ఓయూలోనే కడతం | KCR reiteration on the construction of houses to the poor | Sakshi
Sakshi News home page

ఓయూలోనే కడతం

Published Wed, May 20 2015 12:53 AM | Last Updated on Mon, Aug 13 2018 4:03 PM

ఓయూలోనే కడతం - Sakshi

ఓయూలోనే కడతం

పేదలకు ఇళ్ల నిర్మాణంపై కేసీఆర్ పునరుద్ఘాటన

► ఉద్యమాలంటూ అనవసర రాద్ధాంతం చేస్తున్నారు
► నేను దేనికీ భయపడను.. ఏం చేయాలో అదే చేస్తా
► రేస్ కోర్సులు, క్లబ్బులకు ఎకరాలిచ్చి గరీబోళ్లను మరిచారు
► ఇది రాచరికపు వ్యవస్థ కాదు.. ప్రజాస్వామ్యం
► ధర్మంగా పని చేస్తున్న సర్కారుకు ప్రజలు అండగా ఉండాలి
► ‘స్వచ్ఛ హైదరాబాద్’లో ముఖ్యమంత్రి వ్యాఖ్యలు
► పారిశుధ్య కార్మికులకు ఇళ్లు, వేతనాల పెంపునకు హామీ
 
హైదరాబాద్: రాజధానిలో నాలాల పక్కన దుర్భర జీవితం గడుపుతున్న పేద ప్రజలకు ఉస్మానియా యూనివర్సిటీకి చెందిన భూమిలో ఇళ్లు నిర్మించి ఇస్తామని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పునరుద్ఘాటించారు. ‘ఓయూలో చాలా జాగా ఉంది. నిజానికి అంత అవసరం లేదు. ప్రస్తుతం అక్కడ వృథాగా ఉన్న జాగాలో 10-20 ఎకరాలు తీసుకుని పేదలకు ఇళ్లు కడతం’ అని కేసీఆర్ వెల్లడించారు. ‘స్వచ్ఛ హైదరాబాద్’ కార్యక్రమంలో భాగంగా మంగళవారం సికింద్రాబాద్ నియోజకవర్గంలోని వారాసిగూడలో ముఖ్యమంత్రి పర్యటించారు. ఈ సందర్భంగా కాలనీ కమ్యూనిటీ హాల్‌లో స్థానికులతో సమావేశమై వారి సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం సీఎం మాట్లాడుతూ.. ‘మురికి కాల్వల పక్కన నివసిస్తున్న పేద ప్రజలకు గూడు కల్పించేందుకు ఉస్మానియా వర్సిటీలో కొంత జాగా తీసుకుని ఇళ్లు నిర్మిద్దామంటే.. కొందరు రాద్ధాంతం చేస్తున్నారు. కొంతమంది పిల్లలకు అవగాహన లేక ఉద్యమాలు చేస్తామంటున్నారు’ అని వ్యాఖ్యానించారు. అప్పట్లో నిజాం నవాబు ఓయూ కోసం 2800 ఎకరాల భూమిని కేటాయించాడని, దాంట్లో ఇప్పుడు 1470 ఎకరాలే ఉందని పేర్కొన్నారు. ‘కాంపౌండ్ వెలుపల కూడా కొంత జాగా ఉంది. దాంట్లోంచి 20 ఎకరాలు తీసుకుని పేదలకు ఇళ్లు కడదామనుకున్నాం. దాంతో వెంటనే ధర్నాలు, ఆందోళనలు మొదలయ్యాయి. ఎవరికి తోచినట్లు వారు మాట్లాడుతున్నారు. ప్రతిపక్షాలకు కూడా ఏం పని లేదు. గగ్గోలు పెడుతున్నాయి.

నేను పేదలకు ఇళ్లు కట్టిస్తామంటున్నా. అర్థం చేసుకోవాలి. పేపర్లలో వచ్చిందంతా  కరెక్టు కాదు. నేను దేనికీ భయపడను. ఏం చేయాలో.. అది చేస్తా !’ అని కేసీఆర్ నొక్కి చెప్పారు. సికింద్రాబాద్ నియోజకవర్గానికి ఒకవైపు కంటోన్మెంట్.. మరోవైపు రైల్వే భూములు ఉన్నందున మిగిలింది ఓయూలోని వృథా భూమేనని పేర్కొన్నారు. ఊరవతల ఇళ్లు కడితే పేదలకు కష్టమవుతుందని, అందుకే ఓయూ స్థలంలోనే ఇళ్లు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. ‘ఇది రాచరిక వ్యవస్థ కాదు.. ప్రజాస్వామ్య వ్వవస్థ. 500 ఎకరాలు ఇస్తే హార్టికల్చర్ యూనివర్సిటీని పెడతామని కేంద్ర మంత్రి లేఖ రాశారు. ఆ ఉత్తరాన్ని పట్టుకుని నేరుగా వెళ్లి ప్రధాని నరేంద్ర మోదీని కలిశా. యూనివర్సిటీకి 50 ఎకరాలు సరిపోతుందని చెప్పాను. ప్రధాని కూడా నిజమేనన్నారు’ అని కేసీఆర్ తెలిపారు. గతంలో రేస్ కోర్స్‌లు, గోల్స్ కోర్టులు, క్లబ్బులకు ఎకరాలకు ఎకరాలు ఇచ్చిన పాలకులు గరీబోళ్లకు ఇళ్ల స్థలాలు మాత్రం ఇవ్వలేదని దుయ్యబట్టారు.
 
ప్రపంచంతో పోటీ పడాలి..


సమస్యలకు భయపడిపోవద్దని, ప్రపంచంతో పోటీపడి బతకాలని సీఎం పిలుపునిచ్చారు. దేశంలోని ఐదు ప్రధాన నగరాల్లో ఒకటైన హైదరాబాద్‌లో భూకంపాలు రావని, సేఫ్ జోన్ అయినందునే ఇక్కడికి ఐటీ సంస్థలు తరలి వచ్చాయని పేర్కొన్నారు. అయితే నగరాన్ని కాంక్రీట్ జంగిల్‌గా మార్చేసి ఉష్ణోగ్రతలు పెరిగేలా చేశామని, దాన్ని సరిదిద్దుకోవాల్సి ఉందన్నారు. ఇందుకు ప్రజలు నడుంకట్టాలని, బస్తీకో నాయకుడు తయారవ్వాలని సీఎం పిలుపునిచ్చారు. ‘మేం హామీలిచ్చిన మేరకు నిధులు మంజూరు చేస్తాం. కానీ ఆ పనులు మీరే దగ్గరుండి చూసుకోవాలి. ఏదైనా తప్పు జరిగితే మా ఆఫీసుకు ఫోన్ చేసి ఫిర్యాదుచేయాల’ని సూచించారు. ‘నేను నాలుగేళ్లు ఉంటా. మిమ్మల్ని వదిలి పోను. నెలకు నాలుగుసార్లు ఇక్కడికి వస్తా’ అని వారాసిగూడ వాసులకు కేసీఆర్ భరోసా ఇచ్చారు. ఇళ్లు లేని వాళ్ల నుంచి మూడు రోజులుగా 7500 దరఖాస్తులు వచ్చాయన్నారు.

స్వయంగా ముఖ్యమంత్రే ఇన్‌చార్జిగా ఉన్నందున, కాలనీ వాసులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. తాను ఎన్నికల కోసం రాలేదని, జీహెచ్‌ఎంసీ ఎన్నికలు ఇప్పట్లో లేవని వ్యాఖ్యానించారు. ‘చిలకలగూడలో నాలా లోపల ఇళ్లు కట్టారు. లంచాలు తీసుకుని జీహెచ్‌ఎంసీ అధికారులు చేసిన  నిర్వాకంతో అక్కడ నరకం ఎదురవుతోంది. ఇప్పుడు తోవ చేయాలంటే బిల్డింగ్‌లు తొలగించాల్సి వస్తోంది. సుందర్‌నగర్‌లో ఆరున్నర అడుగుల జాగాలోని ఇంట్లో 8 మంది ఉంటున్నారు. అది చూసి నాకు దుఃఖం వచ్చింది. మనలాగే పుట్టిన వారు అంత దుర్భరంగా బతకాలా? కుక్కలు, పందులకన్నా హీనంగా బతుకుతున్నారు. వారి దుఃఖానికి ముగింపు పలకాలి కదా! అధర్మం చేస్తే ప్రభుత్వాన్ని నిలదీయాలి. ధర్మం చేస్తున్నంత వరకు ప్రభుత్వానికి ప్రజల అండ ఉండాలి’ అని సీఎం కేసీఆర్ అన్నారు. నగరంలో 120 మార్కెట్లను నిర్మిస్తామని, చేపల మార్కెట్లలో గంగపుత్రులకే షాపులు కేటాయిస్తామని తెలిపారు.
 
 సఫాయివాలాలందరికీ ఇళ్లు

‘పార్శీగుట్టలో సోమవారం చెత్త ఎత్తితే రాత్రి వరకు దగ్గుతనే ఉన్నా. ట్యాబ్లెట్ వేసుకున్నాకే పడుకున్నా. అలాంటి వాతావరణంలో  చెత్త తొలగించే కార్మికులు ఎలా జీవిస్తున్నారోనని బాధగా ఉంది. వారు చాలా గొప్పవారు. జీహెచ్‌ఎంసీలోని దాదాపు 20 వేల మంది పారిశుధ్య కార్మికులందరికీ సఫాయి కర్మచారుల కాలనీ పేరిట ఇళ్లు కట్టిస్తాం. వారి వేతనాలను కూడా పెంచుతాం. ఇకపై ఇంటికి 2 చెత్త బుట్టలు ఇస్తాం. నగరంలో చెత్త లేకుండా చూసేందుకు నెల రోజుల్లో 40 లక్షల ప్లాస్టిక్ బుట్టలు సరఫరా చేయాల్సి ఉంది. అలాగే 200పైగా హైడ్రాలిక్ ఆటోలను సమకూర్చి చెత్తను డీ గ్రేడింగ్ సెంటర్‌కు పంపి విద్యుదుత్పత్తి చేసేలా ప్రణాళిక రచిస్తున్నాం. ప్రజలు సహకరిస్తే ఏడాదిలోనే సికింద్రాబాద్‌ను ఆదర్శ నియోజకవర్గంగా తీర్చిదిద్దుతాన’ని కేసీఆర్ హామీ ఇచ్చారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement