత్వ ఉద్యోగి అంటే ప్రభుత్వ ఉద్యోగి. ప్రభుత్వం పరిపాలన సౌలభ్యం కోసం విభాగాలు పెడుతుంది. ఎవరికి ఎక్కడ పనిచేయాలన్న అక్కడే చేయాలి. మాది ఆ శాఖ మాది ఈ శాఖ అనకూడదు. గుత్తాధిపత్యం నడవదు’అని హెచ్చరించారు. 

ఇదెక్కడి అరాచకత్వం... ప్రజలకు ఈ వేధింపులేంటి?
‘సీఎం, సీఎస్, రెవెన్యూ సెక్రటరీకి లేని అధికారాలు వీఆర్వోకు ఉన్నాయి. ఒకరి భూమిని మరొకరికి రాయడం, ఎకరాలను తారుమారు చేయడం రోజూవారి తతంగంగా మారింది. ఇదెక్కడి అరాచకత్వం. ప్రజలకు ఈ వేధింపులేంటి? కొంతమంది వారిని ప్రోత్సహిస్తారు. రెవెన్యూ చట్టం మారిస్తే కొత్త చట్టంలో మేము చెప్పినట్టు రాయాలంటారు. మీరు చెప్పినట్టు చట్టం ఉండాలంటే శాసనసభ ఎందుకు? శాసనసభ్యులెందుకు? కుక్క.. తోకను ఊపుతుందా? తోకే.. కుక్కను ఊపుతదా? ఎట్టి పరిస్థితులలోనూ దీన్ని ఉపేక్షించబోం. ఈ భయపడడం, మొహమాటపడడం ఎందుకు? ప్రజలకు మేలుచేసేందుకు ఎక్కడివరకైనా వెళ్లడానికి సిద్ధం. అందుకే మున్సిపల్‌ ఏకీకృత సర్వీసు తీసుకొచ్చాం. ఇకపై హెచ్‌ఎండీఏ, జీహెచ్‌ఎంసీ, మున్సిపాలిటీల నుంచి ఏ అధికారినైనా ఎక్కడికైనా బదిలీ చేయవచ్చు’అని సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. 

అందరూ చట్టాన్ని చదవండి 
‘మున్సిపాలిటీల్లో అనుమతులు టీఎస్‌–ఐపాస్‌ తరహాలో అనుమతులుంటాయి, నిర్దేశిత గడువులోగా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలు జారీచేయని పక్షంలో బాధ్యులైనవారి ఉద్యోగాలు పోతాయి. ఈ చట్టాన్ని మునిసిపల్‌ ఉద్యోగులు, ప్రజాప్రతినిధులు తప్పనిసరిగా చదవాలి. లేఔట్‌ అనుమతులు జిల్లా కలెక్టర్లు ఇస్తారు. 1920 టౌన్‌ప్లానింగ్‌ యాక్టు ఇంకా అమలు చేస్తున్నారని మార్చాం. ఇప్పుడు జరుగుతున్న అక్రమాలు, ల్యాండ్‌ మాఫియాలు, అక్రమ లేఔట్లు పోవాలి’అని సీఎం కేసీఆర్‌ ఆకాంక్షించారు. లేఔట్లలో రోడ్లు, పార్కులు, ఇతర మౌలిక సదుపాయాల కోసం నిబంధనల మేరకు కేటాయించాల్సిన స్థలాలను సైతం రియల్టర్లు అమ్మేస్తున్నారని, ఇకపై ఇలాంటి స్థలాలను మున్సిపాలిటీ పేరుపై రిజిస్ట్రేషన్‌ చేశాకే తుది లేఔట్‌ అనుమతులిస్తామన్నారు. 

సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటు 
తెలంగాణ శరవేగంగా పురోగమిస్తోందని, 65% పట్టణీకరణ సాధించామని కేసీఆర్‌ తెలిపారు. అర్బన్‌ వ్యవహారాల మీద సమగ్ర దృక్పథం కోసం 25ఎకరాల్లో ‘సెంటర్‌ ఫర్‌ అర్బన్‌ ఎక్స్‌లెన్స్‌’సంస్థను ఏర్పాటు చేసి మున్సిపాలిటీ ప్రజాప్రతినిధులకు శిక్షణ ఇస్తామన్నారు. మేయర్, చైర్మన్, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు, మున్సిపల్‌ అధికారులకు శిక్షణ తప్పనిసరన్నారు. హైదరాబాద్, వరంగల్‌ వంటి పట్టణాలపై జనాభా ఒత్తిడని తగ్గించడానికి శాటిలైట్‌ సిటీలు రావాలని, వీటిని ప్రోత్సహించేందుకు త్వరలో రాయితీలు ప్రకటిస్తామన్నారు. 

ఇక పాలనాసంస్కరణలపై దృష్టి 
‘గత టర్మ్‌లో మేము కొద్దిగా సంక్షేమం, కరెంట్‌ కోతల నివారణ, ఇరిగేషన్, మంచినీళ్లపై ఎక్కువగా దృష్టిపెట్టాం. చాలా విజయవంతమయ్యాం. 55 లక్షల ఇళ్లకు నల్లాల ద్వారా నీటి సరఫరా జరుగుతోంది. ఈ ప్రాజెక్టు 99.9% ప్రాజెక్టు పూర్తిఅయింది. మిగిలిన 3,400 ట్యాంకులు పూర్తయితే అద్భుతం జరగబోతోంది. మిషన్‌ భగీరథతో మంచినీళ్ల బాధపోయింది. కరెంట్‌బాధ పోయింది. సంక్షేమంతో ప్రజల్లో నిస్సహాయత పోయింది. చాలా రంగాల్లో మంచి మార్పు జరిగింది. లంచాల వేధింపులు పోవాలి. పరిశుద్ధ పరిపాలన ఉండాలి. సులభంగా పని జరిగే పరిస్థితి ఉండాలి. కాబట్టి ఈ చట్టాలు తెస్తున్నాం. ప్రజలు అవినీతి బారినపడకుండా ఆలోచిస్తున్నాం. ఆ దిశగా రాజీలేకుండా పురోగమిస్తాం’అని కేసీఆర్‌ స్పష్టం చేశారు.

కేసీఆర్‌ ప్రసంగంలోని మరికొన్ని ముఖ్యాంశాలు 

  • నిరుపేదలు చనిపోతే దహన సంస్కారాలు చేసేందుకు ఇబ్బందిగా మారింది, పట్టణా లు, గ్రామాల్లో దహన వాటికలు, ఖనన వాటికల కోసం నిబంధనలు సడలించి వీటి కోసం స్థలం కొనేందుకు అవకాశం కల్పించాం. 
  • హైదరాబాద్‌ జనాభా కోటి దాటుతోంది. హైదరాబాద్‌కు వచ్చిపోయే విమానాల సంఖ్య 500కు దాటింది. నగరంలో వెజ్, నాన్‌వెజ్‌ మార్కెట్లు సరిపడేంతగా లేవు. కనీసం 100 ఉండాల్సినచోట ఆరేడు మాత్రమే ఉన్నాయి.
  • మున్సిపాలిటీల్లోని ఇళ్లకు కొత్త ఇంటి నంబర్లను త్వరలో జారీ చేస్తామని కేసీఆర్‌ తెలిపారు. ప్రతి ఇంటికీ క్యూఆర్‌ కోడ్‌ ఉంటుందని ఇందులో చాలా విషయాలు పొందుపరుస్తాం. అపరిచితులు, నేరస్తులను పట్టుకోవడం, నేర పరిశోధనకు ఇవి ఉపయోగపడతాయి.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement