బాబుతో జాగ్రత్త!
* ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంపై అధికారులకు కేసీఆర్ సూచన
* కవ్వింపు చర్యలకు పాల్పడుతున్నారు
* నిందితులకు ఆశ్రయం, టీన్యూస్‌కు నోటీసులు అందులో భాగమే
* వీటన్నింటిపై కేంద్ర హోంశాఖ, గవర్నర్‌కు ఫిర్యాదు చేయండి
* సీఎం కేసీఆర్‌తో డీజీపీ, ఏసీబీ డీజీ, హైదరాబాద్ సీపీ భేటీ
* గవర్నర్‌ను కలసిన సీఎస్ రాజీవ్‌శర్మ
సాక్షి, హైదరాబాద్: ‘ఓటుకు కోట్లు’ వ్యవహారంలో రెండు రాష్ట్రాల మధ్య వివాదాలు అవాంఛనీయ సంఘటనలకు దారి తీయకుండా అప్రమత్తంగా ఉండాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రాష్ట్ర పోలీసు యంత్రాంగాన్ని ఆదేశించారు. ‘ఓటుకు కోట్లు’ కేసు నిందితులకు ఆశ్రయమివ్వడం, టీ న్యూస్ చానల్‌కు నోటీసులు ఇవ్వడం వంటి చర్యలతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పాల్పడుతున్న కవ్వింపులపై గవర్నర్‌కు, కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేయాలని అధికారులకు సూచించారు. ‘‘స్వయంగా ఏపీ సీఎం చంద్రబాబు ఈ కేసులో ఇరుక్కోవడం, ఆయన పార్టీకి చెందిన ఎమ్మెల్యే రేవంత్‌రెడ్డి లంచమిస్తూ పట్టుబడటాన్ని అక్కడి ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతోంది. అందుకే కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది. తొందరపడకుండా పక్కాగా కేసు దర్యాప్తు చేయండి. ఎక్కడ పొరపాటు జరిగినా రాజకీయంగా చిలవలు పలవలు చేసేందుకు ఆస్కారమున్న సమయం ఇది. అప్రమత్తంగా ఉండండి..’’ అని పోలీసు ఉన్నతాధికారులతో సీఎం కేసీఆర్ పేర్కొన్నట్లు తెలిసింది.
శనివారం ఉదయం డీజీపీ అనురాగ్‌శర్మ, ఏసీబీ డీజీ ఏకే ఖాన్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్, ఇంటెలిజెన్స్ ఇన్‌చార్జి మహేందర్‌రెడ్డిలు సీఎం కేసీఆర్‌తో సమావేశమయ్యారు. దాదాపు గంటన్నరకుపైగా ఈ భేటీ జరిగింది. ఈ సందర్భంగా ‘ఓటుకు కోట్లు’ కేసులో ఇప్పటివరకు జరిగిన పరిణామాలు, తదుపరి దర్యాప్తునకు సంబంధించిన తాజా సమాచారాన్ని అధికారులు సీఎంకు నివేదించారు. ఈ కేసులో తప్పించుకు తిరుగుతున్న నిందితుడు మత్తయ్య, నోటీసులు అందుకున్న ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్యలను ఏపీ సీఎం చంద్రబాబు కాపాడుతున్నారని... బాబు సూచనల మేరకు వారిద్దరు ఏపీ పోలీసుల సంరక్షణలో ఉన్నారని వివరించినట్లు తెలిసింది. దీంతో ఇతర రాష్ట్రాల్లో నిందితులు తలదాచుకుంటే చట్టపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో.. వాటిని పక్కాగా అనుసరించాలని అధికారులకు సీఎం సూచించినట్లు సమాచారం. ఇక ఈ కేసులో కీలక సాక్ష్యాధారాలైన ఆడియో, వీడియోల ఫోరెన్సిక్ ల్యాబ్ నివేదికలు అందిన తర్వాత దర్యాప్తు వేగం పెంచనున్నట్లు సీఎంకు ఏసీబీ డీజీ చెప్పినట్లు తెలిసింది.
మరో రెండు రాష్ట్రాలకు శాంపిళ్లు..
‘ఓటుకు కోట్లు’ వ్యవహారానికి సంబంధించిన ఆడియో, వీడియో రికార్డులు, ఫోన్ సంభాషణలను విశ్లేషించడంలో ఏసీబీ మరింత పక్కాగా వ్యవహరిస్తోంది. తమ దగ్గరున్న 14 రికార్డులను ఇప్పటికే హైదరాబాద్‌లోని ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపింది. తాజాగా వాటి శాంపిళ్లను మరో రెండు రాష్ట్రాల్లోని ఫోరెన్సిక్ ల్యాబొరేటరీలకు పంపించి విశ్లేషణ చేయించాలని ఏసీబీ భావిస్తోంది. జాతీయ స్థాయిలో సంచలనం రేపిన కేసు కావడంతో ఇలాంటి జాగ్రత్తలు తీసుకోవడం సహజమని ఒక ఉన్నతాధికారి పేర్కొన్నారు.
వాటి పరిణామాలేమిటి?
చంద్రబాబు ఒత్తిడితో ఏపీలో పోలీసులు ఎన్ని కేసులు పెట్టారు, అందులో ఎవరెవరి పేర్లున్నాయి, వాటితో వచ్చే పరిణామాలేమిటనే వివరాలను సీఎం కేసీఆర్ ఆరా తీసినట్లు తెలిసింది. టీ న్యూస్‌కు ఏపీ పోలీసులు స్వయంగా వచ్చినోటీసు ఇచ్చిన తీరుపై చర్చ జరిగినట్లు సమాచారం. ఉమ్మడి రాజధానిగా ఉన్నప్పటికీ తెలంగాణ పోలీసు విభాగం పరిధిలో ఉన్న హైదరాబాద్‌లోని వ్యక్తులు, సంస్థలకు ఏపీ పోలీసులు నేరుగా నోటీసులు ఇవ్వవచ్చా? ఇస్తే ఎలాంటి నిబంధనలు పాటించాలి, ఇతర రాష్ట్రాల పోలీసులు ఇలాంటి నోటీసులు జారీ చేయవచ్చా.. దీనిపై న్యాయపరంగా, చట్టపరంగా ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న అంశాలపై చర్చిం చినట్లు తెలిసింది. ఈ సంఘటనను సీరియస్‌గా పరిగణించాలని సీఎం ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. తాజా పరిణామాలపై కేంద్ర హోం శాఖతో పాటు గవర్నర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించినట్లు సమాచారం. వరుసగా ఇలాంటి నోటీసులు వచ్చినా, మరిన్ని కవ్వింపు చర్యలకు పాల్పడినా ఎక్కడా రాష్ట్ర పోలీసు అధికారులు ఆవేశానికి లోను కావద్దని, సంయమనం పాటించాలని సూచించినట్లు తెలిసింది.
ఏపీ తీరు అక్రమం..
ప్రభుత్వ సీఎస్ రాజీవ్ శర్మ శనివారం మధ్యాహ్నం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌తో భేటీ అయ్యారు. ‘ఓటుకు కోట్లు’ కేసుకు సంబంధించిన తాజా పరిణామాలను ఆయన దృష్టికి తీసుకెళ్లడంతోపాటు ఏపీ ప్రభుత్వం అక్రమంగా అక్కడి పోలీస్ అధికారులను హైదరాబాద్‌లో మోహరించడంపై ఫిర్యాదు చేశారు. రెండు వేల మంది పోలీసులను అక్రమంగా డ్యూటీలో ఉంచారని.. అనుమతి లేకుండా వారు ఇక్కడ కార్యకలాపాలు నిర్వహించటం సరికాదని వివరించినట్లు తెలిసింది. చంద్రబాబు ఫోన్ సంభాషణలను ప్రసారం చేసినందుకు టీన్యూస్ చానల్‌కు నోటీసులిచ్చిన విషయాన్నీ గవర్నర్ దృష్టికి తీసుకెళ్లారు.