రుణమాఫీ షురూ | loan waiver started in telangana | Sakshi
Sakshi News home page

రుణమాఫీ షురూ

Published Tue, Sep 23 2014 1:50 AM | Last Updated on Sat, Sep 2 2017 1:48 PM

కేసీఆర్‌కు  నివేదికను అందజేస్తున్న డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రులు

కేసీఆర్‌కు నివేదికను అందజేస్తున్న డిప్యూటీ సీఎం రాజయ్య, మంత్రులు

రైతులకు రుణ మాఫీలో భాగంగా తొలి విడతగా 25 శాతం నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది.

 తొలివిడతగా బ్యాంకులకు 25 శాతం చెల్లింపు
 మంత్రివర్గ ఉపసంఘం నివేదికకు సీఎం కేసీఆర్ ఆమోదం

 
 సాక్షి, హైదరాబాద్: రైతులకు రుణ మాఫీలో భాగంగా తొలి విడతగా 25 శాతం నిధులను తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసింది. రూ. 4,250 కోట్ల మొత్తాన్ని బ్యాంకులకు చెల్లించేందుకు ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. దీంతో కొత్త రుణాల మంజూరుకు మార్గం సుగమం చేసింది. రుణమాఫీ పథకంలో భాగంగా దాదాపు 36 లక్షల మంది రైతులకు సుమారు రూ. 17 వేల కోట్ల రుణాలు మాఫీ కానున్న సంగతి తెలిసిందే. దీని అమలుపై వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన ఇటీవలే ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం వరుసగా సమావేశాలు నిర్వహించి సోమవారం మధ్యాహ్నం ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావుకు నివేదిక అందించింది. అరగంటలోనే ఈ నివేదికను కేసీఆర్ ఆమోదించారు. తక్షణమే తొలివిడత నిధుల విడుదలకు జీవో జారీ చేయాలని ఆర్థిక శాఖ అధికారులను ఆదేశించారు. దీంతో ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణారావు పేరుతో సంబంధిత ఉత్తర్వులు జారీ అయినట్లు మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఈటెల రాజేందర్, మహేందర్‌రెడ్డి మీడియాకు వెల్లడించారు. ఎంపీ బాల్క సుమన్, ఎమ్మెల్యే సత్యనారాయణ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, వ్యవసాయ శాఖ ముఖ్యకార్యదర్శి పూనం మాలకొండయ్య కూడా మీడియా సమావేశంలో పాల్గొన్నారు.
 
 మిగిలిన మొత్తాన్నీ ప్రభుత్వమే చెల్లిస్తుంది..
 
 ప్రతీ రైతు తీసుకున్న రుణంలో తొలివిడతగా 25 శాతం మొత్తాన్ని బ్యాంకులకు చెల్లిస్తామని, మిగిలిన 75 శాతం నిధులను కూడా ప్రభుత్వమే చెల్లిస్తుందని మంత్రులు వెల్లడించారు. ఇందుకు బ్యాంకులు కూడా అంగీకరించాయని తెలిపారు. దీనిపై మంగళవారం మధ్యాహ్నం బ్యాంకర్లతో మరో సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కాగా, మిగతా మొత్తాన్ని ఎప్పుడు చెల్లిస్తారన్న విలేకరుల ప్రశ్నకు ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పందిస్తూ.. ఆ విషయాన్ని తాము బ్యాంకులతో మాట్లాడుకుంటామన్నారు. ప్రభుత్వం మాట ఇస్తే దాన్ని తప్పక నెరవేర్చుతుందని... తమది చిట్‌ఫండ్ సంస్థనో, ప్రైవేట్ కంపెనీనో కాదని వ్యాఖ్యానించారు. మొత్తం రుణాలను ప్రభుత్వమే చెల్లిస్తున్నందున రైతులకు ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు. తక్కువ మొత్తం రుణాలు తీసుకున్న రైతులకు తొలివిడతలోనే పూర్తిగా మాఫీ చేయాలన్న ప్రతిపాదనలు వచ్చినప్పటికీ.. రైతులందరికీ సమానంగా లబ్ధి చేకూరాలన్న ఉద్దేశంతో తమ ప్రభుత్వం సాహసోపేతమైన నిర్ణయం తీసుకున్నట్లు మంత్రులు ఈ సందర్భంగా పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో తమ పార్టీ రైతులకు ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని, ఈ నిర్ణయం రైతులందరికీ హర్షదాయకమని వ్యాఖ్యానించారు. రుణమాఫీ ఎలా చేస్తారంటూ ప్రతిపక్షాలు గగ్గోలుపెడుతూ రోజుకో రకంగా మాట్లాడుతున్నాయని, తమది చేతల ప్రభుత్వమే తప్ప.. మాటల ప్రభుత్వం కాదని అన్నారు. ప్రజా శ్రేయస్సే ముఖ్యమని భావించడం వల్లే ప్రభుత్వానికి భారమైనప్పటికీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించారు. వాణిజ్య పంటలు వేసిన రైతులకూ మాఫీ వర్తిస్తుందని పేర్కొన్నారు.
 
  తక్షణమే కొత్త రుణాలు..
 
  రైతుల రుణ భారాన్ని ప్రభుత్వమే పూర్తిగా నెత్తికి ఎత్తుకున్నందున బ్యాంకులు వెంటనే సాధ్యమైనంత ఎక్కువగా ఖరీఫ్ రుణాలను ఇవ్వాలని మంత్రులు కోరారు. రైతులకు ఇచ్చే రుణ పరిమితి పెంపు(స్కేల్ ఆఫ్ ఫైనాన్స్), ప్రస్తుతం చెల్లించిన 25 శాతం రుణం, వినియోగ రుణం(కన్సంప్షన్ ఆఫ్ లోన్) కలిపి బ్యాంకులు అధికమొత్తంలో రుణాలు ఇస్తాయని ఆశిస్తున్నట్లు చెప్పారు. కొత్త రుణాల మంజూరును వేగవంతం చేసేందుకు జిల్లాలవారీగా మంత్రులు పర్యవేక్షిస్తారని పోచారం శ్రీనివాస్‌రెడ్డి చెప్పారు. రుణమాఫీ అమలుకు సంబంధించి మండల, డివిజన్, జిల్లా స్థాయిలో ప్రత్యేక కమిటీలను నియమించి మార్గదర్శకాలు జారీ చేసినట్లు మంత్రి వివరించారు. ఈ నెలాఖరు దాటితే రైతుల రుణాలను సకాలంలో చెల్లించని రుణాలుగా పరిగణించి, బ్యాంకులు 12 శాతం వడ్డీ వసూలు చేస్తాయని, రైతులకు కొత్త రుణాలు రావాలన్న ఉద్దేశంతోనే తొలివిడత చెల్లింపునకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. వెంటనే రుణాలను రెన్యూవల్ చేయడం వల్ల ఏడు శాతమే వడ్డీ పడుతుందని ఇందులో కేంద్ర ప్రభుత్వం నాలుగు శాతం, రాష్ట్ర ప్రభుత్వం మూడు శాతం వడ్డీ రాయితీని భరిస్తాయని వివరించారు. పంటలపై బంగారం తాకట్టు రుణాలకూ రుణమాఫీ వర్తిస్తుందన్నారు. రైతుల పంటల బీమాకూ ఇక ఢోకా ఉండదన్నారు. కాగా, బీమా గడువు ఈ నెలాఖరుతో తీరుతున్నందున.. దీన్ని వచ్చే నెల 15 వరకు పొడిగించాలని కూడా ఇన్సూరెన్స్ కంపెనీలను ప్రభుత్వం కోరే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇక బోగస్ పట్టాదారు పుస్తకాలతో, పంటలు వేయకుండా రుణాలు తీసుకున్న వారి వివరాలు ఇంకా పూర్తిగా అందలేదని మంత్రులు తెలిపారు. రుణమాఫీ నిధుల విడుదలపై ఎమ్మెల్యే వి.శ్రీనివాస్ గౌడ్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు.
 
 
 ఫిర్యాదులకు ప్రత్యేక కేంద్రాలు
 
 రుణమాఫీ అమలు పర్యవేక్షణ, ఫిర్యాదుల పరిష్కారానికి ప్రత్యేక కేంద్రాల(గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సెల్స్)ను ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీచేసింది. మండల స్థాయిలో తహసిల్దార్ చైర్మన్‌గా, ఏడీఏ/మండల వ్యవసాయాధికారి కన్వీనర్‌గా, బ్యాంకర్లు, ఎంపీడీవోలు, కలెక్టర్ నియమించే ఇతర సభ్యులతో ఈ కేంద్రాలను ఏర్పాటు చేస్తారు. జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్‌గా, వ్యవసాయ శాఖ జేడీఏ కన్వీనర్‌గా ప్రత్యేక సెల్‌ను ఏర్పాటు చేస్తారు. ఇందులో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్, జిల్లా కోఆపరేటివ్ ఆడిట్ ఆఫీసర్లు, కలెక్టర్ నియమించే ఇతర సభ్యులు ఉంటారు. ఇక రాష్ట్ర స్థాయిలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి చైర్మన్‌గా, వ్యవసాయ కమిషనర్ కన్వీనర్‌గా ఉంటారు. ఇందులో రెవెన్యూ ముఖ్య కార్యదర్శి, వ్యవసాయ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థికశాఖ ప్రత్యేక కార్యదర్శి, కోఆపరేషన్ అండ్ రిజిస్ట్రార్ ఆఫ్ కోఆపరేటివ్ సొసైటీల కమిషనర్, ఎస్‌ఎల్‌బీసీ కన్వీనర్, నాబార్డు చీఫ్ జనరల్ మేనేజర్, ఆప్కాబ్ ఎండీ, ఏపీజీవీబీ రీజనల్ చైర్మన్ సభ్యులుగా ఉంటారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement