జిల్లాలో విలువైన వృక్షసంపద గొడ్డలివేటుకు నేలకొరుగుతోంది. అక్రమార్కులు పెద్దపెద్ద వృక్షాలను కొట్టేసి రాత్రిరాత్రే సరిహద్దులను దాటిస్తున్నారు. ఓ వైపు రాష్ట్ర ప్రభుత్వం అడవులను పెంచేందుకు హరితహారం పేరిట మొక్కలునాటే కార్యక్రమానికి శ్రీకారం చుడుతుండగా మరోవైపు అటవీశాఖ అధికారుల చేతివాటంతో చెట్లు తరిగిపోతున్నాయి.
సాక్షి, మహబూబ్‌నగర్:
జిల్లాలో కలప అక్రమవ్యాపారం కొద్దిరోజులుగా మూడుపూలు, ఆరుకాయలుగా సాగుతోంది. అడవులు చాటుమాటున నరికివేతకు గురవుతున్నాయి. రాష్ట్రంలోనే పెద్దజిల్లాగా 18,432 చదరపు కిలోమీటర్ల మేర జిల్లా విస్తీర్ణం ఉంది. కానీ అడవులు మాత్రం తక్కువ విస్తీర్ణంలో ఉన్నాయి. కేవలం 2,55,596 హెక్టార్లలో మాత్రమే విస్తరించి ఉన్నాయి. రాష్ట్రవ్యాప్తంగా సరాసరిగా 18శాతం అడవులు ఉండగా, జిల్లాలో మాత్రం కేవలం నాలుగు శాతం మాత్రమే ఉన్నాయి.
దీంతో జిల్లాలో ఆశించినస్థాయిలో వర్షాలు కురియక దుర్భిక్ష పరిస్థితులు నెలకొంటున్నాయి. జిల్లాలో 200 వరకు చిట్టడవులు, ఇతర వనాలు విస్తరించి ఉన్నాయి. కానుగ, చింత, చిరుమణి, వేప, తుమ్మ, నెమలి, నీలగిరి, జిట్టెడు, నల్లమద్ది తదితర విలువైన వృక్షాలు ఉన్నాయి. వీటిని కొల్లగొట్టేందుకు అక్రమార్కులు పక్కాప్లాన్‌ను అనుసరిస్తున్నారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం ప్రాంతానికి చెందిన కొందరు బడా కలప వ్యాపారులు అటవీ సమీపప్రాంత గిరిజనులతో మాటామంతి కలుపుతున్నారు.
వారితో సత్సంబంధాలు ఏర్పరుచుకుని మాయమాటలు చెప్పి వారి అండతోనే చెట్లను నరికివేస్తున్నారు. కలప రవాణాపై అనుమానం రాకుండా ఉండేందుకు అక్రమార్కులు పక్కాప్లాన్ వేస్తున్నారు. పట్టా భూముల్లోని కొంతకలపను కొనుగోలుచేసి వాటికి అనుగుణంగా సమీపంలో ఉన్న చెట్లను న రికివేస్తున్నారు. జిల్లాలోని బొంరాస్‌పేట, దౌల్తాబాద్, కోస్గి, కొడంగల్, అచ్చంపేట, కల్వకుర్తి తదితర ప్రాంతాల నుంచి నిత్యం వందలకొద్దీ లారీల కలపను తరలిస్తున్నారు. ఒక్కోలారీకి రూ.12- 15వేలు పలుకుతోంది. ఇలా తరలించిన కలపను కర్ణాటక, హైదరాబాద్‌లోని చంద్రాయణగుట్ట, కాటేదాన్ పరిసర ప్రాంతాల్లో ఉన్న టింబర్ డిపోలకు విక్రయిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రతిరోజూ వందలలారీల్లో విలువైన కలప జిల్లా సరిహద్దు దాటుతోంది.
అధికారుల అండదండలు
అటవీ సంపదను కాపాడాల్సిన అధికారులు చెట్లను అడ్డంగా నరికించి దొడ్డిదారిన వెళ్లేలా మార్గం చూపుతున్నారు. అక్రమార్కుల నోట్ల కట్టలతో అధికారులు నోళ్లు మూసుకుంటున్నట్లు విమర్శలు ఉన్నాయి. ప్రధానంగా కలప వ్యాపారులకు ఫారెస్టు, రెవెన్యూ, పోలీసుశాఖ అధికారుల ఆశీస్సులు మెండుగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. మూడు డిపార్టుమెం ట్లకు పెద్దఎత్తున మామూళ్లు అందుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. బొంరాస్‌పేట, దౌల్తాబాద్ ప్రాంతాల్లో అటవీశాఖ సిబ్బంది ఏకంగా మామూళ్ల కోసం రిజిస్టర్‌ను నిర్వహిస్తుందనే పరిస్థితి ఏ విధంగా ఉందో అర్థం చేసుకోవచ్చు.
జీఐఎస్ వినియోగిస్తే అడ్డుకట్ట
జీఐఎస్ (జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ సిస్టం) గూగుల్‌మ్యాప్ వంటి అధునాతన సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తే అక్రమాలకు అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది. జీఐఎస్ పరిజ్ఞానంతో అడవుల విస్తీర్ణం ఎంతమేర ఉందనే విషయాన్ని తెలుసుకోవచ్చు. ఇప్పటివరకు అడవుల సరిహద్దులు అలాగే ఉంటున్నా లోపల మాత్రం చెట్టు ఉండటంలేదు. బయట ఒకలా లోపల మరోలా ఉంటుంది. కనుక జీఐఎస్ పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొస్తే ఈ అక్రమవ్యాపారానికి అడ్డుకట్ట వేసే అవకాశం ఉంది.
హరితం.. ఖతం
Published Sun, Nov 23 2014 4:13 AM | Last Updated on Tue, Jun 4 2019 6:45 PM
Advertisement