
సాక్షి, కరీంనగర్: గులాబీ దళపతి, ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఈనెల 20న ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈనెల 19తో ముందస్తు ఎన్నికల నామినేషన్ల ఘట్టం ముగియనుండగా.. అదే రోజు నుంచి రాష్ట్రంలో ప్రచార సభలకు శ్రీకారం చుట్టనున్నారు. ఈ నేపథ్యంలో 20న ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్ల, వేములవాడ, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించే బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగించనున్నారు. ప్రజా ఆశీర్వాద సభల పేరిట కొంగరకలాన్ నుంచి ముందస్తు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్.. రెండో సభను హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్రంలో నిర్వహించారు. అభ్యర్థుల ప్రకటన.. నామినేషన్ల ఘట్టం తర్వాత మలివిడత ప్రచారానికి సిద్ధమైన ఆయన.. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఈనెల 20న భారీ ప్రచార సభ నిర్వహించనున్నారు.
ముందస్తు ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టిన కేసీఆర్.. మొదటగా ఉమ్మడి జిల్లాలో మంత్రులు కేటీఆర్, ఈటల రాజేందర్ ప్రాతినిథ్యం వహిస్తున్న సిరిసిల్ల, హుజూరాబాద్ నియోజకవర్గాల నుంచే ఈ సభలను నిర్వహించనున్నారు. 20న మధ్యాహ్నం 2.30 గంటలకు హుజూరాబాద్‌లో నియోజకవర్గ స్థాయి సభ నిర్వహించనుండగా.. 3.30 గంటలకు సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాల సభను సిరిసిల్ల జిల్లాకేంద్రంలో నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో కేసీఆర్ సభలను విజయవంతం చేసేందుకు పార్టీ ప్రజాప్రతినిధులు, నాయకులు సర్వసన్నద్ధం కావాలని పార్టీ పిలుపునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment