* భార్యను చంపిన భర్త అరెస్టు
* తల్లి హత్య.. తండ్రి జైలుపాలవడంతో అనాథలైన పిల్లలు
పరిగి: భార్యను చంపిన భర్తను పోలీసులు అరెస్టు చేసి రిమాండుకు తరలించారు. భార్య సెల్‌ఫోన్‌లో మరో వ్యక్తితో మాట్లాడుతుండడంతో అనుమానించి హత్య చేసినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు. పరిగి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ ప్రసాద్ కేసు వివరాలు వెల్లడించారు. కుల్కచర్ల మండలం చాకల్‌పల్లి అనుబంధ మొగుల్లపల్లికి చెందిన ఫకీరయ్య కొన్నేళ్ల క్రితం అదే గ్రామానికి చెందిన మాణెమ్మ(30)తో వివాహం జరిగింది. దంపతులకు ఓ కుమారుడు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. భార్యాభర్తలు వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఇదిలా ఉండగా ఫకీరయ్య కొంతకాలంగా భార్యను అనుమానిస్తున్నాడు.
దీంతో దంపతుల మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. ఈ విషయమై గతంలో ఓసారి గ్రామ పెద్దల ముందు పంచాయతీ పెట్టడంతో వారు సర్దిచెప్పారు. ఇటీవల మాణెమ్మ ఇంట్లో ఫోన్‌లో మాట్లాడుతూ భర్తకు కనిపించింది. ఫోన్ ఎక్కడిది..? ఎవరు కొనిచ్చారు.. ఫోన్‌లో ఎవరితో మాట్లాడుతున్నావ్..? అంటూ ఫకీరయ్య భార్యతో గొడవపడ్డాడు.
అప్పుడు ఏదోటి చెప్పిన మాణెమ్మ విషయం దాటవేసింది. అప్పటి నుంచి ఫకీరయ్య భార్యను మరింత అనుమానించసాగాడు. ఈక్రమంలో ఈనెల 1న ఉదయం మాణెమ్మ బహిర్భూమికి వెళ్లగా ఫకీరయ్య ఆమెను అనుసరించాడు. మాణెమ్మ చెట్ల పొదల్లోకి వెళ్లి ఫోన్‌లో మాట్లాడుతుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నాడు. ఎవరితో మాట్లాడుతున్నావని ఫకీరయ్య భార్యను గద్దించాడు. గ్రామానికి చెందిన ఓ వ్యక్తి తనకు సెల్‌ఫోన్ కొనిచ్చాడని, అతడితోనే మాట్లాడుతున్నానని మాణెమ్మ చెప్పింది.
మాణెమ్మకు అతడితో వివాహేతర సంబంధం ఉందని ఫకీరయ్య అనుమానించాడు. ఈ విషయం తిరిగి పంచాయతీ పెట్టగా భార్యాభర్తలకు పెద్దలు నచ్చజెప్పారు. అనంతరం అక్కడి నుంచి ఇంటికి వెళ్లిన దంపతులు మళ్లీ గొడవపడ్డారు. మాటామాట పెరగడంతో ఆగ్రహానికి గురైన ఫకీరయ్య ఇంట్లో ఉన్న గొడ్డలితో మాణెమ్మను తలపై నరికాడు. తీవ్రంగా గాయపడిన మాణెమ్మ అక్కడికక్కడే మృతిచెందగా ఫకీరయ్య పరారయ్యాడు.
మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు పరారీలో ఉన్న ఫకీరయ్యను గురువారం అదుపులోకి తీసుకొని విచారణ జరుపగా హత్యకు దారితీసిన పైవిషయాలు తెలిపాడు. తల్లి హత్యకు గురవడం, తండ్రి జైలుపాలు కావడంతో వారి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు. సమావేశంలో కుల్కచర్ల, పరిగి ఎస్‌ఐలు ఉన్నారు.
సెల్‌ఫోన్ సంభాషణలే ప్రాణం తీశాయి..
Published Fri, Jan 9 2015 12:37 AM | Last Updated on Mon, Jul 30 2018 9:15 PM
Advertisement
Advertisement