ఖమ్మంలో కేరళ ఎక్స్‌ప్రెస్ ఆపండి
- మధిరలో ఎక్స్‌ప్రెస్ రైళ్లకు హాల్ట్ ఇవ్వండి
- రైల్వేమంత్రికి ఎంపీ పొంగులేటి వినతిపత్రం
సాక్షి, న్యూఢిల్లీ: ఖమ్మంలో కేరళ ఎక్స్‌ప్రెస్ ఆగేలా చర్యలు తీసుకోవాలని ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాస రెడ్డి కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేశ్ ప్రభును కోరారు. సోమవారం ఇక్కడ రైల్వేభవన్‌లో వైఎస్సార్‌సీపీ ప్రతినిధి బృందం రైల్వే మంత్రిని కలిసిన సందర్భంలో ఖమ్మం జిల్లాకు సంబంధించి పలు అంశాలను పొంగులేటి రైల్వే మంత్రి దృష్టికి తీసుకెళ్లారు.
శబరిమలకు వెళ్లే అయ్యప్ప భక్తుల నుంచి చాలా కాలంగా ఈ డిమాండ్ ఉందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటికే చాలాసార్లు ఈ అంశంపై విన్నవించామని, త్వరితగతిన దీనిపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. పాల్వంచ మండలం పాండురంగాపురంలోని రైల్వే స్టేషన్ గ్రామానికి 13 కి.మీ. దూరంలో అడవుల్లో ఉందని, దీనిని గ్రామానికి అందుబాటులో ఏర్పాటు చేయాలని కోరారు.
అలాగే ఖమ్మంలో కేరళ ఎక్స్‌ప్రెస్‌తో పాటు పద్మావతి ఎక్స్‌ప్రెస్, స్వర్ణ జయంతి ఎక్స్‌ప్రెస్‌ను, మధిరలో నవజీవన్ ఎక్స్‌ప్రెస్, లక్నో ఎక్స్‌ప్రెస్, హౌరా ఎక్స్‌ప్రెస్ రైళ్లను ఆపాలని విన్నవించారు. ఎర్రుపాలెంలో శాతవాహన ఎక్స్‌ప్రెస్‌ను ఆపాలని కోరారు.