ఖజానాకు కిక్కు!
బీర్ల ధరలను రూ. 5 నుంచి రూ. 20 వరకు పెంచే ప్రతిపాదన
వోడ్కా, బ్రాందీ, విస్కీ బ్రాండ్లపైనా బాదుడుకు యోచన
పక్క రాష్ట్రాల్లోని ఎంఆర్‌పీలకు అనుగుణంగా మోత
మద్యం తయారీ ముడిసరుకుపై లెసైన్స్ ఫీజుల పెంపు
సర్కారీ సారాయితో వచ్చే నష్టాన్ని పూడ్చుకునేందుకు ప్రణాళికలు
సాక్షి, హైదరాబాద్: వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచి భారీ ఎత్తున ఆదాయాన్ని సమకూర్చుకునేందుకు ఆబ్కారీ శాఖ ఇప్పటి నుంచే కసరత్తు ముమ్మరం చేసింది. నాటుసారాకు విరుగుడుగా జూలై ఒకటో తేదీ నుంచి చీపెస్ట్ లిక్కర్(సారాయి)ని రాష్ట్రంలో ప్రవేశపెట్టాలని యోచిస్తున్న నేపథ్యంలో తద్వారా వచ్చే నష్టాన్ని పూడ్చుకునేందుకు గల అవకాశాలపై దృష్టిపెట్టింది. సారాయిని ప్రవేశపెట్టడం వల్ల రూ. 800 కోట్ల నుంచి రూ. 2000 కోట్ల వరకు వివిధ రూపాల్లో ఆబ్కారీ శాఖకు నష్టం వస్తుందని అంచనా. ఈ నేపథ్యంలో ఐఎంఎల్(దేశీయ మద్యం) తయారీకి వినియోగించే ముడిసరుకు మొలాసిస్, రెక్టిఫైడ్ స్పిరిట్, డీనేచర్ ్డ స్పిరిట్‌లపై లెసైన్స్ ఫీజులతోపాటు దిగుమతి, ఎగుమతి ఫీజులను కూడా పెంచాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది.
ఈ ఫీజుల ద్వారా ప్రస్తుతం వస్తున్న రూ. 27 కోట్ల ఆదాయాన్ని రెండింతలు చేసుకోవాలని ప్రాథమిక నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అలాగే రాష్ట్రంలో సాగుతున్న మద్యం విక్రయాల ద్వారా నెలకు రూ. 800 కోట్ల వరకు రాబడి వస్తున్నప్పటికీ వ్యాట్ పోగా ఎక్సైజ్ డ్యూటీ రూపంలో ఆబ్కారీ శాఖకు నెలకు రూ. 110 కోట్ల వరకు మాత్రమే మిగులుతోంది. ఈ మొత్తాన్ని కనీసం రూ. 200 కోట్లకు పెంచేలా ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిసింది. దీనివల్ల మద్యం ఎంఆర్‌పీ పెరిగి మందుబాబులపై భారం పడనున్నా సర్కారు అటువైపే మొగ్గు చూపుతున్నట్లు సమాచారం.
బీర్ల ధరలకు రెక్కలు
రాష్ట్రంలో బీర్ల ధరలు కొన్నేళ్లుగా పెరగలేదు. ఐఎంఎల్ ధరలను ఎప్పటికప్పుడు సవరిస్తున్నా బీర్ల ధరలు మాత్రం పెరగలేదు. బ్రూవరేజెస్ సంస్థలు ఒత్తిడి తేవడంతో 10 నుంచి 20 శాతం వరకు రేట్లు పెంచాలని బ్రూవరేజెస్ కార్పొరేషన్ ఏడాది క్రితమే ప్రభుత్వానికి నివేదించింది. అయితే బీర్ల ధరలు పెంచడం వల్ల తయారీ సంస్థలకే ప్రయోజనం కలుగుతుందని భావిస్తున్న ప్రభుత్వం అందుకు ఒప్పుకోవడం లేదు. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో తయారీ సంస్థలతో సంబంధం లేకుండా ఎంఆర్‌పీ ధరలను పెంచి, వచ్చే అదనపు ఆదాయాన్ని తన ఖాతాలో వేసుకోవాలని ఎక్సైజ్ శాఖ నిర్ణయించిన ట్లు సమాచారం.
ఈ మేర కు అదనపు కమిషనర్ ప్రసాద్ నేతృత్వంలో తాజా ప్రతిపాదనలు సిద్ధం చేసిన కమిషనర్ అహ్మద్ నదీం సంబంధిత నివేదికను గురువారం ప్రభుత్వానికి పంపినట్లు సమాచారం. తద్వారా 96 శాతం మార్కెట్ వాటా ఉన్న రూ. 85, రూ. 90 ఎంఆర్‌పీ గల 650 ఎంఎల్ బీర్ల ధర ఐదు రూపాయలు పెరిగి రూ. 90, రూ. 95కి చేరుతుంది. అలాగే 4 శాతం మార్కెట్ షేర్ ఉన్న 110 రూపాయల ఎంఆర్‌పీ విలువ గల బీర్ల ధరలను రూ. 130కి పెంచాలని ప్రతిపాదించారు. 330 ఎంఎల్ బీర్ల ధరలు కూడా రూ. 2 నుంచి రూ. 5 వరకు పెంచే అవకాశం ఉంది.
తద్వారా నెలకు రూ. 65 కోట్ల నుంచి రూ. 70 కోట్ల ఆదనపు రెవెన్యూ ఆర్జించవచ్చని నివేదిక రూపొందించారు. వచ్చే మార్చి నెల నుంచి వేసవి సందర్భంగా బీర్లకు డిమాండ్ పెరగనున్న నేపథ్యంలో కొత్త రేట్లను అప్పటి నుంచే అమల్లోకి తేవాలని ఆబ్కారీ శాఖ భావిస్తోంది. వీటితో పాటు ఇతర రకాల మద్యం ఎంఆర్‌పీ రేట్లను కూడా భారీగా పెంచే ఆలోచనలో ఉన్నట్లు సమాచారం.
మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాల్లో తెలంగాణ, ఏపీల కన్నా ఎంఆర్‌పీ అధికంగా ఉన్న నేపథ్యంలో ధరలను సవరించాలని అధికారులు యోచిస్తున్నారు. 750 ఎంఎల్ స్మిర్నాఫ్ బ్రాండ్ వోడ్కా ఎంఆర్‌పీ తెలంగాణలో రూ. 700 ఉంటే మహారాష్ట్రలో రూ. 980గా ఉంది. అలాగే బ్రాందీ, విస్కీ ధరలను కూడా సరిపోల్చి క్రమబద్ధీకరించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకోవాలని సర్కారు యోచిస్తోంది.