మా నాయకుడే బాహుబలి
మా నాయకుడే బాహుబలి
Published Sun, Mar 19 2017 5:41 PM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM
హన్మకొండ: మా నాయకుడు సీఎం కేసీఆరే బాహుబలి అని, మా బాహుబలికి ఎదురెవరని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి అన్నారు. హన్మకొండలో ఆదివారం జరిగిన టీఆర్‌ఎస్ వరంగల్ పశ్చిమ నియోజకవర్గ సభ్యత్వ నమోదు సమావేశంలో నియోజకవర్గ నివాసిగా ఆయన క్రీయాశీల సభ్యత్వం తీసుకుని పార్టీ సభ్వత్వ నమోదును ప్రారంభించారు. అంతకుముందు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీకి ఎజెండా అంటూ లేదని దుయ్యబట్టారు. నాయకత్వం లేని ఆ పార్టీకి బాహుబలి ఎక్కడి నుంచి వస్తారని ప్రశ్నించారు. కమ్యూనిస్టులను ప్రజలు విశ్వసించరన్నారు.
టీడీపీ తెలంగాణలో కనుమరుగైన పార్టీ అని తూర్పారబట్టారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ప్రాజెక్టులను పట్టించుకోలేదని, జలయజ్ఞాన్ని ధనయజ్ఞంగా మార్చారని విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కోటి ఎకరాలకు నీరందించాలనే లక్ష్యంతో ముందుకు పోతుంటే కాంగ్రెస్ పార్టీ అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు. పాలమూరు ఎత్తిపోతల పథకం పనులు జరగకుండా గ్రీన్ ట్రిబ్యునల్‌కు వెళ్లి అడ్డంకులు సృష్టించిందని ధ్వజమెత్తారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌తో ప్రతిపక్షాలు దిక్కుతోచని స్థితిలో పడి చౌకబారు విమర్శలు చేస్తున్నాయన్నారు. దేశంలో ఎక్కడా లేని విధంగా మొదటిసారిగా ఎస్సీ, ఎస్టీల అభివృద్ది, సంక్షేమం కోసం టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఎస్సీ, ఎస్టీలకు వేర్వేరుగా స్పెషల్ డెవలప్‌మెంట్ ఫండ్ తీసుకొచ్చిందని తెలిపారు. ఈ ఫండ్‌కు అసెంబ్లీ సమావేశాల్లోనే చట్టం తీసుకురానున్నట్లు స్పష్టం చేశారు.
కరీంనగర్ ఎంపీ బోయినపల్లి వినోద్‌కుమార్ మాట్లాడుతూ.. 2013 భూసేకరణ చట్టానికి రైతులకు మేలు చేకూర్చేలా సవరణలు చేసి రాష్ట్రపతి ఆమోదానికి పంపితే ఆమోదించొద్దని కాంగ్రెస్ పార్టీ వేయి దరఖాస్తులు ఇప్పించి దుర్మార్గంగా వ్యవహరిస్తోందని దుయ్యబట్టారు. అభివృద్ది పనులకు ఆటంకాలు కల్గిస్తోందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే దాస్యం వినయభాస్కర్, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు తక్కళ్ళపల్లి రవీందర్‌రావు, వరంగల్ మేయర్ నన్నపునేని నరేందర్, చైర్మన్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.
Advertisement