హైదరాబాద్: దివంగత నాయకుడు పి.జనార్దన్‌రెడ్డి పేదల పెన్నిధి అని, పదవులు ఆయనకు చిన్నవని, ప్రజల మనిషి కాబట్టే ఆయన మన మధ్య లేకున్నా ప్రజల హృదయాల్లో బతికే ఉన్నారని పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్ కుమార్‌రెడ్డి అన్నారు. శుక్రవారం పీజేఆర్ వర్ధంతి సందర్భంగా ఐమాక్స్ పక్కన ఉన్న హెచ్‌ఎండీఏ మైదానంలో జరిగిన సభలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళి అర్పించారు. పీజేఆర్ కుమారుడు, మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డి ఆధ్వర్యంలో ఈ వర్ధంతిసభ ఏర్పాటు చేశారు. ఉత్తమ్ మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల్లో అవకతవకలు జరిగాయనడానికి జూబ్లీహిల్స్ నియోజకవర్గమే నిదర్శనమని, ఇక్కడ వీవీ ప్యాడ్‌లలో స్లిప్‌లు కూడా మాయమయ్యాయని అన్నారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎంత పోలింగ్ జరిగిందో సాయంత్రం తరువాత ఇంకా ఎక్కువ పోలింగ్ జరగడం అనుమానాలకు తావిస్తోం దన్నారు. రాబోయే ఎంపీ ఎన్నికలను బ్యాలెట్ పేపర్‌తో నిర్వహించాలని తాము ఈసీని, ఏఐసీసీని కోరుతామని తెలిపారు.
5 ఏళ్లుగా టీఆర్‌ఎస్ ప్రభుత్వం బీసీల జనగణన చేయకుండా ఇప్పుడు కోటా తగ్గించడం సీరియస్‌గా తీసుకోవాల్సిన విషయమన్నారు. అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత వి.హనుమంతరావు మాట్లాడుతూ ‘నేను పీజేఆర్ బద్ధ శత్రువులం, అంజయ్య హయాంలో ఇద్దరం పోటీ పడేవాళ్లం’అని అన్నారు. పీజేఆర్ ఆశయాలకు అనుగుణంగా అందరూ పనిచేయాలని కోరారు. సీనియర్ నేత కనుమూరి బాపిరాజు మాట్లాడుతూ తన జీవితంలో పీజేఆర్ లాంటి వ్యక్తిని చూడలేదన్నారు. బార్బర్ షాప్, పాన్ షాప్ ప్రారంభోత్సవాలకు కూడా వెళ్లేవారన్నారు. టీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ మాట్లాడుతూ నమ్మిన సిద్దాంతానికి కట్టుబడి ఉండే వ్యక్తి పీజేఆర్ అని కొనియాడారు. కార్యక్రమంలో గ్రేటర్ కాంగ్రెస్ అధ్యక్షుడు అంజన్ కుమార్ యాదవ్, ఎమ్మెల్సీ రాములునాయక్, నేతలు శంకర్‌రావు, కమలాకర్‌రావు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment