శంషాబాద్: ‘ప్రస్తుత ఎన్నికల్లో ఎన్డీయే 150 సీట్లు కూడా సాధించలేని పరిస్థితి ఉంది. యూపీయేకు వంద కూడా దాటే పరిస్థితుల్లేవు. అప్పుడు మనతో కలసి రావడానికి సిద్ధంగా ఉన్న వంద మందికి పైగా ఎంపీల బలం ఎంతో కీలకంగా మారనుంది. ఎర్రకోటపై జాతీయ జెండా ఎవరు ఎగరేయాలనేది నిర్ణయించే శక్తి మనదే. కావాలంటే రాష్ట్రంలో మిత్రుడు ఎంఐఎం ఎంపీతో పాటు 16 స్థానాల్లో అఖండ విజయం సాధించాలి’అని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. మాజీ మంత్రి, ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కుమారుడు, కాంగ్రెస్ నేత పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి మంగళవారం కేటీఆర్ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.
శంషాబాద్‌లో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో కేటీఆర్ మాట్లాడుతూ.. పక్క రాష్ట్రంలోని పోలవరానికి జాతీయ హోదా ఇచ్చిన ప్రధాని నరేంద్రమోదీని మన రాష్ట్రంలోని పాలమూరు, కాళేశ్వరానికి కూడా జాతీయహోదా అడిగితే ముసిముసి నవ్వులు నవ్వి ఊరుకున్నారని మండిపడ్డారు. రాష్ట్రంలో అమలు చేస్తున్న మిషన్ భగీరథ, కల్యాణలక్ష్మి, రైతుబంధు ఇలా అనేక పథకాలను కేంద్రం నుంచి వచ్చీపోయే వాళ్లు పొగడటమే తప్ప మనకు ప్రయోజనం చేకూరేలా ఏనాడూ కేంద్రం వ్యవహరించలేదని పేర్కొన్నారు. దేశానికంతటికీ తెలంగాణ పథకాలే ఆదర్శంగా మారుతున్నాయని చెప్పారు. మమత, లాలూ రైల్వే మంత్రులుగా ఉంటే రైళ్లన్నీ వారికే పోయాయని, ప్రధాని మోదీ బుల్లెట్ రైలును గుజరాత్‌కు తీసుకెళ్లారన్నారు. మన దగ్గరికి కూడా పథకాలు పరుగులెత్తాలంటే దేశ రాజకీయాల్లో కీలకంగా మారాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ప్రతిష్టపోయేలా మాట్లాడుతున్నారు..
‘రాజకీయాల్లో ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఇతరత్రా కారణాలతో పార్టీలు మారుతుంటారు. టీఆర్‌ఎస్‌కు చెందిన నలుగురు ఎమ్మెల్సీలు, చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఎన్నికల ముందే కాంగ్రెస్‌లో కలుపుకున్నారు. కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధే విశ్వేశ్వర్‌రెడ్డిని పార్టీలోకి ఆహ్వానించినా మేమేమీ అడ్డగోలుగా మాట్లాడలేదు’అని కేటీఆర్ పేర్కొన్నారు. ఇటీవల పార్టీలు మారుతున్న ఎమ్మెల్యేలపై కాంగ్రెస్ నేతలు.. రాజకీయ నేతల ప్రతిష్టపోయేలా విమర్శలు చేస్తున్న తీరు మంచి పద్ధతి కాదని హితవు పలికారు. దేశవ్యాప్తంగా పార్టీలు మారడం సర్వ సాధారణంగా మారుతోందని పేర్కొన్నారు.
టీఆర్‌ఎస్‌లోకి కార్తీక్‌రెడ్డి రాకతో ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో పార్టీ మారుతుందన్నారు. అభ్యర్థి ఎవరైనా కానీ.. కేసీఆర్‌ను దృష్టిలో ఉంచుకుని అఖండ మెజార్టీ ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో మంత్రి మల్లారెడ్డి, మాజీ మంత్రి పి.మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు ప్రకాశ్‌గౌడ్, కాలెయాదయ్య, ఆనంద్, మహేశ్, పట్నం నరేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, పార్టీ నేతలు రంజిత్‌రెడ్డి, టీఎస్‌ఈఐడీసీ చైర్మన్ నాగేందర్, చేవెళ్ల పార్లమెంటు నియోజకవర్గ ఇన్‌చార్జి గట్టు రాంచందర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment