చదువులమ్మలు | Ladies Are More In Teaching Job In India | Sakshi
Sakshi News home page

Published Sat, Aug 4 2018 2:10 AM | Last Updated on Sat, Aug 4 2018 8:06 AM

Ladies Are More In Teaching Job In India - Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : బోధన రంగంలో మహిళల వాటా పెరుగుతోంది. ఉన్నత విద్యలో ముందంజలో ఉంటున్న మహిళలు బోధన రంగంలోనూ తాము తక్కువ కాదని నిరూపిస్తున్నారు. నాలుగేళ్ల కిందట బోధన రంగంలో మహిళల సంఖ్య 39 శాతం ఉండగా, తాజాగా అది 42 శాతానికి పెరిగింది. 2014–15లో ఉన్నత విద్యా సంస్థల్లో 61 శాతం మంది అధ్యాపకులు పురుషులు ఉంటే 39 శాతం మంది మహిళలు ఉన్నారు. 2017–18లో బోధన రంగంలో 58 శాతం పురుషులు ఉండగా, 42 శాతం మహిళలు ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం లెక్కలు తేల్చింది.

తొలిసారిగా సమగ్ర వివరాలు సేకరణ
దేశంలోని ఉన్నత విద్యా సంస్థల్లో పనిచేస్తున్న అధ్యాపకుల సమగ్ర వివరాలను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ (ఎంహెచ్‌ఆర్‌డీ) సేకరించింది. గతంలో విద్యా సంస్థల వారీగా ఎంత మంది అధ్యాపకులు ఉన్నారు, అందులో మహిళలు ఎంత మంది, పురుషులు ఎంత మంది, తదితర వివరాలను మాత్రమే సేకరించిన కేంద్రం.. ఈసారి సమగ్ర వివరాలను తీసుకుంది. విద్యా సంస్థల వారీగా ఆయా విద్యా సంస్థల్లో చేరిన తేదీ, వారు ఆ వృత్తిలో అడుగుపెట్టిన ఏడాది, వారికున్న విద్యార్హతలు, మొబైల్‌ నంబరు, ఈమెయిల్‌ ఐడీ, ఆధార్‌ నంబర్లతో సహా పక్కా వివరాలను తీసుకుంది. ఈ మేరకు ప్రస్తుతం దేశంలో 12,84,755 మంది అధ్యాపకులు ఉన్నట్లు తేల్చింది. అందులో 12,68,597 మందిఅధ్యాపకుల సమగ్ర వివరాలను సేకరించినట్లు వెల్లడించింది. వారిలో పురుషులు 7,45,158 మంది ఉండగా, మహిళలు 5,39,597 మంది ఉన్నట్లు తెలిపింది.

1.88 లక్షల మంది తగ్గుదల
సంఖ్యా పరంగా చూస్తే దేశవ్యాప్తంగా అధ్యాపకుల సంఖ్య నాలుగేళ్లలో భారీగా తగ్గిపోయింది. 2014–15లో దేశవ్యాప్తంగా 14,73,255 మంది ఉండగా, ప్రస్తుతం ఆ సంఖ్య 12,84,755కు పడిపోయింది. ఆ మేరకు 1,88,500 మంది తగ్గిపోయారు. అప్పట్లో అధ్యాపకుల్లో పురుషులు 8,98,686 మంది ఉండగా, మహిళలు 5,74,569 మంది ఉన్నట్లు ప్రభుత్వం లెక్కలు తేల్చింది. ఓవైపు విద్యా సంస్థలు పెరుగుతుంటే అధ్యాపకుల సంఖ్య పెరగాల్సింది పోయి తగ్గుముఖం పడుతుండటంపై విద్యావేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో పేపర్లపై అధ్యాపకుల సంఖ్యను ఎక్కువ చేసి చూపించిన యాజమాన్యాలు ఇపుడు పక్కా సమాచారం ఇవ్వాలని అడుగుతుండటంతో అలాంటి తప్పిదాలకు పాల్పడం లేదని ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు తెలంగాణలోని ఇంజనీరింగ్‌ కాలేజీలే ఓ ప్రత్యక్ష ఉదాహరణ అని రాష్ట్ర ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి పేర్కొన్నారు. ఇష్టానుసారం లెక్కలు ఇవ్వకుండా పక్కా సమాచారాన్నే ఇస్తున్నాయని, అందువల్లే సంఖ్య తగ్గుదల కనిపిస్తోందని వివరించారు.

ఎస్సీ, ఎస్టీ అధ్యాపకుల్లో మూడో స్థానంలో తెలంగాణ
దేశవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ అధ్యాపకులు ఎక్కువ మంది ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది. మొదటి స్థానంలో ఆంధ్రప్రదేశ్‌ (13.48 శాతం ఎస్సీలు, 1.6 శాతం ఎస్టీలు) ఉండగా, మహారాష్ట్ర (11.04 శాతం ఎస్సీలు, 0.41 శాతం ఎస్టీలు) రెండో స్థానంలో నిలిచింది. 10.77 శాతం ఎస్సీ అధ్యాపకులు, 3.4 శాతం ఎస్టీ అధ్యాపకులతో తెలంగాణ మూడో స్థానంలో నిలిచింది.

జనరల్‌ కేటగిరీ వారే ఎక్కువ
బోధన రంగంలో రిజర్వేషన్‌ కాకుండా జనరల్‌ కేటగిరీ అధ్యాపకులే అత్యధికంగా ఉన్నట్లు కేంద్ర ప్రభుత్వం లెక్కలు తేల్చింది. చదువుకునే విద్యార్థుల్లో ఎక్కువ మంది బీసీ, ఎస్సీలు, ఎస్టీలే ఉండగా, బోధించే అధ్యాపకులు మాత్రం ఇతర కేటగిరీల వారే ఎక్కువగా ఉన్నట్లు పేర్కొంది. అందులో 56 శాతం జనరల్‌ కేటగిరీ అధ్యాపకులు ఉండగా, 32.3 శాతం బీసీలు, 8.6 శాతం ఎస్సీలు, 2.27 శాతం ఎస్టీలు ఉన్నట్లు తేల్చింది.

‘ప్రైవేటు’లో తెలంగాణ, ఏపీ టాప్‌
దేశవ్యాప్తంగా ప్రైవేటు విద్యా సంస్థలు ఉన్న రాష్ట్రాల్లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాలు ముందంజలో ఉన్నాయి. దేశంలో సగటున 78 శాతం కాలేజీలు ప్రైవేటు రంగంలో ఉండగా.. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం 82 శాతం కాలేజీలు ప్రైవేటు రంగంలోనే ఉన్నాయి. ఆ తర్వాత 76.2 శాతంతో తమిళనాడు మూడో స్థానంలో ఉంది. అయితే అసోంలో మాత్రం కేవలం 12 శాతం, చండీగఢ్‌లో 8 శాతమే ప్రైవేటు విద్యా సంస్థలు ఉండటం గమనార్హం.


పురుషుల కంటే మహిళా అధ్యాపకులు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు కేరళ, పంజాబ్, హరియాణా, చండీగఢ్, మేఘాలయ, నాగాలాండ్, ఢిల్లీ, గోవా


 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement