మన‘సారా’ మద్యం బంద్ | Seed, farmers, power saving | Sakshi
Sakshi News home page

మన‘సారా’ మద్యం బంద్

Published Sat, Nov 15 2014 4:09 AM | Last Updated on Sat, Sep 2 2017 4:28 PM

మన‘సారా’ మద్యం బంద్

మన‘సారా’ మద్యం బంద్

 సారా, మద్యం మహిళల పాలిట మహమ్మారిలా దాపురించాయి. మద్యానికి బానిసైన భర్త బాధ్యతలు మరిస్తే కుటుంబ భారాన్ని భార్య తలకెత్తుకుంటోంది. తాగి తాగి మొగుడు అనారోగ్యం పాలై మరణిస్తే ఒంటరిగా సంసార సాగరాన్ని ఈదేందుకు ఇబ్బందులు పడుతోంది. మహిళల జీవితాలతో ఇంతలా చెలగాటమాడుతున్న మద్యం మహమ్మారిని మరెవరో వచ్చి తరిమేస్తే బావుండని చాలామంది అనుకుంటుంటారు. కానీ కొంతమంది మహిళలు మాత్రం గుండెల నిండా ధైర్యాన్ని నింపుకుని పిడికిళ్లు బిగించి సమర భేరీ మోగించారు. ‘సారా ప్రపంచాన్ని’ తరిమికొట్టారు. మహిళా లోకానికి ఆదర్శంగా నిలిచారు.
 

 కోరుట్ల/ఎల్లారెడ్డిపేట/చందుర్తి/కోనరావుపేట:చందుర్తి మండలం నర్సింగపూర్‌లో మద్యం, సారా అమ్మకాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. యువకులతో పాటు చాలామంది తాగుడుకు బానిసలవుతున్నారు. ఫలితంగా పచ్చని కాపురాల్లో చిచ్చురగులుతోంది. యువకులు అనారోగ్యాల బారినపడి ఆసుపత్రుల పాలువుతున్నారు. ఇటీవల కాలంలో గ్రామంలో వివాదాస్పద సంఘటనలు ఎక్కువయ్యాయి. నిత్యం గొడవలు.. పోలీసు కేసులు. వీటన్నింటికి మద్యం, సారాలే కారణమని గుర్తించిన స్వశక్తి సంఘాల మహిళలు.. వాటిని నిషేధించడమే మార్గమని తలచారు.

సోమవారం గ్రామంలోని 39 స్వశక్తి సంఘాల సభ్యులందరు పంచాయతీ కార్యాలయం వద్ద సమావేశమయ్యారు. గ్రామ పెద్దలను, పంచాయతీ పాలకవర్గాన్ని అక్కడికే పిలిచారు. గ్రామంలో సంపూర్ణ మద్యపాన నిషేధం అమలు చేయాలని తీర్మానించారు. వెంటనే బెల్టుషాపుల నిర్వాహకులను, గుడుంబా అమ్మకందారులను పిలిచి దుకాణాలు ఎత్తివేయాలని హెచ్చరించారు. తమ సంకల్పానికి సహకరించాలని కోరుతూ ఎక్సైజ్, పోలీసు అధికారులకు వినతిపత్రాలు సమర్పించారు. అధికారులు శభాష్ అంటూ అభినందించారు. ఫలితంగా ఐదు రోజులు గా గ్రామంలో బెల్ట్‌షాపులు, గుడుంబా కేంద్రాలు మూతబడ్డాయి. మొన్నటిదాకా అల్లకల్లోలంగా ఉన్న గ్రామంలో నేడు ప్రశాంత వాతావరణం నెలకొంది.

  అది కోరుట్ల పట్టణ శివారులోని అల్లమయ్యగుట్ట కాలనీ. రోజువారి కూలీచేసి పొట్టపోసుకునే కుటుం బాలే అన్నీ. ఆ కాలనీలో పొద్దస్తమానం కష్టపడి అలసిపోయే వారి బలహీనతలను ఆసరాగా చేసుకుని సారా అమ్మకందారులు తిష్ట వేశారు. వ్యసనానికి బానిసలైన పురుషులు, కొంతమంది మహిళలు పనులు వదిలేసి తాగుడే లోకంగా జీవిస్తున్నారు. ఫలితంగా తరచూ అనారోగ్యం పాలవుతున్నారు.

ఇక్కడ కూడా నిత్యం గొడవలు, కొట్లాటలు. ఈ పరిస్థితులను చూసి చలిం చిన ఆ కాలనీలోని ఇంద్ర మహిళా సంఘం సారా అమ్మకాలపై తిరగబడింది. కాలనీ పెద్ద మనుషులతో మాట్లాడి అందరితో కలిసి సారా అమ్మకం కేంద్రాలపై మహిళలు దాడులు చేశారు. సారా, గుడుంబా ప్యాకెట్లను ధ్వంసం చేశారు. సారా అమ్మకాలు నిరోధించాలని ఎక్సైజ్, పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.

అంతటితో కాలనీలో దాదాపుగా సారా అమ్మకాలు ఆగిపోయాయి. ఈ సారా వ్యతిరేక ఉద్యమానికి ముందుకొచ్చింది.. నిరక్షరాస్యురాలైన మహిళ బాజ పోశమ్మ. ఆమెతో పాటు ముందుకు కదలారు ఆ కాలనీ మహిళలు. మొత్తం మీద కాలనీలో సారా అమ్మకాలను బంద్ చేయించి తమ సత్తా చాటారు.

  కోనరావుపేట మండలం మామిడిపల్లి, వెంకట్రావుపేట, మల్కపేట గ్రామాల్లో మద్యం, సారా జోరుగా సాగేవి. ఈ గ్రామాల్లో కూడా అదే పరిస్థితు లు ఉండేవి. గ్రామాల్లో ప్రశాంతత నెలకొల్పేందుకు సంపూర్ణ మద్య నిషేధాన్ని విధిస్తున్నట్లు మహిళా సం ఘాలు తీర్మానించాయి. స్థానిక ప్రజాప్రతినిధులతో, ప్రజలతో చర్చించి మద్య నిషేధాన్ని అమలు చేస్తేనే ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకుంటాయని వివరిం చారు.

అందుకు అందరినీ ఒప్పించి ‘మద్యం, సారా అమ్మం, తాగం’ అని ఒట్టేయించారు. మద్యాన్ని అమ్మినా, తాగినా జరిమానా విధించడంతో పాటు జాడ చెబితే నజరానా చెల్లిస్తామని మహిళా సంఘాలు డప్పు చాటింపు చేయించాయి. తమ గ్రామాల్లో మద్య నిషేదాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు పోలీసులు, ఎక్సైజ్ అధికారులు, ప్రజాప్రతినిధుల సహకారం కోరారు. అంతా కలిసి మద్యం మహమ్మారిని పారద్రోలారు. ఇంతకుముందు లాగా ఇప్పుడు ఆ గ్రామాల్లో గొడవలు లేవు. గతంలో సారాతో కూలిన కుటుంబాలు మళ్లీ నిలబడుతున్నాయి.

  ఎల్లారెడ్డిపేట మండలం నారాయణపూర్, దుమా ల, రాచర్లతిమ్మాపూర్, పదిర గిరిజన గ్రామాలు మద్యం మహమ్మారి, సారా రక్కసి కాటు చవిచూశా యి. ఈ గ్రామాల్లో రెక్కాడితే గానీ డొక్కాడని కుటుంబాలే అన్నీ. భార్యాభర్తలిద్దరు కూలీకి వెళ్తేనే పొట్టగడిచేది. పురుషులు తాము సంపాదించిన డబ్బులను సాయంత్రం కాగానే తాగుడుకు తగలేస్తున్నారు. ఎదుగుతున్న పిల్లలు.. తడిసిమోపడవుతున్న ఖర్చులతో కుటుంబ పోషణ భారం మహిళలపై పడింది. చాలీచాలని తమ రెక్కల కష్టంతో సంసారాన్ని నెట్టుకు రాలేని పరిస్థితి.

ఇది చాలదన్నట్టు తాగొచ్చిన భర్త చేతిలో తన్నులు అదనం. వెరసి అతివల వేదన అంతా ఇంతా కాదు. గ్రామాల్లో అధికారుల కనుసన్నల్లో బెల్టుషాపులు వెలిసి కుటుంబాలు చిన్నాభిన్నమవుతున్న క్రమంలో నలిగిపోతున్న మహిళల పరిస్థితులకు చలించిపోయిన మహిళా సంఘాలు, యువజన సంఘాలు మద్యం అమ్మకాలపై కన్నెర్ర చేశాయి. సారా, మద్యం అమ్మకాలపై సమరం సాగించడంతో పాటు అమ్మితే జరిమానా, పట్టిస్తే నజరానా అంటూ కొత్త నినాదాన్ని ఎత్తుకొని ఎందరికో ఆదర్శంగా నిలుస్తున్నారు. అలా నారాయణపూర్, దుమాల, రాచర్ల తిమ్మాపూర్, పదిర గ్రామాల్లో ప్రజల సమష్టి నిర్ణయంతో మద్య నిషేధం అమలవుతోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement