
కామారెడ్డిపల్లిలో హనుమాన్ దేవాలయం
సాక్షి,పరకాల రూరల్: వరంగల్ ఉమ్మడి జిల్లా నుంచి తొలి మహిళా మంత్రిగా పనిచేసిన కొండా సురేఖకు పరకాల మండలం కామారెడ్డిపల్లిలోని హనుమాన్ దేవాలయం నమ్మకంగా మారింది. కామారెడ్డిపల్లిలోని హనుమాన్ దేవాలయం నుంచే కొండా సురేఖ ప్రతి ఎన్నికల సందర్భంగా తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభిస్తారు. 1999లో అప్పటి శాయంపేట నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా పోటీచేసిన సురేఖ ఈ ఆలయం నుంచే తన ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి దేవు సాంబయ్యపై గెలుపొందారు. 2004లో జరిగిన ఎన్నికల ప్రచారాన్ని ఈ ఆలయం నుంచే ప్రారంభించారు. ఆ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డిపై 50వేల మెజార్టీని సాధించి రికార్డు సృష్టించారు.
నియోజకవర్గాల పునర్విభజన అనంతరం పరకాల నియోజకవర్గం నుంచి 2009లో సురేఖ పోటీచేశారు. ఆ ఎన్నికల్లో కూడా ఇదే దేవాలయంలో పూజలు చేసి ఎన్నికల శంఖారావాన్ని పూరించారు. ఆ ఫలితాల్లో సురేఖ 13వేల మెజార్టీతో గెలుపొందారు. అనంతరం 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో సురేఖ ఇక్కడి దేవాలయంలో పూజలతో ప్రచారం ప్రారంభించారు. అనంతరం 2014లో పరకాల నుంచి వరంగల్ తూర్పు నియోజకవర్గానికి మారిన సురేఖ ప్రస్తుత ఎన్నికల్లో పరకాల నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో ఉన్నారు. ప్రస్తుతం కామారెడ్డిపల్లిలోని హనుమాన్ దేవాలయం నుంచి ప్రచారాన్ని ప్రారంభించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. కొండా సురేఖకు కామారెడ్డిపల్లి హనుమాన్ దేవాలయం నుంచి ప్రచారాన్ని ప్రారంభించడం కొండంత సెంటిమెంట్‌గా మారింది.
Comments
Please login to add a commentAdd a comment