సాక్షి, కామారెడ్డి: జిల్లాలోని బాన్సువాడ, పెద్దకొడప్‌గల్‌లలో బుధవారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలకు ఊహించిన దానికన్నా ఎక్కువ జనం తరలివచ్చారు. దీంతో టీఆర్‌ఎస్ అభ్యర్థులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, హన్మంత్ సింధేలతో పాటు ఆ పార్టీ నేతలు, శ్రేణుల్లో ఉత్సాహం ఉప్పొంగింది. సీఎం కేసీఆర్ ఆసాంతం వ్యవసాయం, రైతుల చుట్టే తన ప్రసంగాన్ని కొనసాగించారు. రైతులను రాజును చేయడానికి తాను పడుతున్న శ్రమను, పడ్డకష్టాలను ఏకరువుపెట్టారు. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుబంధు, రైతుబీమా పథకాలను తీసుకువచ్చానన్నారు. పట్టాదారు పాసుపుస్తకాలు అందని రైతుల అంశాన్ని ప్రస్తావించారు.
ఎన్నికల తరువాత దగ్గరుండి సమస్యçను పరిష్కరిస్తానని సీఎం ప్రకటించడంతో రైతులు ఆనందం వ్యక్తం చేశారు. అందరు రైతుల లాగే అటవీ భూములు సాగు చేస్తున్న రైతులకూ పాసుబుక్కులు ఇచ్చి, రైతుబంధు, రైతుబీమా వర్తింపజేస్తామని హామీ ఇవ్వడంపై హర్షం వ్యక్తమవుతోంది. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడిన సీఎం.. అది పూర్తయితే నిజాంసాగర్ ప్రాజెక్టు 365 రోజులూ నిండుగా ఉంటుందని, రోహిణి కార్తెలోనే నార్లు పోసుకోవచ్చునని పేర్కొన్నారు. ఎత్తిపోతల పథకాలు, 24 గంటల విద్యుత్ గురించి వివరించారు.
రైతు అప్పుల నుంచి బయటపడి, తన బ్యాంకు ఖాతాలో రూ. 5 లక్షలు నిల్వ ఉంచుకునే రోజు వచ్చినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందన్నారు. సీఎం కేసీఆర్ రెండు చోట్లా రైతులు, వ్యవసాయం, ప్రాజెక్టులు, ఉచిత కరెంటు మీదనే ఎక్కువ సేపు ప్రసంగించారు. రైతులకోసం అమలు చేస్తున్న పథకాలను వివరించి, ప్రజల నుంచి స్పందన కోరారు. ప్రజలు చప్పట్లతో బదులిచ్చారు. కేసీఆర్ ప్రసంగాన్ని ప్రజలు ఆసక్తిగా విన్నారు. ఆసాంతం వ్యవసాయం గురించే మాట్లాడడడంతో సభలకు హాజరైన వేలాది మంది రైతులు చప్పట్లతో ఆనందం వ్యక్తం చేశారు. తమ దళపతి ప్రసంగం గులాబీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది.
Comments
Please login to add a commentAdd a comment