మీరూ..మారాలి
*పద్ధతి మార్చుకోవాలని మంత్రులకు సీఎం కేసీఆర్ హితవు
*పది నెలల పాలనపై క్యాంప్ ఆఫీస్‌లో సుదీర్ఘ సమీక్ష
*ఏడున్నర గంటల పాటు పలు అంశాలపై చర్చ
*పనితీరును మెరుగుపరచుకోవాలని మంత్రివర్గానికి దిశానిర్దేశం
*మంత్రులందరితోనూ ముఖాముఖి, కొందరి పనితీరుపై అసంతృప్తి
*ప్రజా స్పందననే గీటురాయిగా తీసుకోవాలని సూచన
* అవినీతి ఆరోపణలను సహించబోనని హెచ్చరిక
* నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను, అధికారులను కలుపుకొని వెళ్లండి
* రాబోయే ఎన్నికల్లో గెలుపు బాధ్యత మంత్రులదేనన్న ముఖ్యమంత్రి
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వానికి, ప్రజల మధ్య అంతరాన్ని తగ్గించేందుకు మంత్రులు కృషి చేయాల్సి ఉందని, లేదంటే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు తన సహచరులను హెచ్చరించారు. ‘అధికారంలోకి వచ్చి పదినెలలు పూర్తయింది. మరో రెండు నెలలు గడిస్తే ఏడాదవుతుంది. అయినా, కొందరు మంత్రులకు ఇప్పటికీ పాలనపై అవగాహన లేదు. సొంత విభాగాలపై కూడా పట్టు సాధించలేకపోయారు. మంత్రుల్లో ఒకరిద్దరు మినహా ఎవరూ దూకుడుగా వ్యవహరించడం లేదు. జిల్లాల్లో కొందరు మంత్రులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అలాంటి వారు తమ పద్ధతి మార్చుకోవాలి. నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేలను కలుపుకొనిపోవాలి. మంత్రులందరూ తమ పనితీరును మెరుగుపరుచుకోవాలి’ అని మంత్రులందరికీ కేసీఆర్ దిశానిర్దేశం చేశారు.
రాష్ర్టంలో అధికారపగ్గాలు చేపట్టి పది నెలలు పూర్తయిన సందర్భంగా ప్రభుత్వ పాలన, ప్రజల స్పందనపై మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులతో గురువారం క్యాంప్ కార్యాలయంలో సీఎం సమీక్షించారు. దాదాపు ఏడున్నర గంటల పాటు సుదీర్ఘంగా ఈ సమావేశం జరిగింది. పథకాల అమలు, అవి ప్రజలకు అందుతున్న తీరు, పార్టీ సంస్థాగత వ్యవహా రాలు, ఎమ్మెల్సీ ఎన్నికల ఫలితాలు, రానున్న ఎమ్మెల్సీ, జీహెచ్‌ఎంసీ, గ్రేటర్ వరంగల్ ఎన్నికలు, మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శుల మధ్య సయోధ్య లేకపోవడం, అధికారులతో సమన్వయ లోపం తదితర అంశాలపై కేసీఆర్ చర్చించారు. విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు మంత్రులతో ఆయన విడివిడిగా మాట్లాడారు. పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో విఫలమయ్యామని, ప్రజా స్పందనే గీటురాయిగా పనితీరును మార్చుకోవాలని వారికి సూచించినట్లు తెలిసింది. మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శుల మధ్య సమన్వయ లోపం ఉందని, దీన్ని సరిదిద్దుకుని పనిచేయాలని హితవు పలికారు. మంత్రుల పనితీరుకు సంబంధించి తన వద్ద ఉన్న నివేదికల ఆధారంగా ఒక్కొక్కరితో ముఖాముఖి చర్చించారు. మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శుల మధ్య పని విభజన, వారి విధివిధానాలు, వేతనాలు తదితర అంశాలు చర్చకు వచ్చినట్లు సమాచారం. ఇరువురూ సఖ్యతగా ఉండాల్సిన అవసరాన్ని సీఎం నొక్కి చెప్పారు. అవినీతి రహిత పాలనకు తాను ప్రాధాన్యమిస్తున్నానని, మంత్రులపై ఎట్టి పరిస్థితుల్లో అవినీతి ఆరోపణలు రావొద్దని, అవినీతిని ఉపేక్షించనని ెహ చ్చరించారు. విపక్షాలు లేనిపోని ఆరోపణలు చేస్తే ఊరుకోవద్దని, అయినా ఎవరేంటో తనకు తెలుసునని వ్యాఖ్యానించినట్లు తెలిసింది.
పథకాలపై దృష్టి పెట్టండి
పథకాలను ప్రజల్లోకి తీసుకువెళ్లడానికి మం త్రులు బాధ్యత తీసుకోవాలని సీఎం సూచిం చారు. ఈ నెలలో జరిగే టీఆర్‌ఎస్ ప్లీనరీలో మరికొన్ని పథకాలను ప్రకటించడమే కాక, ఇప్పటిదాకా ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలను, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల కు వివరించనున్నట్లు పేర్కొన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న మిషన్ కాకతీయ పనులపై శ్రద్ధ తీసుకోవాలని, ఈ నెలన్నర రోజుల్లో అత్యధిక పనులు పూర్తి చేస్తే మంచి పేరు వస్తుందని సూచించారు. వాటర్‌గ్రిడ్ కార్యక్రమాన్ని సవాలుగా తీసుకోవాలని, ఈ పథకం కోసం చేస్తున్న భూసేకరణ విషయంలో రైతులను ఒప్పించే బాధ్యతను స్థానిక ప్రజాప్రతినిధులు, ఎమ్మెల్యేలు, మంత్రులు తీసుకోవాలని పేర్కొన్నారు.
ఓటమి పునరావృతం కావద్దు
శాసనమండలి పట్టభద్రుల నియోజవకర్గ ఎన్నికల్లో మిశ్రమ ఫలితాలను సీఎం ప్రస్తావించారు. మహబూబ్‌నగర్-రంగారెడ్డి- హైదరాబాద్ నియోజకవర్గంలో ఎదురైన ఓటమి భవిష్యత్తులో పునరావృతం కావద్దని పేర్కొన్నారు. ఈ మూడు జిల్లాల మంత్రులతో కలిసి ఎమ్మెల్సీ ఎన్నిక ఫలితాలను విశ్లేషించారు. స్థానిక సంస్థల కోటాలోని 12 ఎమ్మెల్సీ స్థానాలకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో విజయం సాధించాలని, అన్నింట్లోనూ గెలుపొందేలా ఆయా జిల్లాల మంత్రులే పూర్తి బాధ్యత వహించాలని సీఎం పేర్కొన్నట్లు సమాచారం. అలాగే జీహెచ్‌ఎంసీ, వరంగల్ గ్రేటర్ కార్పొరేషన్ ఎన్నికల్లోనూ విజయం సాధించేలా కేడర్‌ను బలోపేతం చేయాలని సూచించారు. వచ్చే డిసెంబర్‌లో ఎన్నికలు జరిగే అవకాశముందని, ఇప్పటి నుంచే పార్టీ శ్రేణులను సమాయత్తపరచాలని నిర్దేశించారు.
ప్లీనరీలోగా కమిటీల ఎంపిక
ఈనెల 24న పార్టీ ప్లీనరీ నిర్వహిస్తున్నందున ఆలోగా సంస్థాగత ఎన్నికలను పూర్తి చేసుకోవాలని కేసీఆర్ సూచించారు. సభ్యత్వ నమోదు విషయంలో బాగా పనిచేశారని మంత్రులను అభినందించారు. గ్రామ శాఖలు మొదలు మండల, మున్సిపల్, జిల్లా శాఖల ఎన్నికల్లో మంత్రులు జాగ్రత్తలు తీసుకోవాలని, పార్టీ కోసం పనిచేసిన వారికే కమిటీల్లో అవకాశం కల్పించాలని సూచించారు. ప్లీనరీ వేదికగా ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకువెళదామని పేర్కొన్నారు. అనారోగ్య కారణాల వల్ల మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఈ సమావేశానికి హాజరు కాలేకపోయారు.