'వాళ్లు టీడీపీలో ఇంకా కొనసాగడం విచారకరం'
జడ్చర్ల (మహబూబ్‌నగర్ జిల్లా) : పాలమూరు ఎత్తిపోతల ప్రాజెక్ట్‌ను టీడీపీ అడ్డుకుంటున్నా.. నాయకులు, కార్యకర్తలు ఇంకా ఆ పార్టీలోనే కొనసాగడం విచారకరమని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. తెలంగాణ అభివృద్ధికి ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు అడ్డుపడుతున్నారని ఆయన ఆరోపించారు. బుధవారం జడ్చర్ల లోని ఏఎస్‌ఆర్ గార్డెన్‌లో జరిగిన టీఆర్‌ఎస్ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. ఎన్నో సంవత్సరాలుగా సాగు నీరు లేక ఇబ్బందులు పడుతున్న జిల్లా రైతాంగానికి సాగు నీరందించే పాలమూరు ఎత్తిపోతల పథకానికి చంద్రబాబు అడ్డుపడడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు.
సీఎం కేసీఆర్ చిత్తశుద్ధిని కనబరిచి జిల్లా రైతుల శ్రేయస్సును దృష్టిలో పెట్టుకుని పాలమూరు ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేశారని గుర్తు చేశారు. జిల్లాకు సంబంధించిన పాలమూరు ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకుంటున్న బాబును ఆ పార్టీ నాయకులు ప్రశ్నించకపోగా తమపై బురద జల్లుతున్నారని పేర్కొన్నారు. టీడీపీని వీడి చంద్రబాబుకు బుద్ది చెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. బాబు వైఖరిని నిరసిస్తూ బంగారు తెలంగాణ నిర్మాణంలో భాగస్వాములయ్యేందుకు జడ్చర్లలో నాయకులు, కార్యకర్తలు టీడీపీని వీడి టీఆర్‌ఎస్‌లో చేరడాన్ని స్వాగతిస్తున్నట్లు తెలిపారు.