
సాక్షి, హైదరాబాద్: సికింద్రాబాద్‌లో ఉజ్జయినీ మహంకాళి అమ్మవారి మినీ జాతర శుక్రవారం ఘనంగా ప్రారంభమైంది. ఉదయం అయిదు గంటల నుంచే భక్తులు పెద్ద ఎత్తున అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి భక్తులు ఒడిబియ్యం సమర్పించారు. పోతురాజుల నృత్యాలతో అమ్మవారి ఊరేగింపు ఘనంగా జరిగింది. జాతరలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. కాగా బోనాలకు ముందు వచ్చే శుక్రవారాన్ని మినీ జాతరగా పిలుస్తారు.
పాతబస్తీలో మొదలైన సందడి
మరోవైపు పాతబస్తీలోని లాల్ దర్వాజ సింహవాహిని మహంకాళి దేవాలయంలో బోనాల ఉత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. జీఎచ్ఎంసీ కమిషనర్ దాన కిశోర్, నగర పోలీస్ కమిషనర్ అంజని కుమార్ కలశ స్థాపన ద్వారా ఉత్సవాలను ప్రారంభించారు. ఉత్సవాల నిర్వహణ కోసం జీహెచ్ఎంసీ రూ. 25 కోట్లు కేటాయించింది. బోనాలు జరిగే ఆలయాల వద్ద శానిటేషన్ సిబ్బందిని ఏర్పాటు చేశారు.