'వేదం' నాగయ్యకు కేటీఆర్ రూ.లక్ష సాయం
హైదరాబాద్ : 'వేదం' సినిమాలో సిరిసిల్ల రాములుగా నటించిన నటుడు నాగయ్య దీనస్థితిపై పంచాయతీ, ఐటీశాఖ మంత్ర కేటీఆర్ స్పందించారు. నాగయ్యను తన నివాసానికి పిలిపించి అతనికి రూ.లక్ష చెక్కును అందించారు. కళాకారుల వృద్ధాప్య పింఛన్ కింద నెలకు నాగయ్యకు రూ.1500 అందిస్తామని కేటీఆర్ ఈ సందర్భంగా తెలిపారు. భవిష్యత్లో నాగయ్యకు ఇల్లు కూడా మంజూరు చేస్తామని ఆయన చెప్పారు. ప్రాంతమేదైనా వృద్ధ కళాకారులను ఆదుకుంటామని కేటీఆర్ తెలిపారు.
దర్శకుడు క్రిష్ దర్శకత్వం వహించిన వేదం చిత్రంలో రాములు పాత్ర ద్వారా నాగయ్య తెలుగు చిత్ర పరిశ్రమకు పరిచయం అయ్యాడు. అతడికి అది తొలి చిత్రమే అయినా ఆ పాత్రలో ఒదిగిపోయి నటించాడు. నాగయ్య తన నటనకు ప్రశంసలు అందుకున్నాడు. ఆ తర్వాత రెండు, మూడు చిత్రాల్లో నటించినా ఆ తర్వాత అవకాశాలు రాలేదు. దాంతో అటు సొంత ఊరుకు వెళ్లలేక, ఇటు సినిమా ఛాన్స్లు లేక చివరకు ఫిల్మ్ నగర్లో భిక్షాటన చేస్తూ కాలం గడుపుతున్నాడు. నాగయ్య దీనస్థితి గురించి తెలుసుకున్న కేటీఆర్...అతడికి ఆర్థిక సాయం అందించటంతో పాటు పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారు.