
సాక్షి, హైదరాబాద్: కరోనా విజృంభిస్తుండటంతో రాష్ట్రంలో ఆక్సిజన్ సిలిండర్లకు కొరత ఏర్పడింది. మున్ముందు అవసరం అవుతుందన్న భావనతో అనేక మంది ముందస్తుగా కొనుగోలు చేసి ఇళ్లలో పెట్టుకుంటున్నారు. దీంతో మార్కెట్‌లో కృత్రిమ కొరత ఏర్పడింది. దీన్ని ఆసరాగా చేసుకొని కొందరు పంపిణీదారులు, విక్రయదారులు బ్లాక్ మార్కెట్‌లో ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణ డ్రగ్ కంట్రోల్ అధికారులు రాష్ట్రంలో ఉన్న అన్ని ఆక్సిజన్ సిలిండర్ పంపిణీదారులపై దాడులు చేస్తున్నారు. సిలిండర్లను కేవలం ఆసుపత్రులు, లైసెన్స్ హోల్డర్లకు మాత్రమే సరఫరా చేయాలి.
అలాకాకుండా ఇష్టారాజ్యంగా సరఫరా చేస్తుండటంతో 44 మంది పంపిణీదారులు, 16 తయారీ యూనిట్లలో అధికారులు తనిఖీలు చేశారు. 14 మంది పంపిణీదారులు, ఒక తయారీ యూనిట్ వద్ద రికార్డుల్లో వ్యత్యాసాలు గుర్తించారు. వాటికి నోటీసులు జారీ చేశారు. వ్యక్తులు లేదా సంస్థల పేరిట సిలిండర్ల సరఫరాకు అనుమతి లేదని డ్రగ్ కంట్రోల్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. పంపిణీదారులపై దాడులు కొనసాగిస్తామని అధికారులు వెల్లడించారు. ఎక్కడైనా నిబంధనలను అతిక్రమిస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆక్సిజన్ సిలిండర్లను నిర్ణయించిన సీలింగ్ ధరల కంటే ఎక్కువకు విక్రయిస్తే కేసులు బుక్ చేస్తామని తెలిపారు.
మూడింతలు పెరిగిన ధర
ఇటు బ్లాక్ మార్కెట్‌లో ఆక్సిజన్ సిలిండర్ ధరలు ఏకంగా మూడింతలు పెరగడం గమనార్హం. గతంలో రూ.4 వేలకు లభించిన 7 లీటర్ల (బీ రకం) ఆక్సిజన్ సిలిండర్, ఇప్పుడు రూ.8 వేల నుంచి రూ.12 వేల వరకు విక్రయిస్తున్నారు. సిలిండర్ల డిమాండ్ 10 నుంచి 20 శాతం పెరిగింది. దీంతో సాధారణ రేటుకు ఆక్సిజన్ సిలిండర్లు దొరికే పరిస్థితి లేకుండా పోయింది. ఎక్కడ అడిగినా స్టాక్ లేదన్న మాటే వినబడుతోంది. ఈ నేపథ్యంలో సర్కారు తాజాగా ఎలాంటి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఆక్సిజన్ సిలిండర్లను వ్యక్తులకు విక్రయించొద్దని ఆదేశాలు జారీ చేసింది. ‘సరఫరాదారులు చిన్న ఆక్సిజన్ సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని మాకు చెప్పారు.
తీరా చూస్తే అవి బ్లాక్‌లో మాత్రమే దొరుకుతున్నాయి’అని ఓ వైద్య నిపుణుడు వ్యాఖ్యానించారు. సిలిండర్ల కొరత కారణంగా ఆసు పత్రులు తమ ఐసీయూలలో డిమాండ్‌ను తీర్చడానికి ఇబ్బంది పడుతున్నాయి. ‘కొన్ని ప్రైవేట్ ఆసుపత్రుల్లో భారీ కొరత ఉంది’అని ఓ వైద్యాధికారి చెప్పారు. ‘ఉబ్బసం వంటి వ్యాధి ఉన్న కొందరు వ్యక్తులు 5 నుంచి 10 సిలిండర్లను బ్లాక్‌లో కొనుగోలు చేస్తున్నారు. వైద్యుల ప్రిస్క్రిప్షన్ ఉంటే తప్ప వ్యక్తులకు సరఫరా చేయొద్దని సరఫరాదారులకు సలహా ఇచ్చామని’ఒక డ్రగ్ కంట్రోల్ ఆఫీసర్ తెలిపారు.
కొందరికే అవసరం
కరోనా రోగులకు అత్యవసరమైతే ఆక్సిజన్ అందజేయాలి. అప్పుడే రోగి కోలుకుంటాడు. వాస్తవానికి కరోనా రోగుల్లో 80 శాతం మందికి ఎలాంటి ఆక్సిజన్ సపోర్ట్ అవసరం లేదు. మధుమేహం, బీపీ నియంత్రణలో లేనప్పుడు, దీర్ఘకాలిక మూత్రపిండాలు, కాలేయ వ్యాధి, గుండె ఆగిపోవడం లేదా రోగనిరోధక మందుల మీద ఉన్నవారికి ఆక్సిజన్ అవసరం కావచ్చు. అనవసర భయాందోళనల కారణంగా కొందరు ముందు జాగ్రత్తగా వాటిని కొనుగోలు చేసి ఇంట్లో పెట్టుకుంటున్నారు. విచిత్రమేంటంటే కొన్ని నర్సింగ్ హోంలు, క్లినిక్ సెంటర్లు ఆక్సిజన్ సిలిండర్ల కిట్‌ను కూడా రోగులకు విక్రయిస్తున్నాయి. అవసరమైనప్పుడు వాడుకోవచ్చని వారిని భయపెట్టి అంటగడుతున్నాయి. దీంతో అత్యవసర రోగులు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది.
Comments
Please login to add a commentAdd a comment