‘టెక్స్‌టైల్’ అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ: కేటీఆర్
మేడ్చల్‌రూరల్: టెక్స్‌టైల్ రంగ అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకశ్రద్ధతో పలు విధానాలను అమలు చేయనున్నట్లు రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కె.తారక రామారావు(కేటీఆర్) అన్నారు. బుధవారం మేడ్చల్ మండలం గుండ్లపోచంపల్లిలోని అపరెల్ పార్క్‌లో జర్మనీ, ఇండియా భాగస్వామ్యంతో హెల్సియా, ఐకాన్ ఇండియా కంపెనీ నెలకొల్పిన షోల్డర్ ప్యాడ్‌ల పరిశ్రమను కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి మాట్లాడుతూ ప్రపంచంలో పత్తి ఉత్పత్తిలో దేశం మొదటి స్థానంలో ఉండగా గార్మెంట్ రంగంలో మాత్రం దీనస్థితిలో ఉందనిదేశ వస్త్రపరిశ్రమ వాటా కేవలం 3.87 శాతం ఉందని, బంగ్లాదేశ్ 10, చైనా 30 శాతం వాటా కలిగి ఉన్నాయని తెలిపారు. వ్యవసాయం తర్వాత వస్త్ర పరిశ్రమలో ఎక్కువ మందికి ఉపాధి కల్పించే అవకాశం ఉందని, వస్త్ర పరిశ్రమ పాధాన్యతను గుర్తించి రూ.12 వేల కోట్ల బడ్జెట్‌ను ఈ రంగానికి కేటాయించామన్నారు. త్వరలో మిషన్ మెగా టెక్స్‌టైల్ పేరుతో వరంగల్ జిల్లాలో అతిపెద్ద టెక్స్‌టైల్ పార్క్ ఏర్పాటుకు శ్రీకారం చుట్టనున్నట్లు మంత్రి తెలిపారు.
వస్త్ర ఉత్పత్తిలో దూసుకుపోయేలా కృషి
పత్తి ఉత్పత్తిని ప్రారంభించనప్పటి నుండి దుస్తులు తయారు చేసే వరకు అన్ని కంపెనీలు ఒకే పార్కులో ఏర్పాటు చేసి, అన్ని వసతులు, పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకువచ్చి వస్త్ర ఉత్పత్తిలో రాష్ట్రం దూసుకుపోయేలా ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. మారుతున్న ప్యాషన్‌కు అనుగుణం గా ముందుకు సాగాలని, అప్పుడే మార్కెట్ లో నిలువగలుగుతామని అన్నారు. గుండ్లపో చంపల్లిలోని అపరెల్ పార్క్‌లో 174 ఎకరాల స్థలం అందుబాటులో ఉండగా, ఇక్కడ ఏర్పాటు చేసిన వివిధ కంపెనీలలో 3 వేల మంది ఉపాధి పొందుతున్నారన్నారు. అనం తరం కార్మికులతో కేటీఆర్ మాట్లాడారు.