ఎరువుల కొరత సృష్టిస్తే లెసైన్సుల రద్దు: ప్రత్తిపాటి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కృత్రిమంగా ఎరువుల కొరత సృష్టించే దుకాణాల యజమానులపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి లెసైన్సులు రద్దుచేస్తామని వ్యవసాయశాఖ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు హెచ్చరించారు. ప్రస్తుత సీజన్‌లో ఎరువుల కృత్రిమ కొరత సృష్టించడమే కాకుండా ఎక్కువ ధరలకు యూరి యాను విక్రయిస్తున్నారని ‘సాక్షి’ ప్రచురించిన కథనంపై ఆయన శనివారం సచివాలయంలో మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. రాష్ట్రంలో ఎక్కడా యూరియా, కాంప్లెక్స్ ఎరువుల కొరత లేదని.. అయితే కొంతమంది దుకాణ యజమానులు కావాలని కొరత సృష్టించి రైతులకు ఎక్కువ ధరకు అమ్ముతున్నట్టు తమ దృష్టికి వచ్చిందని పేర్కొన్నారు.
ఎరువుల విషయంలో కృత్రిమ కొరత సృష్టించినా, ఎక్కువ ధరకు అమ్మినా లెసైన్సుదారులతో పాటు వ్యవసాయశాఖ ఏడీ, ఏఓలనూ సస్పెండ్ చేస్తామని హెచ్చరించారు. రైతులెవరైనా ఎరువులు కొన్నాక ఎక్కువ ధరకు విక్రయించారని అనిపిస్తే ఆ బిల్లులతో సహా వచ్చి ప్రభుత్వానికి ఫిర్యాదు చేయాలని సూచించారు. అందుకోసం రెండు టోల్ ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశామన్నారు. ఒకటి గుంటూరులో 1832216644, మరొకటి వ్యవసాయశాఖ పరిధిలో కిసాన్ కాల్ సెంటర్ 18001801551 నంబర్లు ఉంటాయని తెలి పారు. రాష్ట్రంలో 7.58 లక్షల మెట్రిక్ టన్నుల ఎరువులు అవసరం ఉంటే, ఇప్పటికే 5.88 లక్షల మెట్రిక్ టన్నులు ఇచ్చామన్నారు. మరో 1.88 మెట్రిక్ టన్నుల ఎరువులకు కేంద్రం డెలివరీ అనుమతి కూడా ఇచ్చిందన్నారు. ఈ ఏడాది సాగుబడి ఏ మాత్రం తగ్గలేదని, గతేడాది 35.92 లక్షల హెక్టార్లలో జరిగిందని, ఈ ఖరీఫ్ సీజన్‌లోనూ అంతే స్థాయిలో సాగవుతోందని చెప్పారు. రానున్న రబీకి కూడా విత్తనాలు, ఎరువులు సిద్ధం చేస్తున్నట్లు మంత్రి తెలిపారు.
తొలి దశలో రూ. 50 వేలైనా మాఫీ
ఇదిలావుంటే.. రైతుల రుణ మాఫీకి సంబంధించి తొలి దశలో కనీసం రూ. 50 వేలైనా మాఫీ చేసేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మంత్రి ప్రత్తిపాటి పేర్కొన్నారు. లక్షన్నర రూపాయల ప్రాతిపదికన రాష్ట్రంలో రూ. 42 వేల కోట్ల రుణాలు మాఫీ చేయాల్సి ఉందని.. అయితే రూ. 50 వేల లోపు రుణాలున్న వారే 40శాతం మంది రైతులు ఉన్నారని ఆయన చెప్పారు. రైతుల ఖాతాల్లో రూ. 50 వేలు జమ చేయడం ద్వారా వారికి కొంతవరకైనా వెసులుబాటు కలుగుతుందన్నారు. మిగతా సొమ్మును మరో రెండు దఫాల్లో చెల్లించే అంశాన్ని పరిశీలిస్తున్నామని మంత్రి చెప్పారు. బ్యాంకులు రుణ మాఫీకి సంబంధించి వివరాలు సేకరించడంలో జాప్యం జరుగుతోందని, వీలైనంత త్వరలో వివరాలివ్వాలని ఆదేశించామన్నారు. రైతుల రుణ మాఫీకి ఒక కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు.