
రాత్రీపగలూ కిక్కే కిక్కు
రాత్రీపగలు లేదు.. ఉదయం సాయంత్రం లేదు.. ఇక నుంచి ఎప్పుడైనా మందు గ్లాసులు గలగలలాడనున్నాయి.. ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 3 వరకు బార్లన్నీ తెరిచే ఉండనున్నాయి.
* బార్లలో మూడు గంటలు మినహా రోజంతా
* మద్యం విక్రయాలకు సర్కారు నిర్ణయం
* ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 3 వరకు అమ్మకాలు
* సన్నాహాలు చేస్తున్న ఎక్సైజ్ శాఖ
* పెద్ద షాపింగ్ మాల్స్‌లోనూ మద్యం విక్రయాలు
* నూతన మద్యం విధానంలో స్పష్టతనిచ్చే అవకాశం
* ప్రస్తుత మద్యం దుకాణాలు, బార్లకు లెసైన్స్ గడువు పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాత్రీపగలు లేదు.. ఉదయం సాయంత్రం లేదు.. ఇక నుంచి ఎప్పుడైనా మందు గ్లాసులు గలగలలాడనున్నాయి.. ఉదయం 6 నుంచి అర్ధరాత్రి 3 వరకు బార్లన్నీ తెరిచే ఉండనున్నాయి. హైదరాబాద్‌లో పర్యాటక రంగం అభివృద్ధి, విదేశీ టూరిస్టులను ఆకర్షించేందుకు బార్లు, స్టార్ హోటళ్లు, టూరిజం హోటళ్లలో ప్రతిరోజూ 24 గంటలూ మద్యం విక్రయాలు జరిపేందుకు ఎక్సైజ్ శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. అయితే అవసరం, అవకాశాన్ని బట్టి తెల్లవారుజామున 3 గంటల నుంచి 6 గంటల వరకు మాత్రం స్వల్ప విరామం ఇవ్వాలని భావిస్తున్నట్లు సమాచారం.
త్వరలో అమల్లోకి తీసుకురానున్న నూతన మద్యం విధానంలో దీనికి సంబంధించిన విధివిధానాలను పేర్కొనే అవకాశముంది. అంతేకాకుండా హైదరాబాద్ పరిధిలోని పెద్దపెద్ద షాపింగ్ మాల్స్‌లో ఖరీదైన మద్యాన్ని విక్రయించేందుకు ప్రత్యేకంగా అనుమతులు మంజూరు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలిసింది. ఐటీ, బల్క్‌డ్రగ్, ఫార్మా, బీపీవో, కేపీవో వంటి రంగాలతోపాటు పెట్టుబడులకు స్వర్గధామంగా హైదరాబాద్‌ను తీర్చిదిద్దుతున్న తరుణంలో ఇక్కడికి వచ్చిపోయే విదేశీ టూరిస్టుల సంఖ్య బాగా పెరుగుతుందని, ఈ నేపథ్యంలోనే కొత్త విధానానికి ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని ఎక్సైజ్ వర్గాలు చెబుతుండడం గమనార్హం.
కిక్కే.. కిక్కు..: గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో సుమారు 350 వరకు మద్యం దుకాణాలు, మరో 375 వరకు లెసైన్సుడు బార్లు ఉన్నాయి. ప్రస్తుతం మద్యం దుకాణాలను ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10వరకు... బార్లను ఉదయం 10 నుంచి రాత్రి 11 గంటల వరకు తెరిచి ఉంచేందుకు అనుమతిస్తున్నారు. తాజాగా బార్లను 24 గంటల పాటూ తెరిచి ఉంచాలని ఎక్సైజ్‌శాఖ వర్గాలు నిర్ణయించాయి. దీనిపై నూతన మద్యం విధానంలో మరింత స్పష్టత రానున్నట్లు ఎక్సైజ్‌శాఖ వర్గాలు తెలిపాయి. ఇక ఇప్పటికే స్పెన్సర్స్, ఇనార్బిట్, మెట్రో వంటి మాల్స్‌లోనూ మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. నూతన విధానంలో మాల్స్‌లో మద్యం విక్రయించేందుకు వీలుగా ప్రత్యేక పాలసీ రూపొందించాలన్న నిర్ణయానికి సైతం ప్రభుత్వం వచ్చినట్లు తెలిసింది. మరోవైపు బార్లను రాత్రంతా తెరిచి ఉంచితే మందుబాబుల ఆగడాలు మితిమీరి నేరాలు పెరిగే అవకాశం ఉందనే ఆందోళన వ్యక్తమవుతోంది.
బార్ల లెసైన్స్ ఏడాది పొడిగింపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ప్రస్తుతం కొనసాగుతున్న బార ్ల లెసైన్సులను మరో ఏడాది పొడిగిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలో జూన్ 30తో బార్లు, మద్యం దుకాణాల లెసైన్సుల గడువు ముగియనుంది. అయితే నూతన మద్యం విధానం ఖరారుకాని నేపథ్యంలో బార్ల లెసైన్సులను మరో ఏడాది కాలానికి రెన్యూవల్ చేయాలని, మద్యం దుకాణాల లెసైన్స్‌లను మరో 3 నెలలకు రెన్యూవల్ చేయాలని నిర్ణయించిం ది. ఈ మేరకు బుధవారం మెమో జారీ చేసింది. దీంతో ఇప్పుడున్న లెసైన్సు ఫీజుల తోనే జూన్ 30లోపు మద్యం దుకాణాలు, బార్ల యజమానులు రెన్యూవల్ చేయించుకోవాల్సి ఉంటుంది.
అయితే నూతన మద్యం పాలసీపై ఈ నెల రెండోవారంలోనే సీఎం అధికారులతో సమీక్షించారు. గుడుంబాకు ప్రత్యామ్నాయంగా చౌక మద్యం విక్రయాలు సాగించాలంటూ వారు ఇచ్చిన నివేదికలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రజల ఆరోగ్యాన్ని నాశనం చేయని విధంగా సమగ్ర విధానం రూపొందించాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం రాష్ట్రంలో విక్రయాలు సాగిస్తున్న 2,111 (2,216 మద్యం దుకాణాలకు గాను జీహెచ్‌ఎంసీలోని 105 షాపుల లెసైన్స్‌లు ఎవరూ తీసుకోలేదు) మద్యం దుకాణాల లెసైన్సులను మూడు నెలలు పొడిగించాలని నిర్ణయించారు. బార్ల విషయంలో కొంత తర్జనభర్జన అనంతరం మరో ఏడాది రెన్యూవల్ చేయాలని నిర్ణయించారు. దీంతో రాష్ట్రంలోని 766 బార్లు, 26 క్లబ్బులు ఏడాది పాటు పాత విధానంలోనే కొనసాగుతాయి.