వారి బాటలోనే కేసీఆర్ సర్కార్
- ఆదివాసీల హక్కుల పరిరక్షణలో సర్కారు విఫలం
- సారాకు వ్యతిరేకంగా మహిళలు ఉద్యమించాలి
- పీవైఎల్ సభలో సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గత ప్రభుత్వాల బాటలోనే కేసీఆర్ సర్కార్ పయనిస్తోందని సామాజిక ఉద్యమకారుడు స్వామి అగ్నివేష్ అన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రజల కలలను సాకారం చేయాల్సిన బాధ్యత సీఎంపై ఉందన్నారు. 3 రోజులపాటు ఖమ్మంలో జరిగే పీవైఎల్ రాష్ట్ర మహాసభల్లో భాగంగా తొలిరోజు సోమవారం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక అన్ని వర్గాలకు మేలు జరుగుతుందని ఆశించారని, పేదలకు చేతినిండా పని, కడుపు నిండా భోజనం లభించని దుస్థితి ఉందన్నారు. కార్మికులకు కనీస వేతనం చెల్లించకపోవడం వారి చేత వెట్టి చాకిరీ చేయించుకున్నట్లే అవుతోందన్నారు.ప్రజా సమస్యల పరిష్కారానికి చేసే పోరాటాలకు తాను అండగా ఉంటానని తెలిపారు. ఆదివాసీల హక్కులను కాపాడటంలో ప్రభుత్వాలు విఫలమవుతున్నాయన్నారు. ప్రజల చేత ప్రభుత్వాలు బలవంతంగా తాగిస్తున్న సారాయికి వ్యతిరేకంగా మహిళలు మరో పోరాటం చేయాలని పిలుపునిచ్చారు.
కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం సైతం ప్రజల పక్షాన నిలవడం లేదని, కార్పొరేట్ శక్తుల అడుగులకు మడుగులొత్తేలా వ్యవహరిస్తోందని ఆరోపించారు. పోలవరం ఆదివాసీలను ముంచే ప్రాజెక్టని, దీనిపై ప్రభుత్వాలు పట్టుదలకు వెళ్తున్నాయి... తప్ప ఆదివాసీల మనుగడను పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. . బూటకపు ఎన్‌కౌంటర్లతో ఉద్యమకారులను మట్టుపెట్టే పరిస్థితి ఇంకా కొనసాగుతోందన్నారు.
సభలో తెలంగాణ జేఏసీ కో-చైర్మన్, విద్యావంతుల వేదిక రాష్ట్ర అధ్యక్షుడు మల్లేపల్లి లక్ష్మయ్య తెలంగాణ రాష్ట్రంలో 70 లక్షల మంది నిరుద్యోగులకు ప్రభుత్వం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలన్నారు. పీవైఎల్ రాష్ట్ర కన్వీనర్ ఎ.రాజేందర్ అధ్యక్షతన జరిగిన ఈ సభలో పీవోడబ్ల్యూ రాష్ట్ర అధ్యక్షురాలు సంధ్య, న్యూడెమోక్రసీ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వరరావు, పీవోడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పద్మ, బయ్యారం జెడ్పీటీసీ గౌని ఐలయ్య, పార్టీ జిల్లా కార్యదర్శి ముక్తార్‌పాషా, ఏఐకేఎంఎస్ రాష్ట్ర కార్యదర్శి మండలి వెంకన్న పాల్గొన్నారు.