దిల్‌సుఖ్‌నగర్’ కేసులో మరో అరెస్టు | Legitimacy 'in the case arrested | Sakshi
Sakshi News home page

దిల్‌సుఖ్‌నగర్’ కేసులో మరో అరెస్టు

Published Mon, Mar 24 2014 12:36 AM | Last Updated on Sat, Sep 2 2017 5:04 AM

దిల్‌సుఖ్‌నగర్’ కేసులో మరో అరెస్టు

దిల్‌సుఖ్‌నగర్’ కేసులో మరో అరెస్టు

  •      రాజస్థాన్‌లో పట్టుబడిన ఉగ్రవాది వఖాస్
  •      బాంబుల తయారీలో ఇతడు దిట్ట
  •      107 బస్టాప్ వద్ద బాంబు పెట్టిందీ ఇతడే
  •      మరిన్ని కుట్రలు భగ్నం చేసిన ఢిల్లీ కాప్స్
  •  సాక్షి, హైదరాబాద్: దిల్‌సుఖ్‌నగర్‌లో గతేడాది ఫిబ్రవరి 21న చోటు చేసుకున్న జంట బాంబు పేలుళ్ల కేసులో మరో నిందితుడు పట్టుబడ్డాడు. ఈ విధ్వంసానికి కారణమైన ఇండియన్ ముజాహిదీన్ (ఐఎం) ఉగ్రవాది, పాకిస్థానీ వఖాస్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం రాజస్థాన్‌లో అరెస్టు చేశారు. వఖాస్‌తో సహా మొత్తం నలుగురిని ఆదివారం ఢిల్లీ తరలించి.. కోర్టు అనుమతితో పది రోజుల కస్టడీకి తీసుకున్నారు.
     
    పాక్ టు భారత్ వయా నేపాల్...
     
    పాకిస్థాన్‌కు చెందిన వఖాస్ అసలు పేరు జఖీ ఉర్ రె హ్మాన్. ఫుడ్ టెక్నాలజీలో డిప్లొమా చేశాడు. పాక్ నిఘా సంస్థ ఐఎస్‌ఐ ప్రేరేపిత ఉగ్రవాద సంస్థ లష్కరే తొయిబా (ఎల్‌ఈటీ) ద్వారా ఉగ్రవాదం బాటపట్టాడు. ఆ సంస్థలో శిక్షణ పొందాడు.  ఐఎం మాస్టర్‌మైండ్ రియాజ్ భత్కల్ ఆదేశాల మేరకు ఆ సంస్థ కో-ఫౌండర్ యాసీన్ భత్కల్‌కు ప్రధాన అనుచరుడిగా మారాడు.

    2010లో నేపాల్‌లోని ఖాట్మండ్ మీదుగా భారత్‌లోకి ప్రవేశించి, తెహసీన్ అక్తర్‌తో జతకట్టాడు. ఢిల్లీ, ముంబై, రాజస్థాన్, గుజరాత్‌ల్లో జరిగిన పేలుళ్లలో కీలక పాత్ర పోషించిన వఖాస్ గతేడాది యాసీన్, అసదుల్లా అక్తర్, తెహసీన్ అక్తర్‌లతో కలిసి దిల్‌సుఖ్‌నగర్ జంట పేలుళ్లలో పాలుపంచుకున్నాడు.

    పాకిస్థాన్‌లో తలదాచుకుంటున్న రియాజ్ భత్కల్ 2007లో మాదిరిగానే హైదరాబాద్‌ను మరోసారి టార్గెట్ చేయాలని 2012లోనే నిర్ణయించుకున్నాడు. ఈ పనిని అసదుల్లా అక్తర్, వఖాస్‌లకు అప్పగించాడు. ముందు షెల్టర్ ఏర్పాటు చేసుకోమని చెప్పి మంగుళూరుకు పంపాడు. పేలుళ్లకు అవసరమైన నగదు, పేలుడు పదార్థాలు అందుకున్నాక ఈ ఇద్దరూ తెహసీన్ అక్తర్‌తో కలిసి రంగంలోకి దిగారు.
     
    ముందు రెక్కీ...
     
    దిల్‌సుఖ్‌నగర్ పేలుళ్ల ఆపరేషన్ పూర్తి చేయడానికి షెల్టర్ వెతకడం కోసం తెహసీన్ అక్తర్ 16 రోజుల ముందు ఇక్కడికి చేరుకుని అబ్దుల్లాపూర్‌మెట్‌లో ఇల్లు అద్దెకు తీసుకున్నాడు. ఫిబ్రవరి 10న ఓసారి సిటీకి వచ్చి వెళ్లిన అసదుల్లా అక్తర్.. విధ్వంసం సృష్టించడానికి వారం ముందు వఖాస్‌తో కలిసి హైదరాబాద్ చేరుకున్నారు.  ముగ్గురూ కలిసి మలక్‌పేట, అబిడ్స్, దిల్‌సుఖ్‌నగర్‌ల్లోని అనేక జనసమర్థ ప్రాంతాల్లో రెక్కీ చేశారు. చివరకు దిల్‌సుఖ్‌నగర్‌ను టార్గెట్‌గా ఎంచుకున్నారు. ఫిబ్రవరి 20న రెండు పాతసైకిళ్లు కొని మలక్‌పేట్ రైల్వేస్టేషన్ పార్కింగ్‌లో దాచారు.
     
    టైమ్ చాలక ‘107’లో పెట్టేసి...
     
    బాంబుల తయారీలో దిట్ట అయిన వఖాస్ దిల్‌సుఖ్‌నగర్ బాంబుల తయారీ బాధ్యతల్ని తీసుకున్నాడు. బి-డే (బ్లాస్డ్ డే) అయిన ఫిబ్రవరి 21న మధ్యాహ్నం 3 గంటలకు ప్రెషర్‌కుక్కర్ బాంబుల తయారీ పూర్తి చేశాడు. వాటిని అట్ట పెట్టెల్లో పెట్టి ప్యాక్ చేశాడు. అక్కడి నుంచి మలక్‌పేట్ రైల్వేస్టేషన్‌కు వచ్చారు. పార్కింగ్‌లో ఉన్న సైకిళ్ల క్యారేజ్‌పై బాంబులున్న పెట్టెలు కట్టి.. అక్కడి నుంచి దిల్‌సుఖ్‌నగర్ బయలురేరారు. నల్లగొండ చౌరస్తా దాటాక ఏడు గంట లకు పేలే విధంగా బాంబుల్లోని టైమర్‌ను సెట్ చేశారు.  

    తెహసీన్ అక్తర్, వఖాస్ చెరోసైకిల్‌పై దిల్‌సుఖ్‌నగర్ చౌరస్తా వైపు బయలుదేర గా... అసదుల్లా అక్తర్ గడ్డిఅన్నారం చౌరస్తా వద్దే ఉండిపోయాడు. తెహసీన్ నేరుగా వెళ్లి ఏ-1 మిర్చ్ సెంటర్ వద్ద సైకిల్‌ను పార్క్ చేశాడు. వెనుక వచ్చిన వఖాస్‌కు మద్యం దుకాణం వ రకు వెళ్లే లోపే బాంబు పేలిపోవచ్చని భావిం చాడు. వెంటనే టార్గెట్‌ను మార్చుకొని 107 బస్టాప్ సైకిల్ పెట్టి వెళ్లిపోయాడు. పేలుళ్ల అనంతరం నేరుగా మంగుళూరు వెళ్లిపోయిన వఖాస్... ఎప్పటికప్పుడు తన స్థావరాలు మా రుస్తూ తలదాచుకున్నాడు.

    గతేడాది ఆగస్టులో యాసీన్, అసదుల్లాలను నిఘా వర్గాలు భారత్-నేపాల్ సరిహద్దుల్లోని రక్సల్ వద్ద అరెస్టు చే శాయి. వీరి విచారణలోనే మొత్త ఆపరేషన్ వెలుగులోకి రావడంతో కేసు దర్యాప్తు చేసిన ఎన్‌ఐఏ అధికారులు రియాజ్ భత్కల్‌ను ప్రధాన నిం దితుడిగా (ఏ-1)గా,  యాసీన్‌ను ఐదో నింది తుడుగా, అసదుల్లా, వఖాస్, తెహసీన్‌లను ఏ-2, ఏ-3, ఏ-4గా నిర్థారించారు. ఈ మే రకు ఇటీవలే అభియోగపత్రాలు దాఖలు చేశారు.
     
    ఆరు రాష్ట్రాల్లో తలదాచుకుని...

     
    యాసీన్, అసదుల్లా విచారణలోనే వఖాస్ భా రత్‌లోనే ఉన్నాడని కర్ణాటక, ఒడిశా, పశ్చిమ బెంగాల్, కేరళ, మహారాష్ట్రల్లో సంచరిస్తున్నాడని వెలుగులోకి వచ్చింది. దీంతో పక్కా నిఘా ఉంచిన ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు శనివారం ముంబై నుంచి రాజస్థాన్‌లోని అజ్మీర్‌కు చేరుకున్న వఖాస్‌ను అక్కడి రైల్వేస్టేషన్‌లో పట్టుకున్నారు. ఇతడిచ్చిన సమాచారంలో జైపూర్, జోధ్‌పూర్‌ల్లో మరో ముగ్గురిని అరెస్టు చేసి భారీ పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నారు. ఎన్నికల నేపథ్యంలో వీరు సీరియల్ పేలుళ్లకు కుట్రపన్నినట్లు వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం ఢిల్లీ పోలీసు కస్టడీలో ఉన్న వఖాస్‌ను వారి విచారణ పూర్తయ్యాక పీటీ వారెంట్‌పై హైదరాబాద్ తీసుకొచ్చేందుకు  ఎన్‌ఐఏ సన్నాహాలు చేస్తోంది.
     

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement