మెదక్ ఎంపీకి కేసీఆర్ రాజీనామా
లేఖ అందించిన పార్టీ ఎంపీలు టీఆర్‌ఎస్ అధినేతతో ఫోన్‌లో మాట్లాడిన లోక్‌సభ సెక్రటరీ
మోడీ ప్రమాణస్వీకారానికి హాజరైన కేసీఆర్, టీఆర్‌ఎస్ ఎంపీలు
అద్వానీకి కేసీఆర్ అభివందనం..
నమస్కరించినా..చూసీచూడనట్టు వెళ్లిన కాంగ్రెస్ అధినేత్రి సోనియా
న్యూఢిల్లీ: మెదక్ లోక్‌సభ సీటుకు టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖర్‌రావు సోమవారం రాజీనామా చేశారు. ఈ మేరకు తన రాజీనామా లేఖను పార్టీ ఎంపీల ద్వారా లోక్‌సభ సెక్రటరీ జనరల్ టి.కె.విశ్వనాథన్‌కు పంపించారు. కొత్తప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీకి వచ్చిన కేసీఆర్ స్పీకర్ ఫార్మాట్‌లోనే రాజీనామా సమర్పిం చారు. ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో కేసీఆర్ మెదక్ పార్లమెంట్ స్థానం నుంచి 3 లక్షల పైచిలుకు మెజారిటీతో, గజ్వేల్ అసెంబ్లీ నుంచి 19వేల పైచిలుకు మెజారిటీతో గెలిచిన విషయం తెలిసిందే. టీఆర్‌ఎస్ శాసనసభాపక్ష నేతగా కేసీఆర్ ఇప్పటికే ఎన్నికయ్యారు. వచ్చే నెల 2వ తేదీన ఆయన తెలంగాణ ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయబోతున్నారు. అందుకే ఆయన గజ్వేల్ శాసనసభ్యునిగా కొనసాగుతూ, మెదక్ పార్లమెంట్ స్థానానికి రాజీనామా చేశారు. ‘మెదక్ లోక్‌సభ నుంచి ఎంపికైన నేను ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నాను. దీన్ని ఆమోదించాలని కోరుతున్నాను’ అని కేబినెట్ సెక్రటరీకి సమర్పించిన లేఖలో కేసీఆర్ పేర్కొన్నారు.
కేసీఆర్ సంతకంతో కూడిన లేఖను ఎంపీలు వినోద్‌కుమార్, కవిత,ఏపీ జితేందర్‌రెడ్డి, బాల్క సుమన్, బీబీ పటేల్, కడియం శ్రీహరి, నర్సయ్యగౌడ్, కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలు సోమవారం ఉదయం పార్లమెంట్‌కు వెళ్లి లోక్‌సభ కార్యదర్శికి అందజేశారు. అనంతరం టీకే విశ్వనాథన్ కేసీఆర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. రాజీనామా కారణాన్ని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపడుతున్న దృష్ట్యా పూర్తి అంగీకారంతో ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నట్టు కేసీఆర్ ఆయనకు వివరించారు. దీంతో ఆ లేఖను లోక్‌సభ సెక్రటరీ జనరల్ స్వీకరించి, దీనిపై తగు చర్యలు తీసుకుంటామని టీఆర్‌ఎస్ ఎంపీలకు తెలిపారు. కాగా, కేసీఆర్ రాజీనామాపై కొత్త స్పీకర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది.
ఎంపీలు, ఇతర నేతలతో కేసీఆర్ చర్చలు..
ఇదిలాఉండగా, మోడీ ప్రమాణ కార్యక్రమానికి హాజరయ్యేందుకు ముందుగా కేసీఆర్ తన అధికార నివాసంలో పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇతర నేతలతో భేటీ అయ్యారు. ఎంపీలు వినోద్, జితేందర్‌రెడ్డి, కడియంశ్రీహరి, బీబీ పాటిల్, ఎమ్మెల్యేలు జూపల్లి కృష్ణారావు, జగదీశ్వర్‌రెడ్డిలతో కేసీఆర్ వివిధ అంశాలపై చర్చించారు. అనంతరం ఢిల్లీ తెలంగాణ జేఏసీ అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ఇతర నేతలు కేసీఆర్ నివాసానికి వచ్చి ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కేసీఆర్, ఎంపీలతో కలసి మోడీ ప్రమాణస్వీకార కార్యక్రమానికి వెళ్లారు.
అద్వానీ, సోనియాలకు కేసీఆర్ వందనాలు..
ఇక మోడీ ప్రమాణానికి హాజరైన కేసీఆర్ బీజేపీ అగ్రనేత అద్వానీ, ఏఐసీసీ అధినేత్రి సోనియాగాంధీలకు ప్రత్యేక వందనాలు తెలిపారు. కేసీఆర్ కూర్చున్న ముందు వరుసలోనే అద్వానీ, సోనియాలు కూర్చున్నారు. ప్రమాణ స్వీకార ప్రాంగణంలోకి అద్వాని కంటే ముందుగానే వచ్చిన కేసీఆర్ ఆయన రాగానే లేచి నిలబడి నమస్కారం చేశారు. ఆయనతో కొద్దిసేపు మాట్లాడారు. ఈ సందర్భంగా అద్వానీ, కేసీఆర్‌లు పరస్పర శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఇక సోనియా వచ్చిన సమయంలోనూ కేసీఆర్ లేచి నిలబడి ఆమెకు వందనం చేశారు. అయితే ఆమె చూసీచూడనట్టుగా అందరికీ వందనాలు చేసుకుంటూ ముందుకు వెళ్లిపోయారు.