
లోక్‌సత్తాలో కుమ్ములాటలు
దెబ్బతిన్న ఆ పార్టీ వ్యవస్థాపకుడి లక్ష్యం
సాక్షి, హైదరాబాద్: వరుసగా ఎన్నికల్లో ఓటమి పాలైన లోక్‌సత్తా పార్టీ జాతీయ పార్టీగా మారబోయి బొక్కబోర్లా పడింది. ఢిల్లీలో ఆమ్‌ఆద్మీ పార్టీ విజయం నేపథ్యంలో ఇక్కడ ఓటమి పాలైనా ఇతర రాష్ట్రాల్లో అవకాశాలు చూసుకోవాలన్న ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు జయప్రకాష్ నారాయణ లక్ష్యం ఆదిలోనే బెడిసికొట్టింది. ఉత్తరాదికి చెందినవారిని పార్టీ జాతీయ అధ్యక్ష పదవిలో ఉంచితే ఇతర రాష్ట్రాల్లోనూ పార్టీ విస్తరించవచ్చనేది జేపీ ఆలోచన. ఆయన ఆలోచనలకు భిన్నంగా పార్టీ బలంగా ఉన్న రాష్ట్రాల నేతలు లేకుండా ఇతర రాష్ట్రాల నేతల నాయకత్వంలో తాము పనిచేయడం ఏమిటంటూ ఏపీ నేతలు ఎదురుతిరిగారు. ఈ వివా దం ముదిరిపోయి రోడ్డున పడేదాకా వచ్చింది. జేపీ అధ్యక్ష పదవి నుంచి వైదొలుగుతూ జాతీ య కౌన్సిల్ సభ్యులే కొత్త అధ్యక్షుడిని ఎన్నుకోవాలని సూచించారు.
30 మందిలో ముగ్గురే ఉన్న తెలుగు రాష్ట్రాల నేతల ఆలోచనలకు భిన్నంగా జాతీయ కౌన్సిల్ అధ్యక్షుడిగా మహా రాష్ట్రకు చెందిన సురేంద్ర శ్రీవాత్సవ ఎన్నికయ్యారు. ఆయన్ని నాయకుడిగా అంగీకరించబోమంటూ ఏపీ శాఖ బహిరంగంగా విమర్శలు చేయగా, తెలంగాణ శాఖ అంతర్గత సమావేశాల్లో అసంతృప్తిని వెళ్లగక్కింది. ఈ నేపథ్యంలో నోటీసులు ఇవ్వకుండానే ఏపీ నేతలను పార్టీ నుంచి తొలగిస్తున్నట్టు సురేంద్ర ప్రకటించడంతో వివాదం ముదిరింది. ఈ మొత్తం వ్యవహారంలో జేపీ పూర్తిగా సురేంద్ర శ్రీవాత్సవకు మద్దతు పలుకుతూ వచ్చారు. లోక్‌సత్తాలో కీలకంగా పనిచేసిన కటారి శ్రీనివాసరావు, డీవీవీఎస్ వర్మ వంటి నేతలు పార్టీ నుంచి సస్పెండైన తర్వాత తమదే అసలైన లోక్‌సత్తా పార్టీగా ప్రకటించుకున్నారు. దీంతో త్వరలో జేపీ జిల్లా పర్యటనలు మొదలు పెట్టాలని ఆలోచిస్తున్నారు. త్వరలో తామూ జిల్లాల్లో పర్యటిస్తామని పోటీ వర్గానికి చెందిన జాతీయ కమిటీ అధ్యక్షుడు కటారి శ్రీనివాసరావు చెప్పారు.