
నా నటనతో అందరికీ కిక్కెక్కిస్తా
సినీ నటుడు, కమెడియన్ తాగుబోతు రమేష్
పాల్వంచ: తన నటనతో ప్రేక్షకులందరికీ కిక్కెస్తానని సినీ నటుడు, కమెడియన్ తాగుబోతు రమేష్ అన్నారు. పాల్వంచలోని కేఎల్‌ఆర్ ఫార్మసీ కళాశాలలో సోమవారం ఫేర్‌వెల్ నైట్ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆయన విలేకరులతో మాట్లాడారు. పూర్తి వివరాలు ఆయన మాటల్లోనే...‘‘మాది కరీంనగర్ జిల్లా గోదావరిఖని. మా నాన్న గారు సింగరేణి ఉద్యోగి. చదువులో అంతగా రాణించలేకపోయా. మొదటి నుంచి మిమిక్రీ అంటే ఇష్టం. ప్రాక్టీస్ చేసి ప్రదర్శనలు ఇచ్చేవాడిని.
ఎలాగైనా సినిమాల్లో నటించాలన్న పట్టుదలతో 2006లో హైదరాబాద్ వెళ్లా. మొదటిసారి ‘జగడం’ సినిమాలో, ఆ తర్వాత ‘మహాత్మ’లో నటించా. ఈ రెండు సినిమాల్లో నా నటనకు మంచి పేరు వచ్చింది. ఇప్పటివరకు వంద సినిమాల్లో నటించా. ప్రస్తుతం కమెడియన్ పాత్రల్లో మూస దోరణి ఎక్కువగా ఉంటోంది.
కొత్తగా ఏదైనా చేయాలని తపనతో ఉన్నా. ఎంతమంది కమెడియ న్లు ఉన్నప్పటికీ.. ‘తాగుబోతు రమేష్’ అంటే ప్రత్యేకమైన క్రేజ్ లభించడం సంతోషంగా ఉంది. నేను నటించిన సినిమాల దర్శకుల సహకారాన్ని మరువలేను. నటనలో నన్ను నందినీరెడ్డి, రాజమౌళి, శ్రీను వైట్ల ఎంతగానో ఎంకరేజ్ చేశారు. సినీ ఇండస్ట్రీలో నిలదొక్కుకుని విజయాలు సాధించడమన్నది ఒక్క శాతం మాత్రమే. నటన ద్వారా అభిమానుల్లో స్థిరమైన స్థానాన్ని సంపాదిస్తే వంద శాతం సక్సెస్ అయినట్టే. తోటి కమెడియన్ ధనరాజ్‌తో కలిసి ‘ఏకే రావు.. పీకే రావు’ సినిమాలో హీరోగా నటించా. నా అభిమాన కమెడియన్లు.. హిందీలో కెస్టో ముఖర్జీ. తెలుగులో ఎంఎస్.నారాయణ. వారిలాగా పేరు సంపాదించుకోవాలని ఉంది.