సాయం చేయండి.. | KCR Meets Narendra Modi | Sakshi
Sakshi News home page

సాయం చేయండి..

Published Thu, Dec 27 2018 9:25 AM | Last Updated on Wed, Mar 6 2019 8:09 AM

KCR Meets Narendra Modi - Sakshi

సాక్షి, వరంగల్‌ రూరల్‌: ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో కొనసాగుతున్న ప్రాజెక్టులకు కేంద్రం ఆర్థిక సాయమందించాలని ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు కోరారు. ముఖ్యమంత్రిగా రెండోసారి ప్రమాణ స్వీకారం చేసిన అనంతరం ప్రధాని మోదీతో కేసీఆర్‌ తొలిసారిగా ఢిల్లీలో బుధవారం సమావేశమయ్యారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్క్‌ కోసం రూ.1000 కోట్లు కేటాయిం చాలని కోరారు. దీంతోపాటు కాళేశ్వరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వాలని, ములుగులో గిరిజన యూనివర్సిటీ, కొత్త జిల్లాల్లో జవహర్‌ నవోదయ విద్యాలయాలు ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు. కాజీపేట రైల్వే కోచ్‌ ఫ్యాక్టరీ ఏర్పా టుపై చర్చించారు.

కాళేశ్వరానికి జాతీయ హోదా.. 
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని ప్రధానిని సీఎం కేసీఆర్‌ కోరారు. తెలంగాణలో బీడు భూములను సాగులోకి తెచ్చేందుకు నిర్మిస్తున్న కాళేశ్వరం ప్రాజెక్ట్‌ పనులు దాదాపు 85 శాతం పూర్తయ్యాయి. రూ.80,500 కోట్లతో ప్రాజెక్ట్‌ను నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు సాగునీటి కొరత తీరనుంది. ప్రాజెక్ట్‌ ద్వారా 180 టీఎంసీల నీటిని ఎత్తిపోయనున్నారు. కాళేశ్వరం ప్రాజెక్ట్‌ ద్వారా ఎస్సారెస్సీ ప్రాజెక్టు  నిండిన తర్వాత కాల్వల ద్వారా ఉమ్మడి వరంగల్‌కు నీరు వస్తుంది. ఎస్సారెస్పీ స్టేజ్‌–1, స్టేజ్‌–2 ద్వారా ఉమ్మడి వరంగల్‌ జిల్లాకు ప్రయోజనం చేకూరనుంది.
  
టెక్స్‌టైల్‌ పార్క్‌కు రూ.1000 కోట్లు.. 
దేశంలోనే అతిపెద్ద టెక్స్‌టైల్‌ పార్క్‌ నిర్మాణం కోసం రూ.1000 కోట్లు కేటాయించాలని కోరారు. కాకతీయ మెగా టెక్స్‌టైల్‌ పార్కుకు 2017, అక్టోబర్‌ 22న ముఖ్యమంత్రి కేసీఆర్‌ శంకుస్థాపన చేశారు. టెక్స్‌టైల్‌  పార్కు ఏర్పాటు కోసం వరంగల్‌ రూరల్‌ జిల్లాలోని గీసుకొండ, సంగెం మండలాల సరిహద్దులో 1200 ఎకరాల భూమిని రైతుల నుంచి సేకరించారు. ప్రస్తుతానికి ప్రహరీ నిర్మాణం పూర్తయ్యింది. పార్క్‌లో మెయిన్‌ రోడ్ల నిర్మాణం జరుగుతోంది. ఈ పార్క్‌ పూర్తయితే 1.13 లక్షల మందికి ఉపాధి లభించనుంది.

రైల్వే ప్రాజెక్ట్‌ల పురోగతి గురించి.. 
కాజీపేటలో మంజూరైన రైల్వే ప్రాజెక్టుల పురోగతిపై చర్చించారు. 2010–2011లో కాజీపేటకు రైల్వే వ్యాగన్‌ మ్యాన్‌ఫాక్చరింగ్‌ యూనిట్, 2015–2016లో వ్యాగన్‌ పిరాడికల్‌ ఓవరాలింగ్‌(పీఓహెచ్‌ షెడ్‌)ను మంజూరు చేశారు. స్థల సేకరణ పూర్తి కాలేదు. ఈ ప్రాజెక్టులు ఏర్పాటైతే నిరుద్యోగులకు ఉపాధి లభించనుంది.

గిరిజన యూనివర్సిటీ.. 
ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో గిరిజన యూనివర్సిటీని ఏర్పాటు చేయాలని కోరారు. జయశంకర్‌ భూపాలపల్లి జిల్లాలోని ములుగు ప్రాంతంలో ఇందుకోసం రెవెన్యూ అధికారులు ఇప్పటికే స్థలం కూడా కేటాయించారు. జిల్లాలో గిరిజనులు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో విశ్వవిద్యాలయం ఏర్పాటు చేయాలని గత కొన్నేళ్లుగా ప్రజలు డిమాండ్‌ చేస్తున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement