సాక్షి సిటీబ్యూరో: కిరోసిన్ ఫ్యానా..అదేంటి.. అనుకుంటున్నారా.. అవునండీ.. సిటీలో ఇంకా కిరోసిన్‌ఫ్యాన్లు ఇంకా కొందరు ఉపయోగిస్తున్నారు. నిజాం కాలం నాటి పురాతన ఫ్యాన్లు పాతబస్తీలో అక్కడక్కడా వాడుతున్నారు. ఫ్యాన్ కనుగొన్న తొలినాళ్లలో విద్యుత్‌తో కాకుండా వేడితో తిరిగేలా చేసేవారు. మరో విషయమేమంటే.. ఇప్పటికీ ఇలాంటి ఫ్యాన్లను రిపేరు చేసేవారు కూడా ఉన్నారు.
విదేశాలనుంచి దిగుమతి...
నిజాం పాలనలో నగరానికి వివిధ దేశాలనుంచి టెక్నాలజీ దిగుమతి అయ్యేది. ముఖ్యంగా ఇళ్లలో వినియోగించే ఫ్యాన్లు, విద్యుత్తు పరికరాలు, వాహనాలు, షాండిలియర్స్, రిఫ్రీజిరేటర్లు తదితర వస్తువులు తయారైంది ఆలస్యం సిటీకి వచ్చేవి. అలా కిరోసిన్ ఫ్యాన్ కూడా ఇంగ్లండ్ నుంచి వచ్చింది. పాతబస్తీలోని పురానీహవేలీ నివాసి మహ్మద్ హనీఫ్ ఇల్యాస్ బాబా ఇంట్లో కిరోసిన్ ఫ్యాన్ ఇంకా పనిచేస్తోంది.
డిజైన్ డిఫరెంట్..
దీనిని 1800లో ఇంగ్లాండ్‌లో కనుగొన్నారు. ఫ్యాన్ కింది బాగం గుండ్రంగా ఉంటుంది. ఇందులో కిరోసిన్ వేస్తారు. ఓ చివర దీపం వెలిగిస్తారు. దీపం నుంచి పైపుల ద్వారా వేడి పైకి వెళుతుంది.దీని రూపకల్పనలో నీరు, సల్ఫ్యూరిక్ ఆమ్లం ఉపయోగించారు. కింద వెనుక బాగంలో కాస్త పైప్ ఉంటుంది. ఇందులో వేడితో పాటు గ్యాస్ ప్రవేశిస్తుంది. దీంతో ఆవిరితో ఫ్యాన్ తిరగడం ప్రారంభమవుతుంది. ఎంత వేడి పెంచితే అంత వేగంగా రెక్కలు తిరుగుతాయి.
నగరంలోనే అరుదుగా..
1980 వరకు పాతబస్తీలోని పలు ఇళ్లలో వినియోగించే వారు. విద్యుత్తుతో నడిచే ఫ్యాన్లు మార్కెట్‌లో వచ్చాక దీనిగురించి ఆలోచించడం మానేశారు. పలు ఇళ్లల్లో పదేళ్ల క్రితం వరకు వినియోగించారని పురానీ హవేలీ నివాసి ముజాహిద్ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment