
సతీమణి విజయలక్ష్మీ కూతురు ప్రేరణదేవితో కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు
ఆయన జిల్లాకు బాస్. ప్రతిరోజు అధికారిక విధుల్లో బిజిబిజీగా గడుపుతుంటారు. అయినా ఇంటికొచ్చాక మాత్రం ముద్దుల కూతురుతో కాసేపు గడపనిదే నిద్రపోరు. రోజువారీ కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడిపే జీవితం నుంచి కాసేపు అలా కుటుంబంతో సేద తీరుతారు. ఎప్పుడూ సాదాసీదా వ్యక్తిలా కనిపించే ఆయన.. నిత్యం వివిధ శాఖల అధికారులకు పాలనపరంగా ఆదేశిలిస్తుంటారు. పాలనలో తనదైన ముద్ర వేస్తున్న ఆయనే కుమురం భీం జిల్లా కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు. రోజంతా జిల్లా అధి కారులతో సమీక్షలు, సమావేశాలు, పర్యటనలతో బిజిబిజీగా ఉం డే ఆయనను ‘సాక్షి పర్సనల్ టైం’ లో కాసేపు గడిపి ఆయ న వ్యక్తిగత విషయాలను పంచుకున్నారు. వివరాలు ఆయన మాటల్లోనే..
సాక్షి, ఆసిఫాబాద్ : మాది శ్రీకాకుళం జిల్లా కాశిబుగ్గ. అమ్మ వనజాక్షి స్కూల్ టీచర్. నాన్న క్రిష్ణారావు రిటైర్డ్ అసిస్టెంట్ బీసీ వెల్ఫేర్ అధికారి. మా సోదరి రజని. ప్రస్తుతం యూఎస్‌లో న్యూరాలజీ చేస్తున్నారు. నా విద్యాభాస్యం విషయానికి వస్తే పొలాకిలో ఎనిమిదో తరగతి వరకు, పలాసలో ఇంటర్మీడియెట్, వైజాగ్ ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ (కంప్యూటర్ సైన్స్) పూర్తిచేశా. క్యాంపస్ ఇంటరŠూయ్వలో ఉద్యోగం వచ్చినా చేరకుండా.. సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమయ్యాను.
అలా మొదటిసారి 2010లో ఐఆర్‌టీఎస్‌కు ఎంపికయ్యా. 2012లో ఐఏఎస్‌కు ఎంపికయ్యా. ఇంట్లో అమ్మనాన్నలిద్దరూ కూడా విద్యావంతులే. ఉద్యోగస్తులు కావడంతో చిన్నప్పటి నుంచి నాకు అన్నింటా ప్రోత్సాహాం ఉండేది. నాకు ఇష్టమైన రంగంలో రాణించేందుకు నన్ను ఎంతో ప్రోత్సహించారు. ఇక నాపేరు విషయానికి వస్తే మా తాతకు గాంధీ కుంటుంబంపై అభిమానం ఎక్కువ. అందుకే నాకు రాజీవ్‌గాంధీ అని పేరు పెట్టారు. హన్మంతు మా ఇంటి పేరు.
విజయలక్ష్మీతో వివాహం..
నేను ఐఆర్‌టీఎస్‌కు ఎంపికైన మరుసటి ఏడాది 2011లో విజయలక్ష్మీతో నా వివాహం జరిగింది. మాది పెద్దలు కుదిర్చిన పెళ్లి. తను ఎల్‌ఎల్‌బీ పూర్తిచేశారు. ఆమెకు దైవభక్తి ఎక్కువ. మా కూతురు ప్రేరణదేవి. ప్రస్తుతం ఫస్ట్‌క్లాస్ చదువుతోంది. అధికారిక విధుల్లో రోజులో ఎక్కువ టైం గడిచిపోతోంది. మా పాపతో ఎక్కువగా గడపలేకపోతుంటాను. ఈ లోటును మా ఆవిడ భర్తీ చేస్తారు. మా కూతురు పెంపకం బాధ్యత మొత్తం ఆమె చూసుకుంటారు.
కాసేపు మా పాపతో..
నిత్యం విధి నిర్వహణలో బిజిబిజీగా రోజంతా గడిచిపోతోంది. ఇంటికి వెళ్లాక మాత్రం కాసేపు తప్పకుండా మాపాప ప్రేరణతో గడుపుతుంటాను. దీంతో పనిఒత్తిడి నుంచి కాస్తా రిలాక్స్‌గా అనిపిస్తుంది.
బుక్స్ చదువుతా..
ఐఏఎస్ ట్రైనింగ్‌లో ఉన్నప్పుడు బ్యాడ్మింటన్ బాగే ఆడేవాడిని. కొత్తగూడెం కలెక్టర్‌గా ఉన్నప్పు డు కూడా తీరిక సమయంలో ఆడేవాడిని. ఇక్కడ బ్యాడ్మింటన్ కోర్టు లేకపోవడంతో కుదరడం లేదు. తీరిక సమయాల్లో పుస్తకాలు చదువుతా.
చేపలు, రొయ్యలు ఇష్టంగా తింటా.
చిన్నప్పటి నుంచి కోస్తా తీరంలోని సముద్ర తీరం ప్రాంతంలో పెరగడంతో సీ ఫుడ్ బాగా అలవాటు అయింది. నాన్‌వెజ్‌లో చేపలు, రొయ్యలు ఇష్టంగా తింటా.
అక్క నా మార్గదర్శి..
చిన్నప్పటి నుంచి మా అక్క రజని అంటే నాకు ఎంతో ఇష్టం. నాకు అన్ని విషయాల్లో మార్గదర్శంగా ఉండేది. వైజాగ్‌లో నేను ఆంధ్రా యూనివర్సిటీలో బీటెక్ చేస్తున్న సమయంలో తను అదే యూనివర్సిటీలో ఎంబీబీఎస్ చేసేది. నా సివిల్స్ ప్రిపరేషన్ సమయంలోనూ ఎంతగానో తోడ్పాటునందించింది. అయితే ప్రస్తుతం ఆమె యూఎస్‌లో ఉంటుంది. అక్క మాకు దూరంగా ఉంటుందనే బెంగ ఉంటుంది.
పీహెచ్‌డీ చేయాలి...
నేను బీటెక్ వరకే చదివి సివిల్స్‌కు ఎంపికవడంతో అక్కడికే నా చదువు ఆగిపోయింది.
ఐఏఎస్‌లకు విదేశాల్లో చదువుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి అవకాశం వస్తే విదేశాల్లో ఉన్నత చదువులు చదివి పీహెచ్‌డీ పూర్తి చేయాలని ఉంది.
ఆ రెండు సంతృప్తినిచ్చాయి..
నేను భద్రాద్రి కొత్తగూడెంలో కలెక్టర్‌గా విధులు నిర్వహిస్తున్న సమయంలో ప్రతిష్టాత్మక సీతారామ ప్రాజెక్టు (దుమ్ముగూడెం ఎత్తిపోతల పథకం) భూ సేకరణ విజయవంతంగా పూర్తి చేశాను. అది నాకు ఎంతోగానో సంతృప్తినిచ్చింది. అంతకు ముందు అసిస్టెంట్ కలెక్టర్‌గా ఉన్నప్పుడు వరంగల్‌లో ఆడపిల్లల అమ్మకంపై మీడియాలో వచ్చిన ఆ కేసును నేనే డీల్ చేశా. ఆ ఆసుపత్రిని సీజ్ చేశా. కారకులను పట్టుకుని శిక్షించాం.
ఇక్కడి వాతావరణం నచ్చింది..
ఇక్కడి వాతావరణం నాకు బాగా నచ్చింది. చిన్నప్పటి నుంచి గ్రామీణ ప్రాంతాల్లో పెరిగినందున నాకు పెద్దపెద్ద మెట్రో నగరాల కంటే భద్రాచలం, ఆసిఫాబాద్ లాంటి ప్రాంతాలంటేనే ఇష్టం. ఇక్కడ విధులు నిర్వహించడం నాకో ఎంతో సంతృప్తినిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment