సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో కొనసాగుతున్న రైతుల ఆత్మహత్యల విషయంలో ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడాన్ని నిరసిస్తూ గురువారం ఇందిరాపార్కు వద్ద 10 వామపక్షాలు మహాధర్నాను నిర్వహించనున్నాయి. ఈ ధర్నాలో వామపక్షాలతో పాటు ఆత్మహత్యలకు పాల్పడిన రైతుల కుటుంబసభ్యులతో పాటు, రైతు సంఘాల ప్రతి నిధులు పాల్గొంటారు. రైతులసమస్యలపై అసెంబ్లీలో, బయటా ఎలాంటి స్పష్టమైన హామీ రాకపోవడం, నిర్దిష్ట మైన కార్యాచరణను ప్రకటించకపోవడాన్ని ఎండగడుతున్నాయి. వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన రైతుల భరోసాయాత్రకు మంచి స్పందన వచ్చిందని సీపీఐ నేత చాడ వెంకటరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు.