సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్, టీఆర్‌ఎస్ పార్టీలు వేర్వేరు కాదని.. రెండూ కలిసే ఉన్నాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో ఈ రెండింటిలో ఏ పార్టీకి ఓటు వేసినా అది మరో పార్టీకి పడ్డట్టేనని చెప్పారు. ఇటీవల కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల కలయిక నేపథ్యంలో ఆ రాష్ట్ర సీఎం కుమారస్వామి చెప్పిన మాటే దీనికి నిదర్శనమన్నారు. కేసీఆర్, చంద్రబాబు సూచన మేరకే ఈ కలయిక ఏర్పడిందన్న వాస్తవాన్ని గుర్తించాలన్నారు. ఖమ్మం, జగిత్యాల, కార్వాన్‌లకు చెందిన వివిధ పార్టీలకు చెందిన పలువురు నేతలు మంగళవారం బీజేపీ కార్యాలయంలో పార్టీలో చేరారు. వారిని పార్టీలోకి ఆహ్వానించిన అనంతరం లక్ష్మణ్ మాట్లాడారు. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌లు మజ్లిస్‌కు తొత్తులుగా మారి ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయని.. మతోన్మాద శక్తులకు గుణపాఠం చెప్పాలంటే బీజేపీ గెలవాల్సిందేనన్నారు. మోదీ పాలనను గుర్తించి ప్రజలు బీజేపీ వైపు మళ్లుతున్నారని, తెలంగాణలో బీజేపీ గెలిచేందుకు ప్రత్యేక వ్యూహాన్ని అనుసరిస్తామని తెలిపారు. దీనిపై ఈ నెల 22న అమిత్ షా హైదరాబాద్‌లో పార్టీ నేతలతో భేటీలు నిర్వహిస్తారని చెప్పారు.
పార్టీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు..
బీజేపీ జాతీయ మైనార్టీ సెల్ సభ్యుడు అనీప్‌అలీ, లాయక్ అలీల ఆధ్వర్యంలో మంగళవారం సాయంత్రం బీజేపీ కార్యాలయంలో ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు. బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాల్లో మైనారిటీల సంక్షేమం అద్భుతంగా ఉందని వారు పేర్కొన్నారు. కార్యక్రమంలో పార్టీ అధ్యక్షుడు లక్ష్మణ్, బీజేఎల్పీ నేత కిషన్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఆ రెండు పార్టీలు ఒక్కటే: కె.లక్ష్మణ్
Published Wed, Jun 13 2018 1:19 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment